Share News

మూగబోయిన ‘బీసీ’ల స్వరం

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:04 AM

బీసీల గొంతు మూగబోయింది. ‘ఆతిథ్యం’ గుండె ఆగిపోయింది. కాంగ్రెస్‌ పార్టీలో పాతతరం తార నేల రాలింది. మాజీ ఎమ్మెల్సీ, విజయవాడలో ప్రముఖ వ్యాపారవేత్త ఐలాపురం వెంకయ్య (90) వృద్ధాప్యంతో ఆదివారం కన్నుమూశారు. ఆయన మరణం వెనుకబడిన వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

మూగబోయిన ‘బీసీ’ల స్వరం

వృద్ధాప్యంతో మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య కన్నుమూత

సీఎం చంద్రబాబు, ప్రముఖుల సంతాపం

నేడు అంత్యక్రియలు

బీసీల గొంతు మూగబోయింది. ‘ఆతిథ్యం’ గుండె ఆగిపోయింది. కాంగ్రెస్‌ పార్టీలో పాతతరం తార నేల రాలింది. మాజీ ఎమ్మెల్సీ, విజయవాడలో ప్రముఖ వ్యాపారవేత్త ఐలాపురం వెంకయ్య (90) వృద్ధాప్యంతో ఆదివారం కన్నుమూశారు. ఆయన మరణం వెనుకబడిన వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

విజయవాడ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):

ఐలాపురం వెంకయ్య విలువలకు కట్టుబడి జీవితాన్ని గడిపిన నేత. అందరితోనూ సత్సంబంధాలు నడిపారు. బాల్యంలో బెజవాడ చేరుకున్న వెంకయ్య ఇదే తన ఎదుగుదల కేంద్రంగా మార్చుకున్నారు. శ్రామికుడిగా పనిచేసిన ఆయన తర్వాత ఎంతోమంది శ్రామికులకు ఉపాధి కల్పించారు. రాజకీయాల్లో విలువలకు కట్టుబడిన నేతగా వెంకయ్యకు పేరుంది. కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న ఆయన తుది శ్వాస విడిచే వరకు మరో కండువా ముట్టుకోలేదు.

శాలివాహన సంక్షేమ సంఘానికి నేతృత్వం

జాతీయోద్యమ స్ఫూర్తితో రాజకీయ చైతన్యం పెంచుకుని కాంగ్రెస్‌కు అభిమానిగా మారారు. ఉమ్మడి రాష్ట్రంలో శాలివాహన సంక్షేమ సంఘానికి నేతృత్వం వహించారు. బీసీల సమస్యలపై గళం విప్పేవారు. ఎమ్మెల్సీగా మండలిలో తన వాదనను గట్టిగా వినిపించారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత రాజకీయాలు హద్దులు దాటి ఉన్న నాటి రోజుల్లో నేతలంతా వెంకయ్య విషయంలో మాత్రం ఏకస్వరం వినిపించేవారు. కిందిస్థాయి కార్యకర్తల నుంచి అగ్రస్థాయి నేతల వరకు అందరితో ఆయన మృదుస్వభావిగా ముద్ర వేయించుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, టి.అంజయ్య, వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్యతో సత్సంబంధాలు నడిపారు. పర్వతనేని ఉపేంద్ర ఎంపీగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 3వేల ఓట్లతో తేడాతో ఓడిపోయారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి తొలిసారిగా ఐలాపురం వెంకయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2012లో రెండో సారి స్థానిక సంస్థల కోటాలో టీడీపీ అభ్యర్థి గుత్తా శివరామకృష్ణపై 181 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఐలాపురం వెంకయ్య అంతిమయాత్ర దుర్గాపురంలోని స్వగృహం నుంచి సోమవారం ఉదయం ప్రారంభమవుతుందని ఆయన కుమారుడు రాజా తెలిపారు.

పల్నాడు నుంచి కాలినడకన విజయవాడకు..

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం తుమృకోటలో జన్మించిన ఐలాపురం వెంకయ్య కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ వైపు అడుగులు వేశారు. అక్కడ తొమ్మిదో తరగతి చదువుతూ మధ్యలో వదిలేశారు. చదువుపై ఆసక్తి ఉన్నా పుస్తకాలు పట్టుకోలేని పరిస్థితి. దీంతో బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి కాలినడకన విజయవాడ చేరుకున్నారు. ఇక్కడ కూలీగా పలుచోట్ల పనులకు వెళ్లారు. సున్నపుబట్టీలో కూలీగా పనిచేసిన ఆయన ఆ తర్వాత రైల్వేస్టేషన్‌ వద్ద సొంతంగా సున్నపు వ్యాపారం మొదలుపెట్టారు. అక్కడి నుంచి వెంకయ్య వెనక్కి తిరిగి చూడలేదు. ఇలా అంచెలంచెలుగా వ్యాపారాలు చేసిన ఆయన కొన్నాళ్లకు కాంట్రాక్టర్‌గా మారారు. నాడు మహాత్మాగాంధీ రోడ్డులో మాత్రమే స్టార్‌ హోటళ్లు ఉండేవి. కాల్వగట్టుకు చెంతనే పెద్ద హోటల్‌ నిర్మించాలన్న మనస్సులోని కోరికను ‘ఐలాపురం’తో తీర్చుకున్నారు. గాంధీనగర్‌లో ఐలాపురం హోటల్‌ను నిర్మించి దాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారు. తన మాదిరిగా పిల్లలు చదువును మధ్యలో ఆపకూడదని భావించిన వెంకయ్య నిరుపేద విద్యార్థులకు సహాయం చేశారు. వెంకయ్య రామభక్తుడు. సొంత నిధులతో ఏలూరు రోడ్డులో రామాలయాన్ని నిర్మించారు.

పలువురు ప్రముఖుల నివాళి

ఐలాపురం వెంకయ్య భౌతికకాయానికి ఆయన నివాసంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్‌, బోడె ప్రసాద్‌, శ్రీరాం తాతయ్య, సీపీఐ జాతీయ నాయకులు నారాయణ, రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, నాయకులు అక్కినేని వనజ, దోనేపూడి శంకర్‌, జి.కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. వెంకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు.

సీఎం చంద్రబాబు సంతాపం

ఐలాపురం వెంకయ్య మృతికి సీఎం చంద్రబాబు ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఆయన బీసీల అభ్యున్నతి, హక్కుల సాధన కోసం నిరంతరం పనిచేశారని కొనియాడారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ అందరితో సత్సంబంధాలు నడిపారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 01:04 AM