ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:46 PM
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యమని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.
- ఎమ్మెల్యే పార్థసారథి
- మండిగిరిలో ‘ప్రజల కోసం.. మీ పార్థసారథి’
ఆదోని, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యమని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ‘ప్రజల కోసం... మీ పార్థసారథి’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని 19వ వార్డు మండిగిరి ప్రాంతంలో టీడీపీ ఇన్‌చార్జి శ్రీనివాస్ ఆచారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రజల యోగక్షేమాలను, సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. స్థానిక సుంకులమ్మవ్వ దేవాలయం వద్ద ప్రారంభమైన ఈ పర్యటనలో స్థానికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వార్డులో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. హౌసింగ్ పథకాలు, రేషన్‌కార్డులు, వివిధ ధ్రువీకరణ పత్రాల జారీ వంటి ప్రభుత్వ సేవలు వేగంగా అందుతున్నాయన్నారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని పలువురు సంతోషం వ్యక్తం చేశారు. వార్డులో పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. తాగునీటి పైపులైన్ ఏర్పాటు, ఆర్టీసీ కాలనీలో విద్యుత్ లో-వోల్టేజ్ సమస్య పరిష్కారానికి కొత్త ట్రాన్స్‌ఫార్మర్, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇండోర్ స్టేడియం నిర్మాణం, పార్కులు, ఓపెన్ జిమ్ ఏర్పాటు, ప్రజా మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రజలు విన్నవించారు. రాత్రివేళలో పోలీస్ బీట్ ఏర్పాటు, ఎల్‌ఈడీ వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న హౌసింగ్ బిల్లుల మంజూరు, మండిగిరి ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పార్థసారథి తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
‘నిరుద్యోగ భృతి’ అమలు చేయాలి
ఆదోని అగ్రికల్చర్: ఎన్నికల్లో యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి హామీని వెంటనే ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని డీవైఎ్‌ఫఐ పట్టణ అధ్యక్షుడు మోహన కోరారు. ఆదివారం 19వ వార్డు మండగిరి పర్యటించిన ఎమ్మెల్యే పార్థసారథిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీలు చదువుకొని ఎంతోమంది నిరుద్యోగ యువత ఉపాధి లేక అవస్థలు పడుతున్నారన్నారు. పట్టణంలో ఉన్న పరిశ్రమలు మూతపడడంతో ఉపాధి కోసం నగరాలకు వెళ్తున్నారని, అక్కడ కూడా సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్నారన్నారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన కూడా వదలకపోవడంతో నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం నిరుద్యోగ భృతి మంజూరు చేసి యువతను ఆదుకోవాలని కోరారు.