Share News

పందేల కోలాహలం

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:38 AM

సంక్రాంతి పండుగ ముసుగులో ఉమ్మడి కృష్ణాజిల్లాలో జూదాలు జోరుగా సాగాయి. శివారు ప్రాంతాలన్నీ కోడి పుంజుల యుద్ధాలతో రణరంగాన్ని తలపించాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే జూద క్రీడలు ప్రారంభమయ్యాయి. బరుల వద్దకు భారీగా జనం తరలివచ్చారు. ఈ ఏడాది మహిళలు, యువతుల సంఖ్య కూడా పెరిగింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పందేలు కొనసాగాయి. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో నిర్వహించిన బరుల వద్దకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది హాజరయ్యారు.

పందేల కోలాహలం

- ఉమ్మడి కృష్ణాలో జోరుగా కోడి పందేలు, పేకాట, గుండాట

- తొలిరోజు రూ.150 కోట్లపైనే చేతులు మారిన నగదు

- బరుల వద్ద బారులు తీరిన వాహనాలు

- కిక్కిరిసిపోయిన ప్రత్యేక గ్యాలరీలు

- రామవరప్పాడు, కేసరపల్లి, మీర్జాపురం వైపు అందరి చూపు

(ఆంధ్రజ్యోతి - విజయవాడ)

సంక్రాంతి పండుగ ముసుగులో ఉమ్మడి కృష్ణాజిల్లాలో జూదాలు జోరుగా సాగాయి. శివారు ప్రాంతాలన్నీ కోడి పుంజుల యుద్ధాలతో రణరంగాన్ని తలపించాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే జూద క్రీడలు ప్రారంభమయ్యాయి. బరుల వద్దకు భారీగా జనం తరలివచ్చారు. ఈ ఏడాది మహిళలు, యువతుల సంఖ్య కూడా పెరిగింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పందేలు కొనసాగాయి. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో నిర్వహించిన బరుల వద్దకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది హాజరయ్యారు.

తొలిరోజు రూ.150 కోట్లు!

జగ్గయ్యపేట నుంచి మచిలీపట్నం వరకు కోడి పుంజులు విరామం లేకుండా బరుల్లో తలపడ్డాయి. ఎక్కడా ఆగకుండా పేక ముక్కలు తిరిగాయి. భోగి రోజున నిర్వహించిన పందేలు, గుండాట, పేకాటలో సుమారుగా రూ.150 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. బెట్టింగ్‌లను బట్టి బరులు ఏర్పాటు చేశారు. దాని ప్రకారం పందేలు జరిగాయి. చిన్నచిన్న బరుల వద్ద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు బెట్టింగ్‌లు నడిచాయి. మీడియం బరుల వద్ద రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పందేలు సాగాయి. మేజర్‌ బరుల వద్ద మాత్రం రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పందేలు నడిచాయి. పేకాట, గుండాటలతో కలుపుకుని బుధవారం ఒక్కరోజే రూ.150 కోట్ల వరకు చేతులు మారినట్టు సమాచారం. గురువారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ బెట్టింగ్‌లు మరింతగా పెరుగుతాయని చెబుతున్నారు. సుమారుగా రూ.200 కోట్ల నుంచి రూ. 300 కోట్ల వరకు పందేలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.

బరుల వద్ద మగువల సందడి

సంక్రాంతి సంబరాలు ఈ ఏడాది కొత్త ఒరవడిని తీసుకొచ్చాయి. బరుల వద్ద మగువలు సందడి చేశారు. పోరాడే పుంజులపై పందేలు భారీగా కట్టారు. బరుల్లోకి కత్తులు కట్టుకుని దిగిన పుంజుల బలాబలాలను బేరీజు వేసుకుని మరీ బెట్టింగ్‌లు కట్టారు. కొన్ని బరుల వద్ద పందేలను వీక్షించడానికి ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో మహిళలే అధికంగా కనిపించారు.

మీర్జాపురం వైపు పరుగులు

జిల్లాలో ప్రతి ఏడాది మూడు, నాలుగు భారీ బరులు ఉండేవి. ఇందులో గన్నవరం నియోజకవర్గం అంపాపురం ముందు వరుసలో ఉండేది. ఈసారి అంపాపురం విరామం తీసుకుంది. కొత్తగా కేసరపల్లిలో భారీగా బరులను ఏర్పాటు చేశారు. మునేరు పరివాహక ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న తోటల్లోనూ, గుడివాడ నియోజకవర్గంలోను ఈ బరులు ఉన్నాయి. వీటన్నింటిని ఏలూరు జిల్లాలోని మీర్జాపురం బరులు వెనక్కి నెట్టేశాయి. హైటెక్‌ హంగులతో ఇక్కడ బరులు ఏర్పాటు చేశారు. తొలి పందెమే రూ.50లక్షలతో ప్రారంభమైందని నిర్వాహకులు చెబుతున్నారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు ఇది దగ్గరగా ఉండడంతో ఈ రెండు జిల్లాల నుంచి పందెం రాయుళ్లు మీర్జాపురం వైపు పరుగులు తీశారు.

Updated Date - Jan 15 , 2026 | 12:38 AM