Theft: కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో చోరీ
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:28 AM
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అర్థరాత్రి చోరీ జరిగింది.
బంగారు, వెండి నగలతో పాటు సీసీ కెమెరాల బాక్స్‌నూ ఎత్తుకెళ్లిన దొంగలు
చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.40 లక్షలు
నవంబరు 1న తొక్కిసలాట నేపథ్యంలో అప్పటి నుంచి ఆలయం మూసివేత
రెండ్రోజుల క్రితం వరకూ పోలీస్ పహరా
ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటామన్న నిర్వాహకులు
పలాస, జనవరి 12(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అర్థరాత్రి చోరీ జరిగింది. స్వామివారికి అలంకరించిన బంగారు నామాలు, వెండి శంఖ, చక్రాలు, కవచంతో పాటు మూడు హుండీలను పగలగొట్టి నగదు తస్కరించారు. వీటి విలువ రూ.40 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ప్రధాన గేటు నుంచి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు చోరీ చేసి అనంతరం ఆలయం పక్కనే ఉన్న ఐరన్ గ్రిల్‌ను తొలగించి ఉడాయించారు. ఘటనా స్థలాన్ని కాశీబుగ్గ డీఎస్పీ షహబాజ్ అహ్మద్, సీఐ వై.రామకృష్ణ పరిశీలించారు. కాశీబుగ్గకు చెందిన ఆధ్యాత్మికవేత్త హరిముకుంద పండా ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని రెండేళ్ల క్రితం నిర్మించారు. స్వామివారికి 11 కిలోల వెండి ఆభరణాలతో పాటు 9 తులాల బంగారు నామాలు చేయించి ఇటీవలే అలంకరించారు. గతేడాది నవంబరు 1న కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మృతి చెందగా, 17 మంది వరకూ తీవ్ర గాయాలైన విషయం విదితమే. ఈ ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీ నియమించి వారి ఆదేశాల మేరకే పనులు చేయించి ఆలయాన్ని తెరవాలని ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి ఆలయాన్ని మూసివేశారు.
ఈ క్రమంలో సోమవారం వేకువజామున ముకుంద పండా అల్లుడు శివకుమార్ ఆలయం తలుపులు తెరిచేందుకు వెళ్లగా ప్రధాన గేటు తాళం చెవి పెట్టగానే తాళం తెరుచుకుంది. అనుమానంతో ప్రధాన ఆలయంలోకి వెళ్లి చూసి స్వామికి అలంకరించిన వెండి, బంగారు ఆభరణాలన్నీ చోరీకి గురైనట్టు గుర్తించారు. వెంటనే ధర్మకర్త ముకుంద పండా, కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. హుండీల్లో రూ.4 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా రెండు రోజుల క్రితమే కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ మందిరాన్ని సందర్శించి విగ్రహాలకు ఉంచిన ఆభరణాలను భద్రపరచాలని, నిఘా వ్యవస్థ పటిష్ఠం చేయాలని ఆదేశించారు. ఇంతలోనే దొంగలు చొరబడి ఆలయంలో ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు.
పోలీస్ పహారా కొనసాగి ఉంటే..
తొక్కిసలాట తరువాత ప్రభుత్వం ఆలయం వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేసింది. ఆలయంలో అభివృద్ధి పనులతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తరువాత ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే దీన్ని తెరవాల్సి ఉంది. ఇక తమకు పోలీసు భద్రత అవసరం లేదని, ప్రైవేటు సెక్యూరిటీ పెట్టుకుంటామని నిర్వాహకులు చెప్పడంతో రెండు రోజుల క్రితమే పోలీసు పహారా ఎత్తివేశారు. ఇంతలోనే చోరీ జరగడం గమనార్హం. ఆలయ భద్రతకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల బాక్స్‌ను, డీవీడీలను దొంగలు ఎత్తుకెళ్లారు. ప్రధాన మార్గం, స్వామి వారి ఆలయం ఎదుట ఉన్న కెమెరాలను తొలగించిన తరువాతే చోరీకి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.