గవర్నర్, శాసనమండలి వ్యవస్థలను రద్దు చేయాలి
ABN , Publish Date - May 08 , 2026 | 11:48 PM
దేశవ్యాప్తంగా గవర్నర్, శాసనమండలి వ్యవస్థలను రద్దు చేయాలని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
-రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుంచం వెంకటసుబ్బారెడ్డి
ఆళ్లగడ్డ, మే 8 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా గవర్నర్, శాసనమండలి వ్యవస్థలను రద్దు చేయాలని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గవర్నర్లు, శాసనమండలి వ్యవస్థలను రద్దు చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి లేఖను పంపినట్లు తెలిపారు. తమిళనాడులో ప్రజాతీర్పును గౌరవించాలన్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం బాధాకరమన్నారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 153 ఆధారంగా ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తారన్నారు. గవర్నర్ సంబంధిత రాషా్ట్రనికి కార్యనిర్వాహక అధిపతి మాత్రమే అన్నారు. రాజ్యాంగం ప్రకారం గవర్నరు మంత్రి మండలికి విధుల నిర్వహణలో సలహాలు ఇస్తుందికానీ ఎటువంటి నిర్ణయాలు చర్యలు తీసుకునే అధికారం లేదన్నారు. గవర్నర్ లేకున్నా రాష్ట్ర పాలన సవ్యంగా సాగుతుందన్నారు. ప్రస్తుతం గవర్నర్ నియామకాలు, విధులు భారత రాజ్యాంగానికి అనుగుణంగా లేవన్నారు. గవర్నర్ల వ్యవస్థతో పాటు శాసనమండలి వ్యవస్ధను రద్దు చేస్తే దాని ద్వారా మిగిలిన ధనంతో రాషా్ట్రన్ని అభివృద్ధి చేయవచ్చన్నారు. గతంలో ఇదే అంశంపై అప్పటి సీఎం దివంగత నందమూరి తారకరామారావు కూడా ఉద్యమించారన్న విషయాన్ని కుంచం గుర్తు చేశారు. ఈ సమావేశంలో రాయలసీమ రాష్ట్ర సమితి సభ్యులు, రైతులు పాల్గొన్నారు.