Share News

గ్రాఫ్‌ పెరగాలి

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:49 AM

‘గ్రాఫ్‌ పెంచుకోవాలి.. కార్యకర్తలతో మమేకం అవ్వండి. ప్రజలకు మరింత దగ్గరగా ఉండండి. మీరు ఇంప్రూవ్‌ చేసుకోకపోతే మళ్లీ పిలుస్తా. జిల్లాలో రెండు, మూడు నియోజకవర్గాలే ఏ ప్లస్‌లో ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాలు కూడా ఆ స్థాయికి చేరాలి. ఎమ్మెల్యేలుగా మీ వ్యక్తిగత ప్రదర్శన ఏ ప్రాంతంలో ఎలా ఉందో కూడా నేను చెప్పగలను. 2029 ఇప్పుడే అనుకుని పనిచెయ్యాలి. నియోజకవర్గాలన్నీ అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లాలి. ప్రాధాన్యతా క్రమంలో అన్ని ప్రాజెక్టులను పూర్తిచేస్తాం’ అంటూ జిల్లా కూటమి ప్రజాప్రతినిథుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

గ్రాఫ్‌ పెరగాలి

- కార్యకర్తలతో మమేకం కావాలి

- ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేయాలి

- 2 నెలల్లో ఇంప్రూవ్‌ చేసుకోకపోతే మళ్లీ పిలుస్తా

- 2029 ఎన్నికలు ఇప్పుడే అనుకుని పని చేయండి

- జిల్లాలో పామర్రు, పెనమలూరే ఏ ప్లస్‌లో ఉన్నాయి

- మిగతా నియోజకవర్గాలు కూడా ఆ స్థాయికి రావాలి

- జిల్లా కూటమి ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు

‘గ్రాఫ్‌ పెంచుకోవాలి.. కార్యకర్తలతో మమేకం అవ్వండి. ప్రజలకు మరింత దగ్గరగా ఉండండి. మీరు ఇంప్రూవ్‌ చేసుకోకపోతే మళ్లీ పిలుస్తా. జిల్లాలో రెండు, మూడు నియోజకవర్గాలే ఏ ప్లస్‌లో ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాలు కూడా ఆ స్థాయికి చేరాలి. ఎమ్మెల్యేలుగా మీ వ్యక్తిగత ప్రదర్శన ఏ ప్రాంతంలో ఎలా ఉందో కూడా నేను చెప్పగలను. 2029 ఇప్పుడే అనుకుని పనిచెయ్యాలి. నియోజకవర్గాలన్నీ అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లాలి. ప్రాధాన్యతా క్రమంలో అన్ని ప్రాజెక్టులను పూర్తిచేస్తాం’ అంటూ జిల్లా కూటమి ప్రజాప్రతినిథుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/మచిలీపట్నం):

జిల్లాలోని కూటమి ప్రజాప్రతినిధులతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గాల పరిస్థితిని సీఎం చంద్రబాబు కళ్లకు కట్టినట్టుగా చెప్పటంతో ఎమ్మెల్యేలు విస్తుపోయారు. జిల్లాలో పామర్రు, పెనమలూరు నియోజకవర్గాలు మొదటి, రెండు వరుసలలో ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా పార్టీ, ప్రభుత్వం నిర్దేశించిన అంశాలను చేరుకోవటంలో పామర్రు మొదటి స్థానంలో ఉందన్నారు. ఆ తర్వాత పెనమలూరు నియోజకవర్గం రెండవ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు బాగుందని అభినందించారు. మచిలీపట్నం, పెడన నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ప్రజలకు, కార్యకర్తలకు మరింతగా అందుబాటులో ఉండాలని, వారి కోసం సమయం వెచ్చించాలని నిర్దేశించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి నేతలు సఖ్యతగా ముందుకు వెళ్లటం లేదన్నారు. అందరూ కలిసి ప్రయాణం చెయ్యాలని సూచించారు. గన్నవరం నియోజకవర్గంలో పాత నాయకులను, సీనియర్‌ నాయకులను కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలని చంద్రబాబు గట్టిగా చెప్పారు.

ఇలా అయితే ఎలా వాసంశెట్టి!

జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను ఉద్దేశించి కూడా చంద్రబాబు మాట్లాడారు. ఎన్నిసార్లు జిల్లాకు వచ్చావు ? ఎంత మంది ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటున్నావు ? ఎన్ని రివ్యూలు చేశావంటే పెద్దగా ఏమీ కనిపించటం లేదన్నారు. ఇలా అయితే ఎలా అని ప్రశ్నించారు. నియోజకవర్గాలలో ప్రజలకు ప్రజా ప్రతినిధులంతా చేరువుగా ఉండాలని చెప్పారు. ప్రజాదర్బార్‌ల నిర్వహణ సీరియస్‌గా తీసుకుని, వారి సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రెండో సారి గెలిచేలా నియోజకవర్గంలో పనిచేయాలని హితబోధ చేశారు. ఇప్పటి నుంచే ప్రజాప్రతినిధులంతా 2029 ఎన్నికలకు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తక్షణం నియోజకవర్గాలలో తమ పరిస్థితులను మెరుగుపరచుకోవాలని, రెండు నెలల సమయం ఇస్తున్నట్టు చెప్పారు. రెండు నెలల్లో ఇంప్రూవ్‌ కాకపోతే మాత్రం మళ్లీ పిలిపించి మాట్లాడాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యేలందరి ప్రోగ్రెస్‌ రిపోర్టులను సీల్డ్‌ కవర్లలో చంద్రబాబు ఈ సందర్భంగా అందజేశారు. మీ రెండేళ్ల పాలన ఆ రిపోర్టులలో ఉందని, తక్షణం సరిదిద్దుకోవాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చెయ్యాలని నిర్దేశించారు.

ప్రతి నియోజకవర్గంపై పూర్తిస్థాయి అవగాహనతో..

ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఇచ్చే క్రమంలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల విషయాలను చంద్రబాబు లోతుగా ప్రస్తావించారు. దీంతో సమావేశాన్ని సీఎం చంద్రబాబు ఆషామాషీగా ఏమీ నిర్వహించలేదని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. మాకు సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా చర్చించటం ఆశ్చర్యాన్ని కలిగించిందని పలువురు ఎమ్మెల్యేలు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య సఖ్యతను మెరుగు పరుచుకోవాలని చంద్రబాబు సూచిస్తూ.. అదేమైనా అంటే ఈ రాజకీయాలకు తగను అని అంటుంటారన్న బుద్ధప్రసాద్‌ వ్యాఖ్యలను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. అవనిగడ్డలో కూటమి నేతల మధ్య సఖ్యతను తీసుకురావాల్సిన బాధ్యతను బుద్ధప్రసాద్‌పై మోపారు. పామర్రు నియెజకవర్గంలో కిందటి సీజన్‌లో ఎరువుల కొరతను ఎదుర్కొన్న అంశాన్ని చంద్రబాబు ఎమ్మెల్యే వర్లకుమార్‌ రాజాను అడిగారు. ఈ సారి ఎరువుల కొరత రానీయకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. మీ యాక్షన్‌ ప్లాన్‌ ఏమిటి అని తెలుసుకున్నారు. ఇలా నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా గుర్తుంచుకుని చంద్రబాబు సమీక్ష చేయటం గమనార్హం.

ప్రారంభోత్సవ కార్యక్రమాలపై ఆరా!

జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. త్వరలో రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో ప్రారంభించాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రారంభించటానికి అవకాశం ఉన్న వాటిపైనా ఎమ్మెల్యేల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు నెలల్లో వాటిని పూర్తి చేయటానికి ఉన్న అవకాశాలను ఎమ్మెల్యేలతో చర్చించారు.

- సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాల సేకరణ

ప్రతి ఎమ్మెల్యే నుంచి సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి, ముఖ్యంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తన నియోజకవర్గంలో బ్రహ్మయ్యలింగం చెరువు అభివృద్ధి, మల్లవల్లి పారిశ్రామిక పార్క్‌ విస్తరణ, ఏలూరు కాల్వ - పోలవరం అనుసంధానం, అన్న క్యాంటీన్లు, 22ఏ తొలగింపు వంటి ప్రాజెక్టుల గురించి చెప్పారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార్‌ రాజాలు ఎన్‌హెచ్‌ -65 బాటిల్‌ నెక్‌ అంశాలను ప్రస్థావించారు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని, ఎలివేటెడ్‌ కారిడార్‌కు ప్రతిపాదించామని సీఎం చెప్పారు. మంత్రి కొల్లు రవీంద్ర బందరు పోర్టుకు అనుసంధానంగా 18 వేల ఎకరాలో ఇండస్ర్టీస్‌ ఏర్పాటు కోసం భూముల అంశంతో పాటు, పోర్టు అనుసంధాన రహదారులకు సంబంధించిన వాటి గురించి ప్రస్తావించారు.

- ఎమ్మెల్యేలంతా కూడా 22ఏకు సంబంధించిన అంశాలను వివరించారు. దీనిపై సమావేశానికి హాజరైన కలెక్టర్‌ బాలాజీని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ 22ఏ సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల నిర్దేశించిన అంశాల ప్రాతిపదికన త్వరితగతిన 22ఏ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్యేలు చెప్పిన అంశాలన్నింటినీ నోట్‌ చేసుకుని అధికారులు వెంటనే అధ్యయనం చేయాలని, పరిష్కరించే వాటికి తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రాజకీయంగా కలిసికట్టుగా సాగాలని హితబోధ

కూటమి నేతలు సఖ్యతగా ఉండాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. మేమంతా కలిసి ఉన్నామని, మీరు కూడా అదేవిధంగా కలిసి ఉండాలని చెప్పారు. పదిహేనళ్లపాటు విజయవంతంగా ప్రయాణం సాగించాలని సూచించారు. నియోజకవర్గాలలో జనసేన, బీజేపీలతో కలిసి వెళ్లాలన్నారు. వాళ్లను కూడా పిలిచి కలిసి సాగాలని, ఈ విషయంలో ఎలాంటి ఉదాసీనతకు తావివ్వవద్దని అలా చేస్తే సహించేది లేదని చెప్పారు.

కలెక్టర్‌కు దిశా నిర్దేశం

జిల్లా కలెక్టర్‌ బాలాజీకీ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో మరింత వేగంగా పనిచేయాలని సూచించారు. పీజీఆర్‌ఎస్‌ సమస్యల పరిష్కారంలో ప్రస్తుత వేగం సరిపోదని, స్పీడ్‌ పెంచాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ఎక్కువుగా పర్యటించాలని సూచించారు. చంద్రబాబుతో సమావేశానికి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పార్లమెంట్‌ సమావేశాలలో ఉండటంతో హాజరు కాలేదు. అమెరికా పర్యటనలో ఉండటంతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హాజరుకాలేదు. మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార్‌ రాజా, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌ పాల్గొన్నారు.

ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులతో మమేకమైన లోకేశ్‌

జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేశ్‌ గురువారం రాత్రి గ్రాండ్‌ డిన్నర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వారి పిల్లలతో ముచ్చటించారు. ఏం చదువుకుంటున్నారు.. ఏం కావాలనుకుంటున్నారు. భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల సతీమణులతోనూ ముచ్చటించారు. వారి వృత్తి, ప్రవృత్తిల గురించి కూడా తెలుసుకున్నారు. ఓ కుటుంబ సభ్యునిలా లోకేశ్‌ ప్రతి ఒక్కరితో మాట్లాడారు. అందరితో కలిసి డిన్నర్‌ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల సతీమణులకు మంగళగిరి చేనేత పట్టుచీరలను బహూకరించారు.

Updated Date - Feb 13 , 2026 | 12:50 AM