Share News

జీజీహెచను వేధిస్తున్న జీడీఏల కొరత

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:52 PM

నంద్యాల సర్వజన ఆస్పత్రిలో జనలర్‌ బాడీ అటెండెంట్ల కొరతతో రోగులు అవస్థలు పడుతున్నారు.

   జీజీహెచను వేధిస్తున్న జీడీఏల  కొరత
నంద్యాలలోని జిజిహెచ

మూడు వార్డులకు ఒక్కరే దిక్కు

వీల్‌ చైర్లు, స్ట్రక్చర్ల కొరత

నంద్యాల హాస్పిటల్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల సర్వజన ఆస్పత్రిలో జనలర్‌ బాడీ అటెండెంట్ల కొరతతో రోగులు అవస్థలు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి అత్యవసర చికిత్స కోసం వచ్చిన రోగుల బంధువులు తమ పేషెంట్లను వార్డుల్లోకి తీసుకెళ్లేందుకు జీడీఏలు అందుబాటులో లేక వీల్‌ చైర్‌లు, స్ట్రక్చర్‌ లేక నానా అవస్థలు పడుతున్నారు. జీజీహెచ అధికారులు రోగులకు సౌకర్యాలు ఏర్పాటు చేసే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రోగులు వాపోతున్నారు. అంతేకాకుండా ఆయా వార్డులల్లో రోగులను సర్జరీ, పరీక్షల కోసం వీల్‌ చైర్‌లలో జీడీఏలు తీసుకొని పోవాల్సి ఉంది. అయితే జీడీఏల కొరతతో వార్డుకు ఒక జీడీఏ ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం మూడు వార్డులకు ఒకరే దిక్కయ్యారు. దీంతో జీడీఏలు పని ఒత్తిడికి గురవుతున్నారు. అంతేకాకుండా వీల్‌ చైర్లు అందుబాటులో లేక రోగుల బంధువులు వీల్‌ చైర్ల కోసం అన్ని వార్డులు వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. జీజీహెచలో ప్రస్తుతం 16 వీల్‌ చైర్లు, 12 స్ట్రక్చర్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. వందల సంఖ్యలో రోగులు వస్తున్నా, అలాగే ఇన పేషంట్లతో వార్డులు కిటకిటలాడుతున్న కనీసం వీల్‌ చైర్‌, స్ట్రక్చర్లు అందుబాటులో లేకపోవడం విడ్డూరం. 2022లో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి జీజీహెచగా స్థాయి పెంచారు. 450 పడకల స్థాయి పెరిగింది. ఇందుకు గాను 77 మంది జీడీఏల పోస్టులు నియామకం చేపట్టాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 39 మాత్రమే పని చేస్తున్నట్లు తెలుస్తోంది. జీజీహెచలో సిబ్బంది నియామకం చేపట్టడానికి ఏళ్లు గడుస్తోంది. జీడీఏలు అందుబాటులో లేకపోవడంతో రోగుల బంధువులే వీల్‌ చైర్లు, స్ట్రక్చర్లలో తమ పేషంట్లను వార్డుల్లోకి తీసుకుపోయే దుస్థితి నెలకొంది. జీజీహెచలో వీల్‌ చైర్లు దొరకక మొదటి అంతస్తు ఎక్కలేక, నడవలేక రోగులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జీజీహెచకు ఉన్న రోగుల తాకిడికి మరో 10 వీల్‌ చైర్లు, 10 స్ట్రక్చర్లు అవసరం ఉంది.

జీడీఏలు అందుబాటులో లేరు : వెంకటరెడ్డి, పేషెంట్‌, రామపురం.

జీడీఏలు అందుబాటులో లేకపోవడంతో బంధువు వీల్‌ చైర్‌లో వార్డుకు తీసుకొని పోతున్నారు.

వీల్‌ చైర్‌ కోసం ఎదురు చూస్తున్నా : మహబూబ్‌ బాషా, పేషెంట్‌, సిరివెళ్ల,

వీల్‌ చైర్‌ దొరకకపోవడంతో పైకి ఎక్కలేక వీల్‌ చైర్‌ కోసం ఎదురు చూస్తున్నాను. ఇక్కడ చాలా కష్టంగా ఉంది.

జీడీఏలు రావడం లేదు - మస్తాన, ఏడీ, జీజీహెచ, నంద్యాల.

నంద్యాల జీజీహెచకు జీడీఏలు రావడం లేదు. కౌన్సిలింగ్‌ నిర్వహించి 12 మంది రిక్రూట్‌మెంట్‌ చేయగా రిపోర్ట్‌ చేసి వెళ్లిపోయారు. వీల్‌ చైర్లు, స్ట్రక్చర్లు అవసరాన్ని బట్టి తెప్పిస్తాం.

Updated Date - Mar 11 , 2026 | 11:52 PM