బీసీ హాస్టల్‌లో అధికారులు, వార్డెన్ల పని తీరు అధ్వాన్నం
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:10 AM
బీసీ వసతి గృహాలు, గురుకులాలు దుర్భరంగా తయారయ్యాయని, జిల్లా అధికారులు, సహాయ సంక్షేమ అధికారులు, వార్డెన్ల పనితీరు అధ్వానంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ ఎక్స్ అఫిషియో సెక్రటరీ ఎస్. సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు.
మెనూ చెత్తగా ఉంది..
సహాయ సంక్షేమ అధికారులు, వార్డెన్లు పని చేసే చోటనే నివాసం ఉండాలి
కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాల అధికారులు, ఏబీసీడబ్లూవొలు, వార్డెన్ల సమావేశం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో సెక్రటరీ ఎస్.సత్య నారాయణ
కర్నూలు ఎడ్యుకేషన, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): బీసీ వసతి గృహాలు, గురుకులాలు దుర్భరంగా తయారయ్యాయని, జిల్లా అధికారులు, సహాయ సంక్షేమ అధికారులు, వార్డెన్ల పనితీరు అధ్వానంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ ఎక్స్ అఫిషియో సెక్రటరీ ఎస్. సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కర్నూలు, అనంతపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాల డీబీసీ డబ్ల్యూవోలు, ఏబీసీ డబ్ల్యూవోలు, హెచడబ్ల్యూవోలు మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల ప్రిన్సిపాళ్లతో ప్రభుత్వ ఎక్స్ అఫిషియో సెక్రటరీ సత్యనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల నెలా వేతనం తీసుకుంటున్న అధికారులు సక్రమంగా పని చేయడం లేదన్నారు. మెనూ అమలు చేస్తున్నారా? వార్డెన్లు విధులకు హాజరవుతున్నారా? అని ప్రశ్నించారు. కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాలకు చెందిన అధికారులు, వార్డెన్ల పనితీరు అధ్వానంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోనే కర్నూలు, అనంతపురం జిల్లాలు చివరి స్థానంలో ఉన్నాయని అన్నారు. విద్యార్థులకు ఇచ్చే మెనూ, తాగునీరు, శానిటేషన, పర్యవేక్షణ వంటి అంశాలను గాలికి వదిలేశారని అన్నారు. శుక్రవారం రాగానే ఇంటికి వెళ్లాలనే ఆలోచనను అధికారులు వీడనాడాలని అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టళ్ల అధికారులు వార్డెన్ల పని బాగా లేదని అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో.46కు బదులుగా 34 జీవోను విడుదల చేసిందని, ఈ జీవోను ఎంత మంది చదివారని అడిగితే.. డీబీసీడబ్ల్యూవోలు, సహాయ సంక్షేమ అధికారులు, వార్డెన్లు నీళ్లు నమిలారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా హాస్టల్ వార్డెన్లకు అత్యవసరమైతే తప్ప సెలవుల్లో వెళ్లరాదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మాధవీలత, కర్నూలు, అనంతపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాల డీబీసీడబ్ల్యూవోలు ప్రసూన, కుసుబ కొటారి, జగ్గయ్య, రాజేంద్ర కుమార్ రెడ్డి, సహాయ సంక్షేమ అధికారులు, నాలుగు జిల్లాల వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.