క్యాసినో జరిగిన చోట జాతీయ పోటీలు మార్పునకు నిదర్శనం
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:29 AM
గత వైసీపీ పాలనలో క్యాసినో జరిగిన గుడివాడలో నేడు జాతీయ కబడ్డీ పోటీలను నిర్వహిస్తుండటం మార్పునకు నిదర్శనమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి అండర్-14 బాలికల కబడ్డీ పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
- జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్
- ఘనంగా జాతీయ బాలికల కబడ్డీ పోటీలు ప్రారంభం
- గుడివాడలో క్రీడాకారుల భారీ ర్యాలీ
- హాజరైన ఎమ్మెల్యేలు వెనిగండ్ల, యార్లగడ్డ, శాప్ చైర్మన్ రవి నాయుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి
గుడివాడ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):
గత వైసీపీ పాలనలో క్యాసినో జరిగిన గుడివాడలో నేడు జాతీయ కబడ్డీ పోటీలను నిర్వహిస్తుండటం మార్పునకు నిదర్శనమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి అండర్-14 బాలికల కబడ్డీ పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ పోటీలను జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. బెలూన్‌లను ఎగురవేశారు. అనంతరం జాతీయ జెండాను, క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, శాప్ చైర్మన్ రవి నాయుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు, జనసేన ఇన్‌చార్జ్ బూరగడ్డ శ్రీకాంత తదితరులతో కలిసి క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్ర కబడ్డీ జాతీయ క్రీడాకారిణి కిరణ్మయి క్రీడా ప్రార్థన గీతం ఆలపించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ సొంత గడ్డలో, ఆయన నిర్మించిన స్టేడియంలో పోటీలకు ముఖ్యఅతిథిగా తాను రావడం తన అదృష్టమన్నారు. స్టేడియంలో రెండోసారి జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఆ అవకాశం రావడం స్టేడియం కమిటీ పనితీరు, సమర్థతకు నిదర్శనమని కొనియాడారు. గత వైసీపీ పాలనలో మాజీ సీఎం జగన్ పబ్జి ఆడితే, మాజీ మంత్రి కొడాలి నాని క్యాసినో పెట్టి ప్రసిద్ధి గాంచిన గుడివాడ పేరును భ్రష్టు పట్టాంచారని విమర్శించారు. నేడు అందరూ గర్వపడేలా బాలికల కబడ్డీ పోటీలను నిర్వహిస్తుండటం గర్వకారణమన్నారు. 2016లో సీఎం చంద్రబాబు హయాంలో ఇదే స్టేడియంలో రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ అండర్-16 జాతీయస్థాయి ఆటల పోటీలను ఘనంగా నిర్వహించారని గుర్తుచేశారు. స్థానిక క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. పాఠశాల దశ నుంచే చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేలా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడలను ప్రోత్సహిస్తున్నారన్నారు.
గ్రామీణ క్రీడల అభివృద్ధే లక్ష్యంగా నాడు స్టేడియం ఏర్పాటు : ఎమ్మెల్యే
స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ గ్రామీణ క్రీడల అభివృద్ధి కోసమే అన్న ఎన్టీఆర్ గుడివాడలో స్టేడియం నిర్మించారన్నారు. నేడు విద్యాశాఖ మంత్రి లోకేశ్ చొరవతో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించే అవకాశం గుడివాడకు దక్కడం అభినందనీయమన్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రసంగించారు. అనంతరం క్రీడాకారులను ఉత్సాహ పరుస్తూ మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, శాప్ చైర్మన్ రవి నాయుడు, స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు కబడ్డీ ఆడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కె.పి.రావు, జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి.రామారావు, స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, జిల్లా క్రీడా సమాఖ్య కార్యదర్శులు మత్తి అరుణ, గంపా రాంబాబు, పోటీల కార్యనిర్వాహక కార్యదర్శి సింహాద్రి గంగాధర్, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, డీఎస్పీ ధీరజ్ వినీల్ తదితరులు పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని డాక్టర్ గురురాజు ప్రభుత్వ హోమియో కళాశాల నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము క్రీడా జ్యోతితో, క్రీడాకారులు జాతీయ జెండాలతో సందడి చేశారు.
తొలి రోజు హోరాహోరీగా పోరు
తొలి రోజు హోరాహోరీగా పోరు సాగింది. తెలంగాణ జట్టు 39-19 తేడాతో కేంద్రీయ నవోదయ జట్టుపై, రాష్ట్ర జట్టు ఉత్తరాఖండ్ జట్టుపై 32-28 తేడాతో విజయం సాధించాయి. మరో పోటీలో తమిళనాడు, ఝార్ఖండ్ జట్లు తలపడ్డాయి.