Share News

బెజవాడలో చోరీలు.. నేపాల్‌లో విక్రయాలు!

ABN , Publish Date - Feb 04 , 2026 | 01:14 AM

విజయవాడకు చెందిన ఫోన్లు దేశ సరిహద్దులు దాటేశాయి. నేపాల్‌ దేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. నగరంలో సెల్‌ఫోన్లను చోరీ చేసిన బిహార్‌ గ్యాంగ్‌ వాటిని దేశ సరిహద్దులు దాటించేసింది. ఓ ఎలకా్ట్రనిక్స్‌ షాపులో జరిగిన చోరీ కేసును సీసీఎస్‌ పోలీసులు న్యాట్‌గ్రిడ్‌ ద్వారా ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆరుగురు నిందితులు విజయవాడలో చోరీలకు దిగినట్టు గుర్తించారు. వాటి ఫొటోలను ఫుటేజీల నుంచి తీసుకుని న్యాట్‌గ్రిడ్‌లో వేశారు. ఇందులో బిహార్‌లోని మోతీహరి జిల్లాకు చెందిన సూరజ్‌కుమార్‌ సహాని వివరాలు వచ్చాయి. దీంతో మొత్తం తీగను లాగడం మొదలుపెట్టారు. చోరీలో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నట్టు తేలింది.

బెజవాడలో చోరీలు.. నేపాల్‌లో విక్రయాలు!

విజయవాడను టార్గెట్‌ చేసిన బిహార్‌ గ్యాంగ్‌!

నిందితులంతా మోతీహరి జిల్లాకు చెందిన వారే..

గ్యాంగ్‌ లీడర్‌గా గోవింద్‌ చౌదరి

చోరీకి వచ్చిన వారికి రూ.30వేలు

మోతీహరిలో రూ.50లక్షల ఫోన్లను కొట్టేసిన గ్యాంగ్‌

‘న్యాట్‌’లో పట్టిన సీసీఎస్‌

ఇద్దరు నిందితులను పట్టుకున్న కాప్స్‌

ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తరలింపు

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

విజయవాడకు చెందిన ఫోన్లు దేశ సరిహద్దులు దాటేశాయి. నేపాల్‌ దేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. నగరంలో సెల్‌ఫోన్లను చోరీ చేసిన బిహార్‌ గ్యాంగ్‌ వాటిని దేశ సరిహద్దులు దాటించేసింది. ఓ ఎలకా్ట్రనిక్స్‌ షాపులో జరిగిన చోరీ కేసును సీసీఎస్‌ పోలీసులు న్యాట్‌గ్రిడ్‌ ద్వారా ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆరుగురు నిందితులు విజయవాడలో చోరీలకు దిగినట్టు గుర్తించారు. వాటి ఫొటోలను ఫుటేజీల నుంచి తీసుకుని న్యాట్‌గ్రిడ్‌లో వేశారు. ఇందులో బిహార్‌లోని మోతీహరి జిల్లాకు చెందిన సూరజ్‌కుమార్‌ సహాని వివరాలు వచ్చాయి. దీంతో మొత్తం తీగను లాగడం మొదలుపెట్టారు. చోరీలో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నట్టు తేలింది.

బిహార్‌లో చిక్కిన ఇద్దరు

విజయవాడలో కొద్ది రోజుల క్రితం రూ.19లక్షల విలువ గల సెల్‌ఫోన్లను దొంగిలించారు. ఈ గ్యాంగ్‌కు మోతీహరి జిల్లాకు చెందిన గోవింద్‌ చౌదరి లీడర్‌. దాని సమీప ప్రాంతం రామ్‌పుర్వాకు చెందిన నయీంమియా, మోతీహరికి చెందిన సూరజ్‌ కుమార్‌ సహాని, రోణంకుమార్‌ యాదవ్‌, జితిన్‌ సహారీ, ఫిరోజ్‌ విజయవాడలో సెల్‌ఫోన్లను కాజేసిన కేసులో నిందితులు. వారిలో నయీంమియా, సూరజ్‌కుమార్‌ను సీసీఎస్‌ పోలీసులు మోతీహరి జిల్లాలో అరెస్టు చేశారు. వారిని అక్కడి కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. అక్కడి నుంచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకువస్తున్నారు. ఆ నిందితులు బుధవారం చేరుకుంటారు. ఆ తర్వాత వారిని ఇక్కడి కోర్టులో సీసీఎస్‌ పోలీసులు హాజరుపరుస్తారు. మిగిలిన నలుగురు నిందితులు నేపాల్‌ పారిపోయినట్టు గుర్తించారు. విజయవాడలో దొంగిలించిన ఫోన్లను రైలులో బిహార్‌కు తరలించేశారు. అక్కడ కొన్ని రోజులపాటు భద్రపరిచిన తర్వాత నేపాల్‌ తీసుకెళ్లిపోయారు.

నేపాల్‌ ఎందుకు వెళ్లారంటే?

నిందితులు నేపాల్‌ వెళ్లడానికి ప్రధాన కారణం అది మోతీహరి జిల్లాకు చెంతనే ఉండడం. ఈ జిల్లాను ఆనుకుని కొన్ని కొండలు ఉన్నాయి. ఈ కొండలు దాటగానే నేపాల్‌ సరిహద్దు ప్రాంతాలు వస్తాయి. ఆ విధంగా నయీం, సూరజ్‌ మిగిలిన నిందితులను సెల్‌ఫోన్లతో సహా నేపాల్‌ సరిహద్దుల్లోకి పంపేశారు. ఈ సరుకు తమ వద్ద ఉంటే ప్రమాదకరమని భావించిన నిందితులు మొత్తం ఫోన్లను అక్కడే అమ్మేశారు. అప్పటి నుంచి అక్కడే ఉండిపోయారు. గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించిన గోవింద్‌ చౌదరి మిగిలిన నిందితులకు డబ్బులు ఎర చూపి చోరీకి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఒక్కో నిందితుడికి చోరీకి వచ్చినందుకు రూ.30వేలు ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలియవచ్చింది. విజయవాడలో చోరీకే కాకుండా బిహార్‌లోని పలు ప్రాంతాల్లో జరిగిన చోరీలకు ఈ గ్యాంగ్‌ను గోవింద్‌ చౌదరి తీసుకెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒక్క మోతీహరి జిల్లాలోని ఈ గ్యాంగ్‌ మొత్తం రూ.50లక్షల సెల్‌ఫోన్లను కొట్టేసినట్టు అక్కడి పోలీసులు విజయవాడ సీసీఎస్‌ పోలీసులకు వివరించినట్టు సమాచారం. ఇందులో జితిన్‌, సూరజ్‌ సమీప బంధువులు. సూరజ్‌కు జితిన్‌ వరుస మామ అవుతాడు.

బిహార్‌ ‘స్టూవర్టుపురం’

మోతీహరి జిల్లాలోని సీతంమాడి ప్రాంతంలో చోరీ గ్యాంగ్‌లు ఎక్కువగా ఉంటాయి. రాష్ట్రంలో స్టూవర్టుపురం ఒకప్పుడు ఎలా ఉండేదో అటువంటి ప్రాంతం సీతంమాడి. ఈ గ్రామంలో కొత్త వ్యక్తులు అడుగుపెట్టినా, కొత్త వాహనాలు కనిపించినా ప్రజలంతా ఒక్కటవుతారు. వెంటనే మూకుమ్మడి దాడి చేస్తారు. బిహార్‌ పోలీసులు అక్కడికి వెళ్లడానికి పదేపదే ఆలోచిస్తారు. అటువంటి ప్రాంతానికి వెళ్లిన సీసీఎస్‌ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మోతీహరి జిల్లాకు చేరుకున్న తర్వాత సీతంమాడి గ్రామంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకు కదిలారు. ఈ గ్యాంగ్‌పై మోతీహరి పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు ఉన్నాయి. నేపాల్‌లో తలదాచుకున్న నిందితులు నలుగురు చిక్కితే తమకు సమాచారం ఇవ్వాలని మోతీహరి పోలీసులు విజయవాడ పోలీసులను కోరారు.

Updated Date - Feb 04 , 2026 | 01:14 AM