Share News

కర్రల కరాళ నృత్యం

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:58 PM

వగట్టులో కర్రలు కరాళ నృత్యం చేశాయి. ఆచారమే గెలిచింది.. రక్తం చిందింది. తలలు పగిలినా, గాయాలైనా భక్తులు వెనుకడుగు వేయలేదు.

   కర్రల కరాళ నృత్యం
వరకు దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో కర్రల సమరంలో పాల్గొన్న భక్తులు

రక్తం చిందిన దేవరగట్టు

గెలిచిన ఆచారం

పగిలిన తలలు

పలువురికి గాయాలు

ఉత్కంఠ భరితంగా బన్ని ఉత్సవం

భక్తుల జయజయధ్వానాలు

ముగిసిన మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర

ఆలూరు/హొళగుంద, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): దేవగట్టులో కర్రలు కరాళ నృత్యం చేశాయి. ఆచారమే గెలిచింది.. రక్తం చిందింది. తలలు పగిలినా, గాయాలైనా భక్తులు వెనుకడుగు వేయలేదు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం పేరుతో దేవరగట్టు కొండపై మరోసారి బన్ని సమరం రక్తసిక్తమైంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంలో ప్రసిద్ధగాంచిన దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాలు బుధవారం అర్ధరాత్రి ఉత్కంఠ భరితంగా జరిగాయి. లక్షలాది మంది భక్తుల జయజయధ్వనాలు, కాగడాల వెలుగులు, కర్రల చప్పుళ్ల మధ్య స్వామివారి జైత్రయాత్ర సాగింది. ఈ కర్రల సమయంలో పలువురు తీవ్రంగా గాయ పడగా వారిని ఆదోని, ఆలూరు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.

అర్ధరాత్రి కల్యాణం

దేవరగట్టు కొండపై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బన్ని ఉత్సవాల సందడి మొదలైంది. తలకు పాగాలు చుట్టి, చేతుల్లో కర్రలు పట్టుకున్న భక్తులు యుద్ధానికి సిద్ధమైన సైనికులను తలపించారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వేద పండితులు రవిశర్మ మాళ మల్ల్వేరస్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవమూర్తులను పల్లకిలో కొండపై నుంచి కిందకు తీసుకొచ్చి సింహాసనకట్ట వద్దకు చేర్చారు. అక్కడ మహా మంగళహారతి నిర్వహించారు.

ఉత్సవమూర్తులను తమ ఆధీనంలోకి..

స్వామివారి ఉత్సవమూర్తులను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు వివిధ గ్రామాలకు చెందిన భక్తులు కర్రలతో కదనరంగంలోకి దిగడంతో బన్ని ఉత్సవం ప్రారంభమైంది. సుమారు 800 అడుగుల ఎత్తులో ఉన్న దేవరగట్టు కొండపై అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉత్సవాలు కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

కాగడాల వెలుగుల్లో ..

నెరణికి, నెరణికితండా, కొత్తపేటకు చెందిన భక్తులు ఉత్సవమూర్తులను పల్లకిలో మోసుకుంటూ కొండ దిగువన ఉన్న సింహాసనకట్టకు చేరుకున్నారు. పల్లకికి రక్షణగా ఆ గ్రామాల భక్తులు కర్రలు పట్టుకున్న చుట్టూ నిలిచారు. మరోవైపు అరికెర, అరికెరతండా, కురుకుంద, బిలేహాల్‌, సుళువాయి, ఎల్లార్తి, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు కర్రలు, కాగడాలతో అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో ఇరువర్గాల మధ్య కర్రల సమరం తీవ్రరూపం దాల్చింది. దేవుడిని కాపాడుకోవాలనే పట్టుదలతో ఒకవైపు, ఉత్వసమూర్తులను తమవశం చేసుకోవాలనే సంకల్పంతో మరోవైపు భక్తులు పోటాపోటీగా తలపడ్డారు.

డిర్‌ గోపరాక్‌ అంటూ..

డిర్‌... గోపరాక్‌ అంటూ చేసే నినాదాలతో కొండ ప్రాంతం మార్మోగింది. కాగడాల వెలుగుల్లో వేలాది కర్రలు గాల్లోకి లేవగా, పసుపు బండారుతో నిండిన భక్తులు మల్లయోధుల్లా తలపడ్డారు. ఒకవైపు భక్తులు కర్రలతో దాడులు చేస్తుండగా, మరోవైపు గాయపడిన వారు సైతం తిరిగి లేచి సమరంలో పాల్గొనే దృశ్యాలు కనిపించాయి. సుమారు అరగంటకు పైగా సాగిన ఈ క్రల సమరంరాత్రి 1;50 గంటల ప్రాంతంలో ముగిసింది. ప్రతిసారీ మాదిరిగానే నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఉత్సవమూర్తుల పల్లకిని తీసుకెళ్లడంలో విజయం సాధించారు.

అడవిలో పూజలు...

కర్రల సమరం అనంతరం ఉత్సవమూర్తుల పల్లకితో భక్తులు దట్టమైన అటవీ ప్రాంతంలోని ముళ్లపడ, పాదాలకట్ట ప్రాంతాలకు చేరుకుని పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి రాక్షసపడకు వెళ్లారు. సంప్రదాయంలో భాగంగా కంచె వీరబసవరాజు అనే గొరవయ్య తన కాలి పక్క భాగంలోని రంధ్రం గుండా 11 మూరల దారాన్ని తీసి రాక్షసుడికి రక్పార్పణం చేసినట్లు ఆచారం కొనసాగించారు. గురువారం స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు.

నియంత్రించలేకపోయిన అధికారులు

బన్ని ఉత్సవాల్లో కర్రల సమరాన్ని నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసుశాఖ ముందస్తు చర్యలు చేపట్టాయి. నెల రోజులుగా కలెక్టర్‌ డా.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కొండపైకి వెళ్లే మార్గాల్లో ప్రత్యేక పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి భక్తుల నుంచి కర్రలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సంప్రదాయంలో భాగంగా నిర్వహించే కర్రల సమరాన్ని పూర్తిగా నియంత్రించలేకపోయారు. దీంతో పలువురి తలలకు గాయాలై రక్తం చిందింది. మొత్తం గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్ర గాయాల పాలైన మందిని ఆలూరు, ఆదోని ఆసుపత్రులకు తరలించారు. స్వల్ప గాయాలైన కొందరు భక్తులు గాయాలపై స్వామివారి బండారు పూసుకుని తిరిగి ఉత్సవాల్లో పాల్గొన్నట్లు కనిపించింది. ఉత్సవాల నిర్వహణను ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్‌ వీరనాగప్ప, పత్తికొండ ఆర్డీఓ ఓబులేష్‌, డీఎస్పీ వంశీధర్‌రెడ్డి, సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్‌ఐ దిలీ్‌పకుమార్‌ ఉత్సవాల పర్యవేక్షణలో పాల్గొన్నారు.

భారీ బందోబస్తు

దసరా పండగ సందర్భంగా అక్టోబరు 21వ తేదీన బుధవారం హొళగుంద మం డలం దేవరగట్టులో జరిగే మాళ మల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాలకు 1000 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. 110 నైట్‌ విజన్‌ సీసీ కెమెరాలు, 700 ఎల్‌ఈడీ లైట్లు, 10 డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే సీసీ కెమెరాలకు ఒక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.

Updated Date - Oct 21 , 2026 | 11:58 PM