పా‘పాలు’!
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:49 AM
అనధికార పాల వ్యాపారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. అధీకృత, ఫామ్ డెయిరీలు, మిల్క్ సెంటర్ల పేరుతో విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున లూజు, ప్యాకెట్ల రూపంలో బహిరంగంగా అమ్మకాలు చేస్తున్నారు. ఎక్కడా నిబంధనలు పాటించిన దాఖలాలు కనిపించడంలేదు. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
- ఉమ్మడి కృష్ణాలో యథేచ్ఛగా పాల వ్యాపారం
- అధీకృత, ఫామ్ డెయిరీలు, మిల్క్ సెంటర్ల పేరుతో విక్రయాలు
- విజయవాడలో 100 చోట్ల లూజు, ప్యాకెట్ల రూపంలో అమ్మకాలు
- నిబంధనలు పాటించని వ్యాపారులు
- పట్టించుకోని అధికారులు
అనధికార పాల వ్యాపారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. అధీకృత, ఫామ్ డెయిరీలు, మిల్క్ సెంటర్ల పేరుతో విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున లూజు, ప్యాకెట్ల రూపంలో బహిరంగంగా అమ్మకాలు చేస్తున్నారు. ఎక్కడా నిబంధనలు పాటించిన దాఖలాలు కనిపించడంలేదు. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
కృష్ణా మిల్క్ యూనియన్ (విజయా డెయిరీ) ప్రైవేటుగా లూజు, ప్యాకెట్లు, బాటిల్స్‌లో పాలు విక్రయిస్తున్న ప్రాంతాలను ఇటీవల కాలంలో గుర్తించింది. వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో భాగంగా ఈ సర్వే చేసింది. పట్టణ ప్రాంతాల్లో దొంగచాటుగా కాకుండా బహిరంగ ప్రాంతాలలో అనధికారికంగా విక్రయించే లూజు, ప్రైవేటు పాల విక్రయ ప్రాంతాలే వందకు పైగా ఉన్నాయి. పాలలో సహజంగా బ్యాక్టీరియా ఉంటుంది. అధీకృత పాల సేకరణ కేంద్రాలు ఈ బ్యాక్టీరియాను సంహరించటానికి తమ ఫ్యాక్టరీల్లో నిర్ణీత ఉష్ణోగ్రత వరకు మరిగించి ప్రాసెసింగ్ చేస్తారు. పాలను పరీక్ష చేసే వ్యవస్థలు ఉంటాయి. పాలను మరిగించిన తర్వాత కూడా నాణ్యతను పరీక్షిస్తారు. అవసరమైతే పరీక్ష చేసిన తర్వాత రెండో దశలో కూడా మరిగిస్తారు. లూజుగా విక్రయించే పాలలో బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియాకు తోడుగా పాలలో కలుషిత నీరు, ఇతర కల్తీ కారకాలను కలిపితే .. దాని తీవ్రత పెరుగుతుంది. ఇంటి దగ్గర మరిగించే దానికి, డెయిరీలో మరిగించే దానికి తేడా ఉంటుంది. ఇతర కాంపోనెంట్స్ కూడా కలిస్తే అనారోగ్య పరిస్థితులకు దారితీస్తాయి.
అనధికారికంగా విక్రయాలు
నగరంలో అడుగడుగునా అనధికారికంగా పాల విక్రయాలు జరుగుతున్నాయి. ముత్యాలం పాడులోని అల్లూరి సీతారామరాజు రోడ్డుపై, ఇదే ప్రాంతంలో జీఎస్ రాజు రోడ్డు (కోదండ రామాలయం ఎదురుగా), అయోధ్యనగర్‌లో చింతచెట్ల బజార్, సింగ్‌నగర్ నందమూరి నగర్‌లోని 1, 2, 4 రోడ్లలో, భారత మాతా కాలనీలోని ప్రైవేట్ మిల్క్, సింగ్‌నగర్ బసవపున్నయ్య స్టేడియం దగ్గర, గుంటుపల్లి ఎన్టీఆర్ విగ్రహం మెయిన్ రోడ్డు, ఇబ్రహీంపట్నం రింగ్, కొండపల్లి బీ కాలనీ, ఊర్మిళా నగర్ మెయిన్ రోడ్డులోని ప్రైవేటు డెయిరీ మిల్క్, సితార సెంటర్‌లో కన్వెన్షన్ సెంటర్, విద్యాధరపురం ఆర్టీసీ డిపో సమీపంలో, గుప్తా సెంటర్‌లోని ప్రైవేటు మిల్క్ సెంటర్ల దగ్గర ప్యాకెట్ల రూపంలో పాల విక్రయాలు చేస్తున్నారు. కృష్ణలంక మెట్ల బజార్, దుర్గాపురం, రాణిగారితోట, మేరీస్ స్టెల్లా కాలేజీ ఎదురు, పటమటలో పంటకాల్వ రోడ్డులలో పాలను విక్రయించటం జరుగుతోంది.
స్వచ్ఛమైన గేదెపాలు అంటూ..
స్వచ్ఛమైన గేదె పాలు, ప్రైవేటు పేర్లతో కూడిన డెయిరీల ముసుగులో పాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రామలింగేశ్వరనగర్ కట్టరోడ్డు, యనమలకుదురు ఎన్టీఆర్ బస్టాప్, పెనమలూరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు దగ్గర, కంకిపాడులోని హనుమాన్‌పేట టెంపుల్ దగ్గర, ఉయ్యూరులో వీరమ్మ తల్లి దేవాలయం, శివాలయం, రామాలయం, రావిచెట్టు బజార్, మసీదు, ఫ్లోరా స్కూల్ రోడ్డు, రిలయన్స్ స్టోర్ కాటూరు రోడ్ల దగ్గర పాలను విక్రయిస్తున్నారు. గన్నవరంలో కోణాయ చెరువు దగ్గర కేంద్రం, దావాజీగూడెం రోడ్డు, బుద్ధవరం రోడ్లలో కూడా పాలను లూజుగా, ప్యాకెట్లుగా విక్రయిస్తున్నారు.
డెయిరీల ముసుగులో వ్యాపారాలు
విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలో ఏకంగా డెయిరీల పేరుతో పాలను విక్రయించడం జరుగుతోంది. లూజు మిల్క్, న్యాచురల్ మిల్క్, ఆయుర్వేద ఫుడ్స్, డెయిరీ ఫామ్‌లు, మిల్క్ సెంటర్ల పేరుతో యథేచ్ఛగా అమ్ముతున్నారు. వీటిలో అధీకృతంగా ఉన్న డెయిరీలు ఏమిటో, అనధికారికంగా ఉన్న డెయిరీలు ఏమిటో తెలియదు. అధీకృతంగా లైసెన్స్‌లు కూడా ఎక్కడా కనిపించవు. అనుమతులు లేని వారు కూడా ప్యాకింగ్ చేసి పాల ప్యాకెట్లను విక్రయిస్తున్నారు. ఇవి పాలను ఎలా సేకరిస్తున్నాయి ? ఎలా ప్రాసెసింగ్ చేస్తున్నాయి ? ఎక్కడ ప్రాసెసింగ్ చేస్తున్నాయి ? పాలను మరిగిస్తున్నారా ? చట్టవిరుద్ధంగా ఎలా ప్యాకింగ్ చేస్తున్నారు ? అన్న అంశాలు ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉంది. వీటిపై తక్షణం పరిశీలన జరిపి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.