బందరు అభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:30 AM
బందరు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. దేశంలో ప్రసిద్ధి చెందిన మచిలీపట్నం నగరాన్ని సుందర బందరుగా తీర్చిదిద్దుతామన్నారు. గురువారం మునిసిపల్ కార్యాయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదర్శవంతమైన మునిసిపాలిటీగా నిలిపేందుకు కావలసిన నిధులను తీసుకువస్తున్నామన్నారు. మురుగు నీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.13 కోట్లతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తాగునీటి పైపులైను మరమ్మతులు, అభివృద్ధి కోసం రూ.15 కోట్ల నిధులు కేటాయించామన్నారు.
- మురుగు సమస్య పరిష్కారానికి రూ.13 కోట్లతో ప్రత్యేక వ్యవస్థ
- రూ.15 కోట్లతో తాగునీటి పైపులైను మరమ్మతులు, అభివృద్ధి పనులు
- సుందర బందరు సాధనకు అవిశ్రాంత కృషి
- త్వరలో మచిలీపట్నంలోని 50 డివిజన్లు, 34 పంచాయతీల్లో పర్యటిస్తా
- సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటా
- రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
- మునిసిపల్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ
- పలు అంశాలపై అధికారులకు క్లాస్
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి )
బందరు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. దేశంలో ప్రసిద్ధి చెందిన మచిలీపట్నం నగరాన్ని సుందర బందరుగా తీర్చిదిద్దుతామన్నారు. గురువారం మునిసిపల్ కార్యాయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదర్శవంతమైన మునిసిపాలిటీగా నిలిపేందుకు కావలసిన నిధులను తీసుకువస్తున్నామన్నారు. మురుగు నీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.13 కోట్లతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తాగునీటి పైపులైను మరమ్మతులు, అభివృద్ధి కోసం రూ.15 కోట్ల నిధులు కేటాయించామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకునేలా పనులు చేపట్టాలన్నారు. గతంలో వాటర్ హౌస్ వద్ద కొంతమంది గంజాయి తాగి తాగునీటి వ్యవస్థను నాశనం చేశారని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మచిలీపట్నంలో 12 వేలకు పైగా వీధి దీపాలు ఉన్నాయని, వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించామన్నారు. పార్కులు, శ్మశాన వాటికల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు.
బకాయిల వసూలుతో మరిన్ని పనులు
మునిసిపాలిటీకి రూ.24 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. వాటిని చెల్లిస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. మునిసిపాలిటీ పరిధిలో 108 కిలోమీటర్ల డ్రైనేజీ ఉండగా, అందులో 122 చోట్ల డ్రెయిన్లు అనుసంధానం కాలేదన్నారు. వీటిని అనుసంధానం చేస్తూ డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తామన్నారు. అమృత పథకంలో ఇళ్ల మధ్య ఉన్న డ్రెయిన్లకు కూడా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడతామని తెలిపారు. తరచూ కోనేరుసెంటర్ నుంచి జిల్లా పరిషత సెంటర్ వరకు ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో మచిలీపట్నంలో మునిసిపాలిటీ 42వ స్థానంలో ఉండటం బాధాకరమన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని 50 డివిజన్లు, 34 పంచాయతీల్లో త్వరలో పర్యటిస్తామని, సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామన్నారు.
మొదటి సారి రాక.. 2 గంటలు సమీక్ష
మంత్రి కొల్లు రవీంద్ర మొదటి సారి నగర పాలక సంస్థ కార్యాలయంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా వివిధ సెక్షన్‌లను పరిశీలించారు. పలు ఫైళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలస్యంగా విధులకు వచ్చిన ఉద్యోగులను మందలించారు. విధులు సక్రమంగా నిర్వహించని వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రంజాన్ రోజున తాగునీరు కలుషితం కావడంపై ప్రశ్నించారు. మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్ చాంబర్‌లో దాదాపు రెండు గంటల సేపు నగరంలోని తాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజి సమస్యలపై సమీక్షించారు. మచిలీపట్నంలో ప్రతిరోజూ తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. రంజాన్ రోజున తాగునీరు రంగు మారిందని తనకు ఫిర్యాదులు అందాయని, అలా జరుగుతుంటే డీఈలు, ఏఈలు ఏం చేస్తున్నారని నిలదీశారు. పొరుగూరు నుంచి ఉద్యోగులు బందరు రావడం వల్ల తక్షణ సమస్యలకు పరిష్కారం లభించదన్నారు. ఉద్యోగులందరూ బందరులోనే ఉండాలని చెప్పారు. అడిగిన దానికి జవాబులు సరిగా చెప్పలేని అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద, ఇతర రిజర్వాయర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేయాలని మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, ఇంజనీర్లను ఆదేశించారు. మునిసిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. అఽధికారులు నత్తనడకన పనులు చేస్తే ఆశించిన అభివృద్ధిని సకాలంలో సాధించలేమన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, మాజీ కౌన్సిలర్లు పల్లపాటి సుబ్రహ్మణ్యం, మరకాని సమతాకీర్తి, దింటకుర్తి సుధాకర్, అన్నం ఆనంద్, టీడీపీ నాయకులు లోగిశెట్టి వెంకటస్వామి, బచ్చుల అనిల్‌కుమార్, అడపా మధుకర్, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు పాల్గొన్నారు.