Share News

వణికిస్తున్న వర్షం

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:55 AM

అకాల వర్షాల దెబ్బకు రైతన్నలు వణికిపోతున్నారు. గత రెండు రోజులుగా పడుతున్న వానలతో ఇప్పటికే మినుము పంట తడిసిముద్దాయ్యింది. ఈ నెల 23వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందన్న వాతావరణశాఖ హెచ్చరికలు రైతులను మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో మినుముతీత పనులను అధికశాతం మంది నిలిపివేశారు. పెసర పంటకు నష్టం తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వణికిస్తున్న వర్షం

- వాతావరణశాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన

- 23 వరకు కోస్తాతీరం వెంబడి పడనున్న వర్షాలు

- ఇప్పటికే జిల్లాలో తడిసిముద్దయిన మినుము పంట

- పెసర పంటకు నష్టం తప్పదంటున్న రైతులు

అకాల వర్షాల దెబ్బకు రైతన్నలు వణికిపోతున్నారు. గత రెండు రోజులుగా పడుతున్న వానలతో ఇప్పటికే మినుము పంట తడిసిముద్దాయ్యింది. ఈ నెల 23వ తేదీ వరకు కోస్తాతీరం వెంబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందన్న వాతావరణశాఖ హెచ్చరికలు రైతులను మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో మినుముతీత పనులను అధికశాతం మంది నిలిపివేశారు. పెసర పంటకు నష్టం తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కోతకోసి పనలపై, గుట్టలుగా పెట్టి ఉన్న మినుము పంట పూర్తిగా తడిసిపోయింది. గుడివాడ, తోట్లవల్లూరు, పామర్రు, మొవ్వ, మోపిదేవి, నాగాయలంక, చల్లపల్లి తదితర ప్రాంతాల్లో ఆకాశం మేఘవృతమై గురువారం ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో పనలపై ఉన్న మినుము పంటను ఆరబెట్టేందుకు రైతులు ముందూ.. వెనుకా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షానికి తడిసిన మినుము పంటను ఆరబెడితే మళ్లీ తడుస్తుందని.. ఈ కారణంగా కాయలు రాలిపోతాయనే భయం రైతులను వెంటాడుతోంది. మినుము తీత తీసిన అనంతరం గుట్టలుగా పెట్టి ఉన్న పంటను ఆరబెట్టేందుకు కదిపితే మినుము కాయలకు ఉన్న తొడిమలు బలహీనపడి కాయలు రాలిపోతాయని, గుట్టలను జాగ్రత్తగా తీసి రాలిపోయిన కాయలను కూలీలతో పోగు చేయించాలని రైతులు చెబుతున్నారు. కంకిపాడు తదితర ప్రాంతాల్లో గురువారం వర్షం కురవకపోవడంతో రైతులు పనలను ఆరబెట్టే పనులను చేపట్టారు. మినుముపైరు తడిసిపోవడంతో ఎంతమేర నష్టం జరుగుతుందోనని రైతులు భయపడుతున్నారు. తడిసిన మినుము రంగు మారిపోతుందని, దీంతో మద్దతు ధరను వ్యాపారులు తగ్గించివేస్తారని రైతులు చెప్పుకుంటున్నారు.

పెసర పంటకు నష్టమే..

పెసర పంటపై వర్షం ప్రభావం తీవ్రంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. మినుము కన్నా త్వరితగతిన పెసర కాయలు నానిపోయి ఉబ్బిపోతాయని, దీంతో నాణ్యత దెబ్బతిని సగానికి సగం దిగుబడి తగ్గడంతోపాటు, ధర పడిపోతుందని రైతులు వాపోతున్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో కొద్దిపాటి వర్షం కురిసినా పెసర పంటకు పూర్తిస్థాయిలో నష్టం జరుగుతుందని రైతులు అంటున్నారు. పెసర పైరుకు ఉన్న ఆకులు వెడల్పుగా ఉంటాయని, కోత కోసిన అనంతరం రెండు రోజుల వరకు పచ్చదనం తగ్గదని, వర్షం కురిస్తే ఆకులు కుళ్లిపోతాయని, ఈ ప్రభావంతో మొక్కలకు ఉన్న కాయలు బూజుపట్టి పోతాయని రైతులు చెబుతున్నారు.

ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటే..

కంకిపాడు, పెదపారుపూడి, గన్నవరం, తదితర మండలాల్లో అధికశాతం పొలాల్లో మినుము ఈ ఏడాది ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. కొద్దిమంది రైతులు మాత్రం తొమ్మిది క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. మినుము తీతలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో అకాల వర్షం రూపంలో విపత్తు వచ్చిపడటంతో మినుము కాయలు రాలిపోయి దిగుబడి తగ్గుతుందని రైతులు అంటున్నారు. గుడివాడ, పామర్రు, గుడ్లవల్లేరు తదితర మండలాల్లో మినుము దిగుబడి ఐదు నుంచి ఆరు క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో మినుము తీత పనులకు యంత్రాలను ఉపయోగించ కుండా కూలీలతోనే అధిక శాతం పనులు చేయిస్తున్నారు. ఇలాంటి తరుణంతో వర్షానికి దొరికి పోయామని రైతులు చెప్పుకుంటున్నారు. వరి సాగులో తుఫానుల కార ణంగా దిగుబడులు తగ్గి ఖర్చులు వచ్చినా, మినుము పంట ఆదుకుంటుందని ఆశపడ్డామని రైతులు అంటున్నారు. మినుము కొనుగోళ్లు మద్దతు ధరకన్నా అధిక ధరతో బహిరంగ మార్కెట్‌లో జరుగుతున్నాయని, ఇలాంటి స్థితిలో వర్షం తమను ఇబ్బందుల పాలుజేసిందని, మినుము తడిచిపోవడంతో రానున్న రోజుల్లో మినుమును వ్యాపారులు ఎంతమేర ధరకు కొనుగోలు చేస్తారో తెలియకుండా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వర్షపాతం వివరాలు ఇలా..

జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం ఒకమోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉయ్యూరులో అత్యధికంగా 23.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పమిడిముక్కలలో 15.8, గుడివాడలో 8.6, కంకిపాడులో 7.2, గన్నవరంలో 4.2, తోట్లవల్లూరులో 3.4, ఉంగుటూరులో 2.8, పెదపారుపూడిలో 2.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

Updated Date - Mar 20 , 2026 | 12:55 AM