పేపర్లు లేవు..
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:18 PM
రాష్ట్రవ్యాప్తంగా వార్డుసచివాలయాల పేరును స్వర్ణగ్రామం - స్వర్ణవార్డు శాఖగా ప్రభుత్వం పేరును మార్పుచేసింది.
స్వర్ణగ్రామం - స్వర్ణవార్డు శాఖ
పేరిట నూతన ధ్రువీకరణ పత్రాలు
పూర్తిస్థాయిలో ముద్రణలేక
అరకొర సరఫరా
స్వర్ణవార్డు శాఖల్లో..మీసేవా కేంద్రాలలో
ఖాళీ పత్రాల కొరత
ధ్రువీకరణ పత్రాలు అందక
ప్రజల ఇబ్బందులు
పత్తికొండ, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా వార్డుసచివాలయాల పేరును స్వర్ణగ్రామం - స్వర్ణవార్డు శాఖగా ప్రభుత్వం పేరును మార్పుచేసింది. అంతేకాకుండా గతంలో గ్రామవార్డు సచివాలయం పేరిట ఉన్న ధ్రువీకరణపత్రాల స్థానంలో స్వర్ణగ్రామం - స్వర్ణవార్డు శాఖగా మార్పుచేసి కొత్త ధ్రువీకరణపత్రాలను అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రజలకు అవసరమైన స్థాయిలో కొత్త ధ్రువీకరణపత్రాలను ప్రభుత్వం ముద్రించకపోవడంతో పత్రాల కొరత ఏర్పడింది. దీంతో వివిధ అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు సమయానికి పత్రాలు అందక ఇటు స్వర్ణవార్డుకేంద్రాలు అటు మీసేవాకేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.
ప్రజల ఇక్కట్లు
ఇటు పాఠశాలలు అటు కళాశాలలో కొత్తగా అడ్మిషన తీసుకునే విద్యార్థులతో పాటు వివిధ ఉద్యోగావకాశాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకునే నిరుద్యోగులకు అవసరమైన ఽధ్రవీకరణ పత్రాలు సమయానికి అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. అలాగే రైతులు పంటల సాగుకోసం బ్యాంకు రుణాలు, పంటలబీమా చేసుకునేందుకు అవసరమైన అడంగల్‌తోపాటు ధ్రువీకరణపత్రాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రస్థాయిలో ఏర్పడిన కొరత కావడంతో స్థానిక అధికారులు కూడా ఖాళీ ధ్రువీకరణ పత్రాలవిషయంలో తామేమిచేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఉన్నతాధికారులు ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యపరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నా
బ్యాంకులో పంట రుణం తీసుకునేందుకు, సాగుచేసిన పంట బీమా చేసేందుకు అవసరమైన ఈ అడంగల్ పత్రాల కోసం నాలుగు రోజులుగా మీసేవాకేంద్రం చుట్టూ తిరుగుతున్నాను. ఖాళీపేపర్లు లేవని అ డంగల్ ప్రింట్ ఇవ్వలేమని చెబుతున్నారు. ఎప్పుడు ఖాళీపేపర్లు రా వాలి మాకు ఎప్పుడు అడంగల్ కాపీలు ఇవ్వాలి. అధికారులు సమస్యను పట్టించుకోవాలి.
- క్రిష్ణయ్య, రైతు
ఖాళీ ధ్రువీకరణ పత్రాలు అయిపోయాయి
కొత్తగా ప్రభుత్వం మార్పు చేసిన స్వర్ణగ్రామం - స్వర్ణవార్డుశాఖ పేరి ట ముద్రించిన ఖాళీపత్రాలు అవసరమైన మేర ప్రభుత్వం నుంచి సరఫరా కావడం లేదు. తమకు అందినమేరకు ధ్రువీకరణ పత్రాలు ప్రింట్‌లు అందించాం. మూడురోజులుగా ధ్రువీకరణ పత్రాలు అయిపోవడంతో విద్యార్థులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు.
- ఇర్ఫాన, మీసేవా నిర్వాహకుడు