పెట్రోలు కొరత లేదు
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:45 PM
జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా కొరత లేదని, అవసరానికి తగినంత నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ డా.ఏ. సిరి తెలిపారు.
ప్రజలు ఆందోళన చెందవద్దు
కలెక్టర్ డా.ఏ. సిరి
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా కొరత లేదని, అవసరానికి తగినంత నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ డా.ఏ. సిరి తెలిపారు. శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స హాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలపై జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌తో కలిసి కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స నిర్వహించారు. జిల్లాలో రోజువారీగా సగటున 2,36,000 లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతుండగా.. ప్రస్తుతం జిల్లాలో 7 లక్షల లీటర్ల పెట్రోల్ నిల్వ ఉందని తెలిపారు. అదనంగా ట్రాన్సిట్‌లో 6,39,000 లీటర్లు ఉండటంతో మొత్తం కలిపి 13,19,439 లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందని వెల్లడించారు. ఈ నిల్వలతో 6 నుంచి 7 రోజుల వరకు సరఫరా కొనసాగించగలమని స్పష్టం చేశారు. డీజిల్ కొరత కూడా లేదని తెలిపారు. జిల్లాలో రోజుకు సగటున 3,16,848 లీటర్ల డీజిల్ సరఫరా జరుగుతుండగా.. ప్రస్తుతం 5,65,000 లీటర్ల డీజిల్ నిల్వ, ట్రాన్సిట్‌లో 5,06,564 లీటర్లు ఉందని తెలిపారు. . మొత్తం కలిపి 11 లక్షల లీటర్లు డీజిల్ అందుబాటులో ఉండటంతో సుమారు 4 రోజుల సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు.
పెట్రోల్ బంకుల తనిఖీ
నగరంలోని శనివారం సూర్య దేవాలయం పక్కన ఉన్న హెచపీ పెట్రోల్ బంకు, బళ్లారి చౌరస్తాలోని నయారా పెట్రోల్ బంకును జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తనిఖీ చేశారు. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. ఎలాంటి అక్రమాలు జరగకూడదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ అవసరానికి తగినంత నిల్వ ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.