Share News

‘గుర్రు’పు డెక్క!

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:49 AM

జిల్లాలోని సాగు నీటి కాల్వలు, డ్రెయిన్లలో ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం) పనులు ఈ ఏడాది ఇంత వరకు చేపట్టకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జూలై నుంచి ఈ ఏడాది మార్చి వరకు కాల్వల్లో తూడు, గుర్రపు డెక్క, కిక్కిస తదితరాలను నీటి ప్రవాహానికి అడ్డులేకుండా తొలగించాల్సి ఉంది. కానీ ఖరీఫ్‌ సీజన్‌ ముగిసిన వెంటనే పంటల సాగు లేదనే కారణం చూపి డ్రెయిన్లు, పంట కాల్వల్లో పనులు చేయకుండా నిలిపివేశారు. ప్రస్తుతం డ్రెయిన్లు, పంటకాల్వలు పూర్తిస్థాయిలో గుర్రపుడెక్క, తూటుకాడతో అల్లుకుపోయాయి. ఈ నెలాఖరు నాటికి పనులు చేస్తారా లేక వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ వరకు వీటిని అలానే ఉంచి కొత్త పనులుగా చూపి మళ్లీ అంచనాలు తయారు చేస్తారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.

‘గుర్రు’పు డెక్క!

-ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పనులు చేపట్టకపోవడంపై రైతుల ఆగ్రహం

-పంట కాల్వలు, డ్రెయిన్లలో పెరిగిన గుర్రపు డెక్క, తూడు

-ఈ నెలాఖరులోపు పనులు చేయాల్సి ఉన్నా పట్టించుకోని అధికారులు

- రాబోయే కాలంలోనూ ఇబ్బందులు తప్పవని రైతుల ఆవేదన

- రైతులు స్వచ్ఛందంగా చేసిన పనులకు బిల్లులు!

జిల్లాలోని సాగు నీటి కాల్వలు, డ్రెయిన్లలో ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం) పనులు ఈ ఏడాది ఇంత వరకు చేపట్టకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జూలై నుంచి ఈ ఏడాది మార్చి వరకు కాల్వల్లో తూడు, గుర్రపు డెక్క, కిక్కిస తదితరాలను నీటి ప్రవాహానికి అడ్డులేకుండా తొలగించాల్సి ఉంది. కానీ ఖరీఫ్‌ సీజన్‌ ముగిసిన వెంటనే పంటల సాగు లేదనే కారణం చూపి డ్రెయిన్లు, పంట కాల్వల్లో పనులు చేయకుండా నిలిపివేశారు. ప్రస్తుతం డ్రెయిన్లు, పంటకాల్వలు పూర్తిస్థాయిలో గుర్రపుడెక్క, తూటుకాడతో అల్లుకుపోయాయి. ఈ నెలాఖరు నాటికి పనులు చేస్తారా లేక వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ వరకు వీటిని అలానే ఉంచి కొత్త పనులుగా చూపి మళ్లీ అంచనాలు తయారు చేస్తారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

మచిలీపట్నం వెస్ట్‌ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న పంట కాల్వను గత వేసవిలో రైతులు స్వచ్ఛందంగా చందాలు వేసుకుని యంత్రాలు పెట్టి పూడికతీత పనులు చేయించారు. ఈ పనులు జరుగుతున్న సమయంలో నీటిపారుదలశాఖ అధికారులు స్వయంగా ఈ పనులను పరిశీలించారు. అయితే ఈ పనులను ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో మళ్లీ చేసినట్లుగా చూపారు. ఈ విషయంపై రైతులు ప్రశ్నిస్తే సాగునీటి సంఘాల ప్రతినిధులు ఈ పనులు చేశారని అధికారులు చెబుతున్నారని రైతులు అంటున్నారు. రైతులు స్వచ్ఛందంగా పనులు చేయించిన పంట కాల్వలో మళ్లీ తూడు, గుర్రపు డెక్క తొలగించినట్లుగా చూపి గుట్టుచప్పుడు కాకుండా బిల్లులు చేసి, వాటిని చెల్లించడానికి రంగం సిద్ధం చేశారని రైతులు గుసగుస లాడుకుంటున్నారు. పెడన నియోజకవర్గం గూడూరు మండలం పిడుగుల్లంక గ్రామంలో పంట కాల్వపై వంతెన నిర్మాణం, అప్రోచ్‌ పనులకు ఒక ఏఈ తప్పుడు లెక్కలు చూపి బిల్లులు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులకు తెలిసినా ఏ కారణం చేతనో పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది నియోజకవ ర్గానికి రూ.3 కోట్లు అంటూ ప్రచారం!

నీటి పారుదల, డ్రెయునేజీ విభాగం అధికారులు కాల్వల మరమ్మతు పనులకు (ఓఅండ్‌ఎం) సంబంధించిన అంచనాలు తయారు చేసి పంపారు. అంచనాలు అధికంగా ఉన్నాయని, తప్పులు దొర్లాయనే కారణంతో వాటిని సరిచేసి పంపాలని ఉన్నతాధికారులు ఇటీవల తిప్పి పంపారు. వీటిని సరిచేసే పనిలో ఉన్నామని ఆయా డివిజన్‌ల ఇరిగేషన్‌, డ్రెయినేజీ విభాగం అధికారులు చెబుతున్నారు. గతేడాది నియోజకవర్గానికి రూ.2 కోట్లు చొప్పున ఓఅండ్‌ఎం పనులకు ప్రభుత్వం కేటాయించింది. రూ.10 లక్షల లోపు పనులను నామినేషన్‌ పద్ధతిన సాగునీటి సంఘాలకు అప్పగించింది. ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గానికి రూ.3 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తారనే ప్రచారం ఇటీవల కాలంలో జరుగుతోంది. పంట కాల్వలు, డ్రెయినేజీల్లో తూడు, గుర్రపు డెక్క, కిక్కిస వంటివాటిని తొలగించడానికి ఈ నిధులు ఎటూ సరిపోవని రైతులు, సాగునీటి సంఘాల అధ్యక్షులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాల్వగట్ల బలోపేతం, గండ్లుపూడ్చటం తదితర మట్టిపనులతో పాటు ప్రధాన కాల్వలు, బ్రాంచ్‌ కాల్వల గేట్లు, లాకుల మరమ్మతులు, ఈ ఏడాది చేసే అవకాశం ఉండదని రైతులు చెప్పుకుంటున్నారు.

సాగునీటి సంఘాల ద్వారా ప్రతిపాదనలు

జిల్లాలోని సాగునీటి సంఘాల ద్వారా ఈ ఏడాది కృష్ణాడెల్టాలో సాగునీటి కాల్వలు, డ్రెయినేజీల మరమ్మతు పనులు పూర్తి స్థాయిలో చేయాలనే ఉద్దేశంతో పనులకు ఇటీవల అంచనాలు రూపొందించారు. దివిసీమ ప్రాంతానికి సాగునీటిని సరఫరా చేసే కేఈబీ కాల్వ పరిధిలో 1.25 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాల్వ ద్వారా సాగునీరు, తాగునీరు సక్రమంగా అందించేందుకు, డ్రెయినేజీలకు మరమ్మతులు చేసేందుకు 115 పనులను రూ.30 కోట్లతో చేయాలని అంచనాలను రూపొందించారు. కానీ ఇంతమేర నిధులు విడుదలయ్యే అవకాశాలు లేవనే సంకేతాలు వెలువడుతున్నాయి. కేఈబీ కాల్వ నుంచి మచిలీపట్నం మండలానికి సాగునీటిని అందించే 9వ నెంబరు ప్రధాన కాల్వకు మరో పది బ్రాంచ్‌ కాల్వలు ఉన్నాయి. వీటిలో ఓఅండ్‌ఎం, ఇతరత్రా పనులు చేసేందుకు రూ.3 కోట్లతో అంచనాలను రూపొందించారు. మచిలీపట్నం నియోజకవర్గం నార్త్‌మండల పరిధిలోని కాల్వల మరమ్మతు పనుల కోసం రూ.1.20 కోట్లతో అంచనాలు రూపొందించారు. నియోజకవర్గానికి కేవలం రూ.3 కోట్లు మాత్రమే నిధులు కేటాయిస్తే ఒకే నియోజకవర్గంలోని మండలాల పరిధిలో ఏ పనులను చేస్తారు... ఏ పనులు చేయకుండా నిఽధుల విడుదలలో కోత పెడతారనే అంశంపై అయోమయం నెలకొంది. జిల్లాలో కేఈబీ, బందరు, రైవస్‌, రామరాజుపాలెం, బంటుమిల్లి ప్రఽధాన కాల్వలు, వాటికి అనుబంధంగా ఉన్న బ్రాంచ్‌ కాల్వలకు, ప్రధాన డ్రెయినేజీలలో ఓఅండ్‌ఎం పనులు చేసేందుకు ఈ ఏడాది పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయాలని రైతులు, సాగు నీటి సంఘాల అధ్యక్షులు కోరుతున్నారు.

Updated Date - Mar 18 , 2026 | 12:49 AM