Share News

ఇలకైలాసంలో కార్తీక శోభ

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:50 PM

శివయ్యకు ప్రీతికరమైన కార్తీక మాసం శ్రీశైల క్షేత్రమంతా శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

   ఇలకైలాసంలో కార్తీక శోభ
శ్రీశైలంలో ప్రధాన ధ్వజస్తంభంపై ఆవిష్కరించిన ఆకాశదీపం

శ్రీశైలం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): శివయ్యకు ప్రీతికరమైన కార్తీక మాసం శ్రీశైల క్షేత్రమంతా శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు బుధవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెల్లవారుజామునుంచే కృష్ణానది పుణ్య స్నానాలు చేసుకుని నదీమతల్లికి పసుపు కుంకుమ చీర గాజులను సారెగా సమర్పించిన భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు ఆలయ ఉత్తర మాడవీధి, ప్రధానాలయం గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా లక్ష దీప నోములు చేసుకుంటూ మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. కంపార్టుమెంట్లు క్యూలైన్లలో ఉండే భక్తులకు అల్పాహారం, మంచినీరు అందించడంతోపాటు ఉదయం నుంచి రాత్ర వరకు అన్నదాన భవనంలో ప్రసాద వితరణ కొనసాగిస్తున్నారు. సాయంత్రం స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాన ధ్వజస్తంభంపై ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను ఈఓ శ్రీనివాసరావు, ట్రస్టుబోర్డు చైర్మన పోతుగుంట రమేశ నాయుడు అధికారులు పర్యవేక్షించారు.

Updated Date - Nov 11 , 2026 | 11:50 PM