Share News

అన్నదాతలకు గండి గుబులు

ABN , Publish Date - Feb 19 , 2026 | 12:39 AM

మండలంలోని భోగాపురం సమీపంలో శారదా నది వరద ఉధృతితో కోతకు గురైన తగరంపూడి గ్రోయిన్‌ వద్ద గట్టు పునరుద్ధణ పనులు ఇంతవరకు ప్రారంభం కాకపోవడంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఈ ప్రదేశాన్ని పరిశీలించి, వరద గట్టు పునరుద్ధరణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయని చెప్పి మూడున్నర నెలలు దాటినా అతీగతీలేదు.

అన్నదాతలకు గండి గుబులు
శారదా నది వరద ఉధృతికి కోతకు గురై గండి పడిన గట్టు

మూడు నెలలు దాటినా మొదలుకాని పునరుద్ధరణ పనులు

శారదా నది ఉధృతికి తగరంపూడి వద్ద గత ఏడాది కోతకు గురైన గండి

సందర్శించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి

త్వరలో గట్టు పునరుద్ధరణ పనులు చేపడతామని హామీ

ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిన అధికారులు

ఇంతవరకు మొదలుకాని పనులు

చోడవరం, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని భోగాపురం సమీపంలో శారదా నది వరద ఉధృతితో కోతకు గురైన తగరంపూడి గ్రోయిన్‌ వద్ద గట్టు పునరుద్ధణ పనులు ఇంతవరకు ప్రారంభం కాకపోవడంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఈ ప్రదేశాన్ని పరిశీలించి, వరద గట్టు పునరుద్ధరణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయని చెప్పి మూడున్నర నెలలు దాటినా అతీగతీలేదు.

మండలంలోని భోగాపురం వద్ద పెద్దేరు నది శారదా నదిలో కలుస్తుంది. దీంతో ఇక్కడ వర్షాకాలంలో వరద ఉధృతి అధికంగా వుంటుంది. కాగా గత ఏడాది అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు పెద్దేరు, శారదా నదులు ఉగ్రరూపం దాల్చాయి. భారీ మొత్తంలో వరద రావడంతో భోగాపురం సమీపంలో తగరంపూడి గ్రోయిన్‌ ధ్వంసమైంది. దీనిని ఆనుకొని వున్న గట్టు కోతకు గురై భారీ గండి పడింది. రహదారిగా వినియోగించే గట్టు కోతకు గురవడంంతో భోగాపురం, పీఎస్‌పేట, చాకిపల్లి, రామజోగిపాలెం గ్రామాల రైతులు తమ పంటపొలాలకు వెళ్లేందుకు రహదారి లేకుండా పోయింది. కొద్ది రోజుల తరువాత జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర ఇక్కడకు వచ్చి పరిశీలించారు. వరద గట్టు పునరుద్ధరణ పనులు త్వరలో చేపడతామని రైతులకు భరోసా ఇచ్చారు. అంతరం ఇరిగేషన్‌ అధికారులు వచ్చి శాశ్వత పనులకు, తాత్కాలిక పనులకు వేర్వేరుగా ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించారు. ఇది జరిగి మూడు నెలలు దాటినప్పటికీ ఇంతవరకు వరద గట్టు పునరుద్ధరణ పనులు మొదలు కాలేదు. మరో నాలుగు నెలల్లో వర్షాకాలం వస్తుంది. వెంటనే పనులు మొదలుపెట్టి, వేసవిలోగా పూర్తిచేయకపోతే వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో వరద నీరు తమ పొలాలను ముంచెత్తుతుందని రైతులు వాపోతున్నారు.

Updated Date - Feb 19 , 2026 | 12:40 AM