జిల్లా సాధన కోసం కలసిరావాలి
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:01 PM
ఆదోని జిల్లా సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు రఘురామయ్య, అశోక నందరెడ్డి, కృష్ణమూర్తి గౌడ్ కోరారు.
రేపు ఐదు నియోజకవర్గాల బంద్
ఆదోని అగ్రికల్చర్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : ఆదోని జిల్లా సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు రఘురామయ్య, అశోక నందరెడ్డి, కృష్ణమూర్తి గౌడ్ కోరారు. గురువారం జేఏసీ నాయకులు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ ఇనచార్జి రాఘవేంద్ర రెడ్డిని కలిసి ఈనెల 24న ఐదు నియోజకవర్గాల బంద్‌కు సహకరించాలని కోరారు. పట్టణంలోని కోట్ల సర్కిల్‌లో ఏర్పాటు చేసిన రిలే దీక్షలు 68వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో మేముసైతం మా బంగారు భవిష్యత్తు కోసం అంటూ ఆర్ట్స్ కళాశాల ఎనఎ్‌సఎ్‌స వలంటీర్లు రాఘవేంద్ర, రాజ్‌కుమార్, ఉదయ్, మహేష్, అశోక్, సోమశేఖర్, నారాయణ, మహాలింగ కూర్చున్నారు. ఎనఎ్‌సఎ్‌స డివిజన అధికారి జోనాధన వీక్లీ మాట్లాడుతూ ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకొని విద్యార్థులు ఉపాధి కోసం నగరాలకు వెళ్తున్నారన్నారు. సరైన ఉద్యోగాలు దొరకక గ్రామాల్లోనే కూలీలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదోనిజిల్లా అయితే పరిశ్రమలు విద్యాసంస్థలు, కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు ఏర్పాటు అవుతాయన్నారు. ఐదు నియోజకవర్గాలకు చెందిన చదువులు పూర్తయిన వెంటనే ఉపాధి పొందుతారు అన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నూర్ అహ్మద్ వీరేష్, వెంకటేష్ పాల్గొన్నారు.
ఆలూరు: వెనుకబడిన ఆలూరు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని మాదిగ దాసు, దాసరి సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి నరసింహులు, బీసీవై పార్టీ జిల్లా ఇన్‌చార్జి ఎల్లార్తి అర్జున్, జేఏసీ నాయకులు కత్తి రామాంజనేయులు, ఎల్లప్ప, రామలింగ, చంద్రకాంత్‌రెడ్డి, పూల రామాంజినేయులు డిమాండ్ చేశారు. గురువారం ఆలూరు జేఏసీ ఆధ్వర్యంలో ఆదోని జిల్లా సాధన కోసం సాగుతున్న దీక్ష 42వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో మాదిగ దాసుల, దాసరి సంఘం సభ్యులు పద్మయ్య, భోజరాజు, రవి, రామకృష్ణ, వెంకోబ, గోవర్ధన, రామకృష్ణ, నెట్టేకల్, నారాయణస్వామి, వెంకటేష్, ఆనంద్‌కుమార కూర్చున్నారు. సంప్రదాయబద్ధంగా పద్యాలు పాడుతూ గంటలు మోగిస్తూ, శంఖం ఊపుతూ గోవిందా గోవిందా జిల్లా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ దీక్షలకు సీపీఐ నాయకులు చాపల గోపాల్, సామాజిక కార్యకర్త కమలాకర్‌నాయుడు, మాజీ సైనికుడు మహేశ, రిటైర్డ్ ఉద్యోగులు బసిరెడ్డి, దాదా, వేమిరెడ్డి సంఘీభావం తెలిపారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ వెనుకబడిన ఆలూరు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా కావాలన్నారు. శనివారం జరిగే 5 నియోజకవర్గాల బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.