Share News

తొలి వేడుకకు రంగం సిద్ధం..!

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:22 PM

రాష్ట్రంలోనే ఏకైక సరస్వతీ ఆలయంగా పేరుగాంచిన కొలనుభారతి క్షేత్రంలో జనవరి 23న అమ్మవారి జన్మదినం సందర్భంగా నిర్వహించే వసంతపంచమి వేడుకలకు ఏర్పాట్లను చేపట్టేందుకు శ్రీశైల దేవస్థానం సిద్ధమైంది.

   తొలి వేడుకకు రంగం సిద్ధం..!
కొలనుభారతి ఆలయం

కొలనుభారతిలో వసంతపంచమికి ఏర్పాట్లు

ఈ ఏడాది నుంచి శ్రీశైలం ఆధ్వర్యంలో వేడుకలు

విభాగాల వారీగా ప్రణాళిక రూపకల్పన

భక్తుల సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి

ఆత్మకూరు, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే ఏకైక సరస్వతీ ఆలయంగా పేరుగాంచిన కొలనుభారతి క్షేత్రంలో జనవరి 23న అమ్మవారి జన్మదినం సందర్భంగా నిర్వహించే వసంతపంచమి వేడుకలకు ఏర్పాట్లను చేపట్టేందుకు శ్రీశైల దేవస్థానం సిద్ధమైంది. కొలనుభారతి క్షేత్రాన్ని శ్రీశైల దేవస్థానం దత్తతకు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి వేడుక కావడంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. వాస్తవానికి గతంలో జరిగిన వసంతపంచమి వేడుకలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులేమి మంజూరయ్యేవి కావు. కొలనుభారతి దేవస్థానం నుంచే అరకొర నిధులు ఖర్చు చేసి వేడుకను మమ అనిపించేవారు. దీంతో విచ్చేసిన భక్తులకు కూడా సరైన సదుపాయాలు లేక అవస్థలు పడేవారు. అదేక్రమంలో ఆలయ నిర్వహణకు కూడా ఇదే సమస్య ఉండేది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ప్రత్యేక చొరవ తీసుకుని కొలనుభారతి క్షేత్ర ప్రాశస్త్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒంటిమిట్ట క్షేత్రాన్ని ఏవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అభివృద్ధి చేస్తున్నారో ఆ తరహాలో కొలనుభారతి క్షేత్రాన్ని శ్రీశైలం దేవస్థానం దత్తతకు తీసుకుని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఈ విషయాలను సీఎం చంద్రబాబుకు, దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి వివరించడంతో వారు అందుకు అంగీకరించారు. దీంతో గత ఏడాది అక్టోబరు నెలలో కొలనుభారతి క్షేత్రం శ్రీశైల దేవస్థానం ఆధీనంలోకి వెళ్లింది.

ఈ నెల పదో తేదీన కొలనుభారతి క్షేత్రంలో శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్యతో పాటు వివిఽధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి ఉత్సవ నిర్వహణపై చర్చించారు. అదేక్రమంలో శ్రీశైల దేవస్థానం తరుపున చేపట్టబోవు ఏర్పాట్లకు సంబంధించి దేవస్థానం వారు ప్రత్యేక ప్రణాళికను సైతం రూపొందించారు. ఇందులో ప్రధానంగా భక్తులకు సదుపాయాల కల్పనతో పాటు ఆలయంలో వైదిక ఆచారాల ప్రకారం పూజాక్రతువులు, ఉచిత ప్రసాదాల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. అలాగే అమ్మవారి ఆలయంతో పాటు పరివార ఆలయాలను కూడా విద్యుత, పుష్పాలంకరణతో తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. అంతేకాకుండా శ్రీశైలం నుంచి ప్రత్యేకంగా అర్చకులను రప్పించి ఇక్కడ అమ్మవారికి పూజలతో పాటు చిన్నారులకు అక్షరాభ్యాస క్రతువులను వైభవంగా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

విభాగాల వారీగా ప్రణాళిక రూపకల్పన :

ఫ వసంతపంచమి రోజున తెల్లవారుజామున 4గంటల నుంచే ఆలయంలో పూజలను మొదలుపెట్టాలని నిర్ణయించారు. అదేరోజున అమ్మవారికి శ్రీశైల దేవస్థానం తరుపున పట్టువస్ర్తాల సమర్పణతో పాటు 6గంటల నుంచే భక్తులకు అమ్మవారి దర్శనం, చిన్నారులకు అక్షరాభ్యాసాలను ప్రారంభించాలని భావిస్తున్నారు. చిన్నారులకు అక్షరభాస్యాలు చేసేందుకు వీలుగా ఒక్కో బ్యాచలో 50 మంది చొప్పున పాల్గొనే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఇందుకు సంబంధించి అర్చకులను కూడా అందుబాటులో ఉంచనున్నారు.

ఫ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శివపురం చెంచుగూడెం సమీపంలోనే వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే చెంచుగూడెం నుంచి కొలనుభారతి ఆలయం వరకు ఉన్న అటవీమార్గంలో దుమ్ముధూళి లేవకుండా రోడ్లపై నీటిని చిలుకరించాలని, క్షేత్రానికి వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా కొలనును శుభ్రం చేయడంతో పాటు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఫ క్షేత్రంలో ప్రస్తుతం ఉన్న మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌తో పాటు అదనంగా మరో ప్లాంటును ఏర్పాటు చేయాలని, 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పాదరక్షకులు భద్రపర్చుకునేందుకు ఉచిత పాదరక్షకశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆలయంతో పాటు పరివార ఆలయాల వరకు క్యూలైన్లు, భక్తులకు సౌకర్యార్థం చలువ పందిళ్లు, ఆలయాన్ని సుందరీకరించడం, జనరేటర్‌ సదుపాయం, తాత్కాళిక శౌచలయాలు, స్నానపుగదుల ఏర్పాటుతో పాటు పారుశుధ్య నిర్వహణ చేపట్టాలని నిర్ణయించారు.

వసంతపంచమి వేడుకలకు మంత్రి ఆనం రాక..?

ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వసంతపంచమి వేడుకలకు రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనంరామనారాయణరెడ్డిని రప్పించేందుకు శ్రీశైల దేవస్థానం అధికారులతో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వేడుకకు మంత్రి హాజరైనట్లయితే ఇక్కడి పరిస్థితులతో పాటు క్షేత్ర ప్రాశస్త్యాన్ని ఆయనకు వివరించి ఆలయ అభివృద్ధికి మరిన్ని అడుగులు వేయాలని భావిస్తున్నారు. త్వరలోనే కొలనుభారతి క్షేత్రానికి త్రీఫేస్‌ విద్యుత లైనుతో పాటు శివపురం చెంచుగూడేం నుంచి కొలనుభారతి ఆలయం వరకు బీటిరోడ్డు నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తున్నారు.

అద్భుతంగా వసంతపంచమి వేడుకలు

- గిత్తా జయసూర్య, నందికొట్కూరు ఎమ్మెల్యే

కొలనుభారతి క్షేత్రంలో ఈ ఏడాది జరిగే వసంతపంచమి వేడుకలను అద్భుతంగా జరిపేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికే శ్రీశైల దేవస్థానంతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలపై చర్చించడం జరిగింది. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకకు దేవదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని పిలిపించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. గతం కంటే మెరుగైన రీతిలో ఉత్సవాన్ని జరిపించేందుకు అన్ని విధాలుగా చేస్తున్నాం.

భక్తులకు సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి

- శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థానం ఈవో

కొలనుభారతి క్షేత్రాన్ని శ్రీశైల దేవస్థానం దత్తతకు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి వేడుక వసంతపంచమి కావడంతో ఈ వేడుకకు వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే ఆయా విభాగాల వారీగా ఏర్పాట్లను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఈ వేడుకకు వచ్చే భక్తులకు దేవస్థానం ద్వారా ఉచిత ప్రసాద వితరణతో పాటు దేవస్థానం చొరవతో హైదరాబాద్‌కు చెందిన వైష్టవి క్యాటరింగ్‌ వ్యవస్థాపకులు ప్రసాద్‌ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాం. వైదిక ఆచారాల ప్రకారం అమ్మవారి, పరివార ఆలయాల్లో పూజాకైంకర్యాలు చేపట్టేందుకు శ్రీశైలం నుంచి అర్చకులను నియమించడం జరుగుతోంది.

Updated Date - Jan 14 , 2026 | 11:22 PM