Share News

సమస్యల ‘గురుకులం’!

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:52 AM

గుడివాడ మండలం మోటూరులోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ఆది నుంచి వివాదాలకు కేంద్రంగా నిలుస్తోంది. 700 మందికిపైగా విద్యార్థినులున్న గురుకులంలో కనీస వసతులు కరువయ్యాయి. ఆవరణలో పేరుకుపోతున్న చెత్తను తొలగించేవారు లేరు. సిబ్బంది కొరతతో వంట ఆలస్యమవ్వడం, దోమలు, ఈగలతో విద్యార్థులు సతమతవుతున్నారు. విద్యార్థినులను చూడటానికి వచ్చిన తల్లిదండ్రులకు వారి బాధలు చెప్పుకుంటే ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు ఉగ్రరూపంతో విరుచుకుపడుతున్నారు.

సమస్యల ‘గురుకులం’!

- మోటూరు గురుకుల బాలికల పాఠశాలలో సమస్య తిష్ట

- సెక్యురిటీ సిబ్బందితో వంట పని

- ఆవరణలో ఎక్కడి చెత్త అక్కడే

- నివాసం ఉండని ఉపాధ్యాయులు

- దోమలతో విద్యార్థినుల అవస్థలు

- ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకస్మిక తనిఖీతో సమస్యలు వెలుగులోకి..

- వంటగది పరిసరాలను చూసి ఎమ్మెల్యే ఆగ్రహం

ఆంధ్రజ్యోతి - గుడివాడ:

గుడివాడ మండలం మోటూరులోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ఆది నుంచి వివాదాలకు కేంద్రంగా నిలుస్తోంది. 700 మందికిపైగా విద్యార్థినులున్న గురుకులంలో కనీస వసతులు కరువయ్యాయి. ఆవరణలో పేరుకుపోతున్న చెత్తను తొలగించేవారు లేరు. సిబ్బంది కొరతతో వంట ఆలస్యమవ్వడం, దోమలు, ఈగలతో విద్యార్థులు సతమతవుతున్నారు. విద్యార్థినులను చూడటానికి వచ్చిన తల్లిదండ్రులకు వారి బాధలు చెప్పుకుంటే ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు ఉగ్రరూపంతో విరుచుకుపడుతున్నారు.

రెండేళ్లుగా వేధిస్తున్న వంట సిబ్బంది కొరత

700 మందికి పైగా విద్యార్థినులున్న గురుకులంలో సంఖ్యాపరంగా ఏడుగురు ఉండాల్సిన చోట కేవలం ఇద్దరు మాత్రమే వంట మాస్టార్లున్నారు. గురుకులంలోని అటెండర్లు, సెక్యురిటీ సిబ్బంది వంటమాస్టార్‌లకు సహాయకులుగా పనిచేస్తున్నారు. గత రెండేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులకు భయపడి వంట ఆలస్యమవుతున్నా విద్యార్థినులు నోరు మెదపడం లేదు. గతంలో విద్యార్థినులతో చపాతీలు చేయించిన సంఘటనలున్నాయి.

ఎటు చూసిన చెత్తే..

గురుకులంలో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణంతో విద్యార్థినులు అస్వస్థతకు గురవుతున్నారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వసతి గదుల వద్ద చెత్త దర్శనమిస్తుంది. దోమలు, ఈగలతో చాలా ఇబ్బంది పడుతున్నామని విద్యార్థినులు చెబుతున్నారు. వంటశాల పరిసరాలను చూస్తే అత్యంత చెత్తగా ఉన్నాయి.

గుడివాడ నుంచి ఉపాధ్యాయుల రాక

గురుకులంలో పనిచేసే ఉపాధ్యాయులు తప్పనిసరిగా అక్కడే నివాసముండాలి. కానీ ఈ నిబంధన ఎక్కడ పాటించడం లేదు. ముఖ్యంగా గురుకులం ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులు గుడివాడ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. గురుకులంపై ఆజమాయిషీ కొరవడటంతో ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయుల కోసం నిర్మించిన క్వార్టర్లు నిరుపయోగంగా ఉన్నాయి.

ఎమ్మెల్యే వెనిగండ్ల ఆకస్మిక తనిఖీ

గురుకులాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వంటశాలలో అపరిశుభ్ర వాతావరణం చూసి విస్తుపోయారు. ఆవరణలో పేరుకుపోయిన చెత్తను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డీసీవో (కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్‌) మురళీకృష్ణకు వీడియో కాల్‌ చేశారు. వంటగది దుస్థితిని చూపించారు. వంటగది దుమ్ముతో నిండి ఉండటం, వంట పాత్రలపై ఈగలు ముసురుతుండటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల ఎదుట విద్యార్థినులు సమస్యలను ఏకరువు పెట్టారని సమాచారం. సిబ్బంది, విద్యార్థినులతో వేర్వేరుగా ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురుకులంలోని సమస్యలను వివరించి, త్వరితగతిన పరిష్కరించాలని డీసీవో మురళీకృష్ణను ఎమ్మెల్యే వెనిగండ్ల కోరారు.

Updated Date - Mar 25 , 2026 | 12:52 AM