‘లెక్క’ తేల్చాల్సిందే!
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:01 AM
పెనమలూరు మండలం యనమలకుదురు కేంద్రంగా షెల్టర్ ఏర్పాటు చేసుకుని తెరచిన మ్యూల్ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల లెక్కలను తేల్చడానికి సైబర్ క్రైం పోలీసులు రంగం సిద్ధం చేశారు. రవికుమార్, అతడి సోదరుడు స్టీవెన్, ప్రకాశం జిల్లాకు చెందిన బాజీ, ఇండియన్ బ్యాంక్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి దుర్గాప్రసాద్ కలిసి మొత్తం 36 మ్యూల్ ఖాతాలను తెరిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వాళ్లంతా విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ ఖాతాల నుంచి మొత్తం 116 ఖాతాలకు డబ్బులు పంపినట్టు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా ఏ ఖాతాకు ఎంతెంత మొత్తాన్ని ఎప్పుడెప్పుడు పంపారన్న నిగ్గు తేల్చడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఇందుకోసం మ్యూల్ ఖాతాలు ఉన్న బ్యాంకుల నుంచి వివరాలు తీసుకుని ‘ఈ’ ఆడిట్ చేయబోతున్నారు.
‘మ్యూల్’ కేసులో లావాదేవీల ఆడిట్
ఇతర రాషా్ట్రల్లో ఖాతాలకు డబ్బులు బదిలీ
నేటి నుంచి మూడు రోజుల కస్టడీకి నలుగురు నిందితులు
కేసు నుంచి తప్పించుకునేందుకు చెన్నై చిన్నోడి ప్రయత్నాలు
పెనమలూరు మండలం యనమలకుదురు కేంద్రంగా షెల్టర్ ఏర్పాటు చేసుకుని తెరచిన మ్యూల్ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల లెక్కలను తేల్చడానికి సైబర్ క్రైం పోలీసులు రంగం సిద్ధం చేశారు. రవికుమార్, అతడి సోదరుడు స్టీవెన్, ప్రకాశం జిల్లాకు చెందిన బాజీ, ఇండియన్ బ్యాంక్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి దుర్గాప్రసాద్ కలిసి మొత్తం 36 మ్యూల్ ఖాతాలను తెరిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వాళ్లంతా విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ ఖాతాల నుంచి మొత్తం 116 ఖాతాలకు డబ్బులు పంపినట్టు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా ఏ ఖాతాకు ఎంతెంత మొత్తాన్ని ఎప్పుడెప్పుడు పంపారన్న నిగ్గు తేల్చడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఇందుకోసం మ్యూల్ ఖాతాలు ఉన్న బ్యాంకుల నుంచి వివరాలు తీసుకుని ‘ఈ’ ఆడిట్ చేయబోతున్నారు.
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
మ్యూల్ ఖాతాల కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ తెరిపించిన ఖాతాల నుంచి చెన్నైలోని తిరువట్టువయూర్‌కు చెందిన వెంకట సుబ్రమణి ఖాతాకు డబ్బులు వెళ్లినట్టు నిర్ధారించారు. యనమలకుదురులో రవికుమార్ పోలీసులకు చిక్కడంతో సుబ్రమణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నాలుగు రోజుల క్రితం వరకు చెన్నైలో అతడి కోసం గాలించిన బృందం తిరిగి విజయవాడకు చేరుకుంది. ఈ మ్యూల్ ఖాతాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని సుబ్రమణి సైబర్ పోలీసులకు రాయబారాలు పంపుతున్నాడు. విచారణకు రావడానికి మాత్రం నిరాకరిస్తున్నాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు అతడు కుయుక్తులు ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే అతడి పాత్ర మ్యూల్‌తో ముడిపడి ఉన్నట్టు పోలీసులు గుర్తించడంతో ముందుగా ఈ లెక్కలు తేల్చాలని భావిస్తున్నారు. సుబ్రమణికి రవికుమార్ ఏయే ఖాతా నుంచి ఎంత మొత్తం పంపాడో గణాంకాలను నిర్ధారించడానికి పోలీసులు బ్యాంకులకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. బ్యాంక్ ఉద్యోగిగా ఉంటూ 11 కరెంట్, సేవింగ్ ఖాతాలను తెరిచిన దుర్గాప్రసాద్ వివరాలను ఇండియన్ బ్యాంక్ నుంచి తీసుకున్నారు.
చెన్నైతో పాటు మరికొన్ని రాషా్ట్రలకు..
రవికుమార్, స్టీవెన్, బాజీ, దుర్గాప్రసాద్ వేర్వేరుగా మ్యూల్ ఖాతాలను తెరిచారు. ఈ ఖాతాలన్నింటిని రవికుమార్ నిర్వహించేవాడు. వెంకట సుబ్రమణి ఖాతాలకే కాకుండా ఇతర రాషా్ట్రల్లోని ఖాతాలకు డబ్బులు పంపించినట్లు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. నిర్మలా కాన్వెంట్ వీధిలో ఉన్న ఇండియన్ బ్యాంకులోని 11 ఖాతాల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వేర్వేరు రాషా్ట్రల్లో ఉన్న ఖాతాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. చెన్నైలో ఉంటూ రవికుమార్ ఫోన్‌లో ఉన్న గూగుల్ షీట్‌ను సుబ్రమణి చెరిపేసినా పోలీసులు ఇక్కడి నిందితుల నుంచి కొన్ని ఖాతాలకు సంబంధించిన వివరాలను రాబట్టారు. ఇప్పుడు ఆ ఖాతాలు ఇతర రాషా్ట్రల్లో ఉన్నట్టు గుర్తించారని సమాచారం. బ్యాంకుల నుంచి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఆడిట్ చేసి మొత్తం లెక్కలు తేల్చాలని భావిస్తున్నారు.
నేటి నుంచి కస్టడీ
విజయవాడ జిల్లా జైల్లో ఉన్న నలుగురు నిందితులను కోర్టు మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. సోమవారం నుంచి బుధవారం వరకు కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. జైల్లో ఉన్న రవికుమార్, స్టీవెన్, బాజీ, దుర్గాప్రసాద్‌ను సోమవారం ఉదయం కస్టడీకి తీసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సైబర్ స్టేషన్‌లో విచారణ మొదలుపెడతారు.