Share News

పల్లెల్లో పంతుళ్లు!

ABN , Publish Date - May 11 , 2026 | 01:11 AM

‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమం ప్రస్తుతం జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతోంది. గతేడాది వేసవి సెలవులు ముగిసే కొద్దిరోజుల ముందు ఈ కార్యక్రమం నిర్వహించినా అంతగా ఫలితాలు రాలేదు. పాఠశాలలు పునఃప్రారంభించిన తర్వాత లెక్కలు తీస్తే 140కిపైగా ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతిలో ఒక్క అడ్మిషన్‌ కూడా లేదు. దీంతో ఈ ఏడాది ముందస్తుగా వేసవి సెలవుల్లోనే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు లక్ష్యాలను నిర్థేశించారు. గతేడాది కన్న 10శాతం అధికంగా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో జిల్లా అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. వేసవి సెలవులు ముగిసేలోగా ఎంతమేర విద్యార్థులను చేరుస్తారో చూడాలి.

పల్లెల్లో పంతుళ్లు!

- ‘బడి పిలుస్తోంది’ అంటూ ఇంటింటా ప్రచారం

- ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి

- ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై విస్తృత ప్రచారం

- ఈ ఏడాది ఒకటో తరగతిలో 8,353 మందిని చేర్పించాలని ప్రభుత్వ లక్ష్యం

- తొలుత అంగన్‌వాడీ కేంద్రాలపై దృష్టి సారించిన ఉపాధ్యాయులు

- సౌకర్యాలు లేని ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులను రప్పించేందుకు ప్రయత్నాలు

- సెలవుల్లోనూ పనిచేయిస్తున్నందున వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని టీచర్ల డిమాండ్‌

‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమం ప్రస్తుతం జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతోంది. గతేడాది వేసవి సెలవులు ముగిసే కొద్దిరోజుల ముందు ఈ కార్యక్రమం నిర్వహించినా అంతగా ఫలితాలు రాలేదు. పాఠశాలలు పునఃప్రారంభించిన తర్వాత లెక్కలు తీస్తే 140కిపైగా ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతిలో ఒక్క అడ్మిషన్‌ కూడా లేదు. దీంతో ఈ ఏడాది ముందస్తుగా వేసవి సెలవుల్లోనే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు లక్ష్యాలను నిర్థేశించారు. గతేడాది కన్న 10శాతం అధికంగా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో జిల్లా అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. వేసవి సెలవులు ముగిసేలోగా ఎంతమేర విద్యార్థులను చేరుస్తారో చూడాలి.

- ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం

8,353 మందిని చేర్పించాలని లక్ష్యం

ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది 8,353 మంది చిన్నారులను చేర్చాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉపాధ్యాయులు, ఎంఈవోలు వేసవి సెలవుల్లోనూ ఇంటింటికీ తిరిగి 1వ తరగతిలో అధిక సంఖ్యలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో 5,858 మంది పిల్లలను చేర్పించారు. ఈ ఏడాది ఈ లక్ష్యాన్ని 8,353 పెంచారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే ప్రయత్నంలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు గ్రామాల బాట పట్టారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు తొలిగా అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి అక్కడ ఐదేళ్లు నిండిన పిల్లలు ఉంటే వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులను ఒప్పిస్తున్నారు. మరోవైపు సౌకర్యాలు, టీచర్‌లు, నిర్వహణ సక్రమంగా లేని ప్రైవేటు పాఠశాలలను గుర్తించి అక్కడ ఉన్న పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని కూడా తల్లితండ్రులను కోరుతున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4,120 మంది పిల్లలను 1వ తరగతిలో చేర్పించినట్లు విద్యాశాఖ అధికారులు లెక్కలు చూపుతున్నారు.

చిన్నారుల సంఖ్య తగ్గడంతో..

గతంలో ఒక కుటుంబంలో నలుగురైదుగురు పిల్లలు ఉండేవారు. ప్రస్తుతం ఒక కుటుంబంలో ఒకరు లేక ఇద్దరు సంతానం మాత్రమే ఉంటున్నారు. దీంతో పిల్లల సంఖ్య రానురాను గణనీయంగా తగ్గుతోంది. ఇంటిలో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం నగదు ఇస్తుండటంతో తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లోనే చేర్పించేందుకు ఇష్టపడుతున్నారు. తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని చెప్పుకోవడానికి కొంతమేర ఇబ్బంది పడే సందర్భాలు ఉండటంతో, ఖర్చులు అధికమైనా ప్రైవేటు పాఠశాలల్లోనే పిల్లలను చదివిస్తున్నారు. తల్లికి వందనం పథకం ద్వారా వచ్చే నగదుతో పాటు మరికొంత అదనంగా ఖర్చు చేసి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకే పంపుతుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య ఏటా తగ్గిపోతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలు ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ నెలలో స్కూల్‌ కాంప్లెక్స్‌లు, ఇతరత్రా శిక్షణా కార్యక్రమాల పేరుతో టీచర్లు పాఠశాలల్లో అందుబాటులో ఉండనిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని పిల్లల తల్లిదండ్రులు గమనిస్తున్నారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు పిల్లలకు సక్రమంగా పాఠ్యాంశాలు బోధించరనే అపవాదు ఉండటంతో ప్రైవేటు పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు.

సౌకార్యాలు ఉన్నా పెరగని సంఖ్య

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం ద్వారా రెండు దశల్లో పాఠశాలలకు నూతన భవనాలు సమకూరాయి. కానీ అక్కడ పిల్లలు లేకపోవడంతో పాఠశాల భవనాలు అక్కరకురాని స్థితి నెలకొంది. ఉదాహరణకు మొవ్వ మండలం మొవ్వ ఉన్నత పాఠశాల పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలకు ఇటీవల నూతన భవనం నిర్మించారు. కానీ ఈ పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు ఏడుగురు పిల్లలు మాత్రమే ఉన్నారు. పెడన మండలం నందమూరు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు తొమ్మిది మంది పిల్లలు చదువుతుండగా, అక్కడ ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. జిల్లాలో 25 మండలాలు ఉండగా ఒక్కో మండలంలో కనీసంగా ఐదారు పాఠశాలల్లో పిల్లల సంఖ్య ఎడెనిమిదికి మించిలేదని విద్యాశాఖ అధికారులే చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి, అక్కడ పిల్లల సంఖ్యను పెంచేందుకు విద్యాశాఖ అధికారులు, సంబంధిత పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్‌లు ఎంతమేర శ్రద్ధ తీసుకుంటారో చూడాలి. వేసవి సెలవుల్లోనూ తమతో అనధికారికంగా పనిచేయిస్తున్నారని, సెలవులు వాడుకోని నేపథ్యంలో నెలరోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇప్పించాలని టీచర్‌లు కోరుతున్నారు.

లక్ష్యం చేరుకునే వరకు పనిచేస్తాం

ఈ ఏడాది జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 8,353 మంది పిల్లలను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికి 4,120 మందిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాం. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి లక్ష్యాన్ని చేరుకునేందుకు కసరత్తు చేస్తున్నాం. లక్ష్యం చేరుకునే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం.

- యు.వి.సుబ్బారావు, డీఈవో

Updated Date - May 11 , 2026 | 01:12 AM