Share News

మోగిన ఎన్నికల నగారా

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:16 AM

స్థానిక సమరానికి సైరన మోగింది. పురపాలక సంఘాలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా బుధవారం విడుదల చేశారు.

   మోగిన ఎన్నికల నగారా

మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఈ నెల 28న పట్టణ పోలింగ్‌

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నవంబరు 3న

మూడు విడతల్లో సం‘గ్రామం’

టికెట్ల కోసం ఆశావహుల పరుగులు

పొత్తులపై కూటమి పార్టీల కసరత్తు

వేడెక్కిన రాజకీయాలు.. అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ

అమల్లోకి ఎన్నికల కోడ్‌

కర్నూలు, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక సమరానికి సైరన మోగింది. పురపాలక సంఘాలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా బుధవారం విడుదల చేశారు. రాజకీయ శిబిరాల్లో సందడి మొదలైంది. రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. టికెట్‌ ఆశిస్తున్న నాయకులు ప్రయత్నాలకు పదును పెట్టారు. అధికార కూటమిలో ప్రధాన పార్టీ టీడీపీ టికెట్‌ కోసం ఆశావహులు అధినేత ఆశీస్సుల కోసం అమరావతికి పరుగులు పెట్టారు. మరో వైపు కూటమి పార్టీల మధ్య పొత్తులు, సీట్లు సర్దుబాటు వ్యవహారం చర్చనీయంశంగా మారింది. ఎవరికి టికెట్‌ దక్కుతుంది..? ఏ వార్డు ఎవరికి కేటాయిస్తారు..? జడ్పీటీసీగా బరిలో నిలిచేదెవరు..? ఎవరికి నిరాశ ఎదురౌతుంది..? వంటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. స్థానిక పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అధికార, ప్రతిపక్ష నాయకులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది.

జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు పురపాలక సంఘాలు, 26 జిల్లా పరిషత ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ), 432 మండల పరిషత ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ)లతో పాటు 484 గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణ కోసం బుధవారం షెడ్యూల్‌ జారీ జారీ అయింది. మూడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ బుధవారం మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన జారీతో ప్రారంభమైంది. ఎన్నికల కోడ్‌ డిసెంబరు మూడో తేదీ దాకా ఉంటుంది. 48 రోజులు వివిధ స్థానిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి పర్యవేక్షణలో పకడ్భందిగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు. నగరపాలక సంస్థ, పురపాలక సంఘాల కమిషనర్లతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎంపీడీవోలు అసరమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో ప్రజాప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గనకూడదు. అలాగే ఇప్పటికే మంజూరైన పనులు మినహా కొత్తగా ఎలాంటి పనులు ప్రారంభించకూడదు.

ఫ రాజకీయ శిభిరాల్లో సందడి

పుర పోరులో భాగంగా మేయర్‌, చైర్మన, గ్రామ పంచాయతీ సర్పంచి ఎన్నిక ప్రత్యక్ష విధానంలో నిర్వహిస్తున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీ నాయకులకు కత్తిమీద సాముగా మారింది. మేయర్‌ చైర్మన అభ్యర్థులు నలుగురు, 187 మంది వార్డు కార్పొరేటర్‌, కౌన్సిలర్లు, 26 జడ్పీటీసీ, 432 ఎంపీటీసీ, 484 పంచాయతీ సర్పంచ అభ్యర్థులు కలిపి 1,133 మందిని ఎంపిక చేయాల్సి ఉంది. వీరితో పాటు దాదాపుగా 5,100 మంది పంచాయతీ వార్డు సభ్యులకు అభ్యర్థులను ఎంపిక చేయాలి. అంటే.. మూడు స్థానిక సంస్థల్లో వివిధ హోదాల్లో 6,233 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పట్టణాల్లో ప్రతి ఓటరు చైర్మన, కార్పొరేటర్‌/కౌన్సిలర్‌కు రెండు ఓట్లు, గ్రామీణ ఓటర్లు జడ్పీటీసీ, ఎంపీటీసీలకు రెండు, పంచాయతీల్లో సర్పంచ, వార్డు సభ్యులకు రెండు చొప్పున నాలుగు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అధికార కూటమి పార్టీలతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపికలో కసరత్తు మొదలు పెట్టారు. బరిలో తలపడేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహులు టికెట్‌ కోసం స్థానిక నాయకులతో పాటు అధిష్టానం ఆశీస్సుల కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు.

ఫ ఎన్నికల షెడ్యూలు ఇది :

కార్యచరణ మున్సిపల్‌ ఎంపీటీసీ/ పంచాయతీలు (డివిజన్ల వారిగా)

జడ్పీటీసీలు ఫేజ్‌-1 (ఆదోని) పేజ్‌-2 (పత్తికొండ) ఫేజ్‌-3 (కర్నూలు)

-------------------------------------------------------------------------------------

ఎస్‌ఈసీ నోటిఫికేషన 14 19 నవంబరు 13 నవంబరు 16 నవంబరు 19

ఆర్‌వో/ఈవో నోటిఫికేషన 16 21 15 18 21

నామినేషనకు ఆఖరు తేది 18 23 17 20 23

నామినేషన్ల పరిశీలన 19 24 18 21 24

అప్పీల్‌ --- 25 19 22 25

అప్పీల్‌పై విచారణ --- 26 20 23 26

ఉప సంహరణ 21 27 21 24 27

తుది జాబితా ప్రకటన 21 27 21 24 27

పోలింగ్‌ 28 నవంబరు 3 నవంబరు 26 29 2

బైపోల్‌ 29 4 27 30 3

ఓట్ల లెక్కింపు 30 5వ తేది 26 29 2

---------------------------------------------------------------------------------- --

ఫ డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్మన్లు, జడ్పీ చైర్మన, ఎంపీపీల ఎంపిక

---------------------------------------------------------------------------------------------------------------------

కార్యచరణ మున్సిపల్‌ పంచాయతీ

----------------------------------------------------------------------------------------------------------------------

నోటిఫికేషన అక్టోబరు 28 నవంబరు 3

సభ్యులకు నోటీసులు జారీ నవంబరు 1 నవంబరు 7

ఎన్నికలు నంబరు 5 నంబరు 11

------------------------------------------------------------------------------------------------------------------

Updated Date - Oct 15 , 2026 | 12:17 AM