Share News

రోగుల విశ్రాంతి భవనానికి ఎసరు!

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:37 AM

రోగులు, వారి సహాయకుల విశ్రాంతి కోసం దాతలు నిర్మించిన భవనాన్ని ప్రభుత్వ ఉద్కోగులు ఆక్రమించి యూనియన్‌ కార్యాలయంగా మార్పు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రోగుల విశ్రాంతి భవనానికి ఎసరు!

- జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగుల నిర్వాకం

- యూనియన్‌ కార్యాలయంగా మార్పు

- నిలువ నీడ లేక రోగుల సహాయకుల అవస్థలు

మచిలీపట్నం టౌన్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రోగులు, వారి సహాయకుల విశ్రాంతి కోసం దాతలు నిర్మించిన భవనాన్ని ప్రభుత్వ ఉద్కోగులు ఆక్రమించి యూనియన్‌ కార్యాలయంగా మార్పు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లా సర్వజన ఆస్పత్రికి పల్లెల నుంచి వచ్చే రోగులు, వారి సహాయకుల వసతి కోసం రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో 2023లో వసతి భవనం నిర్మించారు. ఆస్పత్రికి వచ్చే రోగుల సహాయకులు ఇక్కడ వంట చేసుకుంటున్నారు. మిగిలిన సమయంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనిపై ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగుల కన్ను పడింది. దీంతో వారు ఈ భవనాన్ని ఆక్రమించి ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంగా మార్పు చేశారు. దాతల ఆశయానికి తూట్లు పొడిచారు. దీంతో రోగుల బంధువులు రాత్రి వేళ బస చేసేందుకు వసతి గదిలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనిపై న్యాయవాది లంకిశెట్టి బాలాజీ కలెక్టర్‌ బాలాజీకి ఫిర్యాదు చేశారు. గ్రామాల నుంచి వచ్చే పేదలకు బాసటగా ఉంటున్న భవనాన్ని సంఘ నాయకులు తమ కార్యాలయంగా మార్చుకోవడంపై జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌, కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్పత్రిలో ప్రసవించిన బాలింతల సహాయకులు పడుతున్న అవస్థలను దృష్టిలో పెట్టుకుని సంఘ కార్యాలయాన్ని వెంటనే ఖాళీ చేయించాలని డిమాండ్‌ చేశారు. చంటి పిల్లలకు స్నానాలు చేయించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Updated Date - Jan 18 , 2026 | 12:37 AM