వాము పొట్టు అ‘ధర’హో
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:06 PM
ఒకప్పుడు పొలాల్లో, గట్లమీద వృథాగా పారబోసిన వాము పొట్టు ఇప్పుడు రైతులకు బంగారమైంది.
క్వింటం రూ.15,468
ఉత్తరాదిన భారీ డిమాండ్
కర్నూలు అగ్రికల్చర్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు పొలాల్లో, గట్లమీద వృథాగా పారబోసిన వాము పొట్టు ఇప్పుడు రైతులకు బంగారమైంది. వాముకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో వాము పొట్టుకు కూడా అంతే ప్రాధాన్యత వచ్చింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు మార్కెట్ యార్డులో బుధవారం క్వింటం వాము పొట్టుకు రూ.15,468 ధర దక్కిందని కర్నూలు మార్కెట్ కమిటీ సెలక్షన గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. ప్రస్తుతం వాము పొట్టుకు ఇంత భారీ ధర రైతులకు దక్కడానికి కారణం ఉత్తరాది రాష్ట్రాల్లో వివిధ అవసరాల కోసం ఔషధాల తయారీ సంస్థలు ఇక్కడి నుంచి వామును భారీగా దిగుమతి చేసుకోవడమే కారణమని కర్నూలు మార్కెట్ కమిటీలో వాము పొట్టు వ్యాపారం చేస్తున్న వారు తెలిపారు. బుధవారం కర్నూలు మార్కెట్ యార్డుకు 246 క్వింటాళ్ల వాము పొట్టును రైతులు అమ్మకానికి తీసుకవచ్చారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఈరోజు వేరుశనగ కాయలకు గరిష్ఠ ధర రూ.9,429, మధ్యస్థ ధర రూ.8,396, కనిష్ఠ ధర రూ.6,700 ధర పలికింది. అదే విధంగా ఆముదాలకు గరిష్ఠ ధర రూ.6,041, మధ్యస్థ ధర రూ.6,040, కనిష్ఠ ధర రూ.5,090 అందింది. వాముకు క్వింటానికి రూ.26,899 గరిష్ఠ ధర అందగా.. మధ్యస్థ ధర రూ.20,234, కనిష్ఠ ధర రూ.2,020 అందింది. మొక్కజొన్నలకు గరిష్ఠ, మద్యస్థ ధరలు క్వింటానికి రూ.1,810, కనిష్ఠ ధర రూ..1,409 అందింది. కందులకు వారం క్రితం రూ9వేలకు పైగా గరిష్ఠ ధర లభించగా.. ప్రస్తుతం రూ.7,881లకు పడిపోయింది. శనగలకు గరిష్ఠ ధర రూ.5,169, కనిష్ఠ ధర రూ.1,500లకు తగ్గిపోయింది. మిర్చి బారిగ రకం క్వింటం రూ.26,619, రేవనూరు డీలక్స్ రకం రూ.21,211, సూపర్-10 రకం రూ.21,901 , తేజా రకం రూ.15,505, తాలు రకానికి రూ.18,699 ధరలు పలికాయి.