జోరుగా మట్టి వ్యాపారం!
ABN , Publish Date - May 19 , 2026 | 12:11 AM
జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. తవ్వకాలకు ప్రస్తుతం అనువైన వాతావరణం కావడంతో ఎక్కడపడితే అక్కడ యంత్రాలతో తవ్వేస్తోంది. యథేచ్ఛగా ట్రాక్టర్లలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. తెరపైన గృహ అవసరాలకు తరలిస్తున్నామని చెబుతున్నా, తెర వెనుక రియల్ ఎస్టేట్ వెంచర్‌లు, ఇతరత్రాలకు మట్టిని విక్రయించేస్తోంది. జిల్లాలోని మచిలీపట్నం, పెడన, పామర్రు నియోజకవర్గాల్లో జోరుగా సాగుతున్న మట్టి దందాపై ప్రత్యేక కథనం.
- జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
- మచిలీపట్నం, పెడన, పామర్రు నియోజకవర్గాల్లో యథేచ్ఛగా తవ్వకాలు
- చెరువులు, ప్రభుత్వ భూములే లక్ష్యంగా దందా!
- ట్రాక్టర్లు, లారీల్లో ప్రైవేటు వెంచర్లు, ఇతర ప్రదేశాలకు తరలింపు
- మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆయా గ్రామాల ప్రజలు
జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. తవ్వకాలకు ప్రస్తుతం అనువైన వాతావరణం కావడంతో ఎక్కడపడితే అక్కడ యంత్రాలతో తవ్వేస్తోంది. యథేచ్ఛగా ట్రాక్టర్లలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటోంది. తెరపైన గృహ అవసరాలకు తరలిస్తున్నామని చెబుతున్నా, తెర వెనుక రియల్ ఎస్టేట్ వెంచర్‌లు, ఇతరత్రాలకు మట్టిని విక్రయించేస్తోంది. జిల్లాలోని మచిలీపట్నం, పెడన, పామర్రు నియోజకవర్గాల్లో జోరుగా సాగుతున్న మట్టి దందాపై ప్రత్యేక కథనం.
(ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం):
మట్టి మాఫియా జిల్లాలో బరితెగించింది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓ అడుగు ముందుకేసి సముద్రతీరం వెంబడి ఉన్న గ్రామాల్లో ప్రభుత్వ భూములు, పోర్టు నిర్మాణం కోసం రైతులు మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)కి ఇచ్చిన భూముల నుంచి మట్టిని తవ్వి విక్రయించేస్తోంది. ఇటీవల మచిలీపట్నం నియోజకవర్గం జనసేన ఇన్‌చార్జి బండి రామకృష్ణ మచిలీపట్నం ఉత్తర మండలంలోని గోపువానిపాలెం గ్రామానికి వెళ్లి మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. దీంతో సముద్ర తీరంలోని గ్రామాల్లో మట్టి అక్రమ తవ్వకాల అంశం మరింతగా బహిర్గతమై రాజకీయ వర్గాల్లో అలజడిని రేపింది. టీడీపీ, జనసేన రెండు వర్గాలుగా విడి పోయే పరిస్థితి ఏర్పడింది. గోపువానిపాలెం గ్రామంలో పరిస్థితి ఇలా ఉంటే, పక్కనే ఉన్న కరగ్రహారం గ్రామానికి చెందిన మట్టి మాఫియా తెరపైకి వచ్చింది. తమ గ్రామంలో ఉన్న మట్టిని తామే తవ్వుకుంటామని, ట్రాక్టర్‌లు కొనగోలు చేశామని, 500 కుటుంబాలకుపైగా మట్టి తవ్వకాలపై ఆధారపడి జీవనం చేస్తున్నామని బాహాటంగానే చెప్పడం, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం గమనార్హం. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు మట్టిదందాకు వత్తాసుపలుకుతున్నారని కూడా చెప్పడం విశేషం. మట్టి తవ్వకాలపై తెరవెనుక ఉన్న బడాబాబుల భాగోతం బయటపడి రాజకీయంగా తలనొప్పులు రావడంతో తాత్కాలికంగా ఈ గ్రామాల్లో మట్టి తవ్వకాలకు విరామం ప్రకటించారు.
పెడన నియోజకవర్గంలో దూకుడు
పెడన నియోజకవర్గం గూడూరు మండలం తరకటూరు గ్రామం సమీపంలోని పర్ణశాల గ్రామం వద్ద జాతీయ రహదారి పక్కనే 10 ఎకరాల చెరువు ఉంది. ఈ చెరువులో నుంచి మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వి తరలించేస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై బురద మట్టి చేరి రహదారిపై ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ఈ చెరువులోని మట్టిని తవ్వి పక్కనే ఉన్న వెంచర్‌ను మెరక చేస్తున్నారు. ఇటీవల జిల్లాస్థాయి అధికారి కారులో రాత్రి సమయంలో మచిలీపట్నం వస్తుండగా రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్ అఽధికారి కారునే ఢీకొట్టేంత పని చేసింది. దీంతో ఆగ్రహించిన సదరు అధికారి మట్టి తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటికప్పుడుపోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ట్రాక్టర్‌లను నిలిపివేశారు.
కొత్త రోడ్డు ధ్వంసం
రెండు రోజుల పాటు మిన్నకుండిపోయిన మట్టి మాఫియా సభ్యులు మళ్లీ మట్టి రవాణాను తుమ్మలపాలెం రోడ్డు మీదుగా తరలించడం ప్రారంభించారు. ఇటీవలనే ఈ రహదారి నిర్మాణం జరిగింది. మట్టి ట్రాక్టర్ల రాకపోకలతో రహదారి అంతా గోతులు పడ్డాయి. రోడ్డును వేసిన కాంట్రాక్టర్ రహదారిని పాడు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో వేరే మార్గం గుండా మట్టిని తవ్వి తరలిస్తున్నారు.
- చిట్టి గూడూరులో చెరువు నుంచి రోజూ 20 ట్రాక్టర్‌ల ద్వారా రాత్రి సమయంలో మట్టిని తరలించుకుపోతున్నారు. దీంతో గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కొద్దిసేపు మాత్రమే మట్టి తవ్వకాలను నిలిపి మళ్లీ ప్రారంభించడం గమనార్హం.
- తరకటూరులోని చెరువు తవ్వకాలు చేసేందుకు తెరవెనుక బేరాలు కుదుర్చుకున్నారని సమాచారం. ఎవరికి ఎంతమేర వాటాలు ఇవ్వాలనే అంశంపై తుది నిర్ణయం జరగకపోవడంతో మట్టి తరలింపునకు అన్నీ సిద్ధం చేసి అలా ఉంచారని గ్రామస్థులు అంటున్నారు.
- కృత్తివెన్ను మండలం నీలిపూడి నుంచి మునిపెడ మీదుగా సీతనపల్లి, కృత్తివెన్ను గ్రామాలకు టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న పంట భూములను ఎలాంటి అనుమతులు లేకుండా మెరకచేస్తున్నారు.
- అడ్డపర్ర, కొమాళ్లపూడి నుంచి కృత్తివెన్ను, సంగమూడి గ్రామాలకు మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు.
- లక్ష్మీపురంలోనూ మట్టిని తరలించేస్తున్నారు. చెరువులు తవ్వుతామని, దానికి ఎలాంటి నగదు చెల్లించనక్కరలేదని, మట్టిని మాత్రం తరలించుకపోయేలా ఒప్పందాలు కుదుర్చుకుని మట్టి తవ్వకాలు, మెరకపనులు ఎలాంటి అనుమతులు లేకుండా చేయడం గమనార్హం.
పామర్రు మండలం రిమ్మనపూడిలో యథేచ్ఛగా..
పామర్రు మండలం రిమ్మనపూడి గ్రామం నుంచి మట్టిని ఇటీవల కాలంలో తరలించేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా తరలించుకుపోతున్నా.. రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లోనే మట్టి తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.