Share News

యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:18 AM

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు.

యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం
నియామక పత్రాలు అందిస్తున్న వైకుంఠం జ్యోతి

- టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి

ఆలూరు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం కోసం సమయాన్ని వృథా చేయకుండా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని నిరుద్యోగ యువతీ, యువకులు ఉపాధి పొందాలన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. మొత్తం 11 కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించాయి. 120 మంది నిరుద్యోగులు హాజరు కాగా 30 మందికి అవకాశం కల్పించారు. వీరికి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ సాయితేజ, ఆలూరు కో ఆర్డినేటర్‌ వీరేష్‌, ప్రిన్సిపాల్‌ రమాదేవి పాల్గొన్నారు.

మహిళలను వేధింపులకు గురిచేస్తే సహించం

మహిళలను వేధింపులకు గురిచేసినా, దాడులు చేసినా సహించబోమని టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అంగన్‌వాడీ టీచర్‌ లేపాక్షిని ఆమె మంగళవారం పరామర్శించారు. వేధింపులకు గురి చేసిన వీరేష్‌ అనే వ్యక్తి తమ వద్ద లేడన్నారు. తక్షణమే అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని ఎస్‌ఐకు సూచించామన్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా తన దృష్టికి ధైర్యంగా తీసుకురావాలన్నారు. మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు వైకుంఠం జ్యోతి సూచించారు.

Updated Date - Jul 01 , 2026 | 12:18 AM