Share News

అవినీతిలో ‘శాంతి’ స్వరూపం!

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:27 AM

కాళింగిరి శాంతి.. వైసీపీ హయాంలో ఎన్టీఆర్‌ జిల్లాలో దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేసిన అధికారిణి. ఆమె పనిచేసిన ప్రతిచోట ఏదో ఒక వివాదం రాజుకుంటుంది. లేకపోతే రాజుకునేలా అగ్గిని రాజేస్తుంది. ఇది శాంతి స్టైల్‌. దేవదాయ శాఖ ఖజానాకు కళ్ల ముందే కన్నం పడుతున్నా తానేమీ చూడనట్టు వ్యవహరించారు. మరికొద్ది రోజుల్లో పోస్టింగ్‌ దక్కించుకుని సీట్లో కూర్చోవాల్సిన ఆమెను ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. నాడు శాంతి జిల్లాలో వెలగబెట్టి ఘనకార్యాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

అవినీతిలో ‘శాంతి’ స్వరూపం!

ఎన్టీఆర్‌ జిల్లాలో ఏసీగా పనిచేసిన కాళింగిరి శాంతి

దేవదాయ శాఖ ఆదాయానికి భారీగా గండి

వాణిజ్య సముదాయాల్లో అనధికార నిర్మాణాలకు ప్రోత్సాహం

అక్రమార్కులు కోర్టులను ఆశ్రయించేలా వెసులుబాటు కల్పించిన అధికారి

కాళింగిరి శాంతి.. వైసీపీ హయాంలో ఎన్టీఆర్‌ జిల్లాలో దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేసిన అధికారిణి. ఆమె పనిచేసిన ప్రతిచోట ఏదో ఒక వివాదం రాజుకుంటుంది. లేకపోతే రాజుకునేలా అగ్గిని రాజేస్తుంది. ఇది శాంతి స్టైల్‌. దేవదాయ శాఖ ఖజానాకు కళ్ల ముందే కన్నం పడుతున్నా తానేమీ చూడనట్టు వ్యవహరించారు. మరికొద్ది రోజుల్లో పోస్టింగ్‌ దక్కించుకుని సీట్లో కూర్చోవాల్సిన ఆమెను ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. నాడు శాంతి జిల్లాలో వెలగబెట్టి ఘనకార్యాలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

శాంతి ఎన్టీఆర్‌ జిల్లా సహాయ కమిషనర్‌గా పనిచేసినప్పుడు ఆ శాఖ ఆదాయానికి భారీగా గండికొట్టారు. వైసీపీ పాలనలో ఆమె విశాఖపట్నంలోని శ్రీకనకమహాలక్ష్మి దేవస్థానం నుంచి ఎన్టీఆర్‌ జిల్లాకు బదిలీపై వచ్చారు. విజయవాడలో పలు ప్రముఖ దేవాలయాలకు గవర్నరుపేట తదితర ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. వాటికి టెండర్లను పిలిచి షాపులు కేటాయించేవారు. టెండర్ల ద్వారా షాపులు దక్కించుకున్న వారు నెలల తరబడి అద్దెలు చెల్లించడం లేదని ఈవోలు ఆమె దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదు. వారు పంపిన ఫైళ్లను కార్యాలయంలో పక్కన పెట్టారు. కొంతమంది ఒక షాపును అద్దెకు తీసుకుని దానిపై అనధికారికంగా నిర్మాణాలు చేపట్టినా వారిపైనా చర్యలు తీసుకోవడానికి చేతులు రాలేదు. అనధికార నిర్మాణాలను కూల్చివేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినా చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేశారు. పైగా అక్రమార్కులు న్యాయస్థానాలను ఆశ్రయించి ఉపశమనం పొందే విధంగా అవకాశాలను ఇచ్చారు. ఈ విధంగా ఎన్టీఆర్‌ జిల్లాలోని దేవదాయ శాఖకు లక్షలాది రూపాయల నష్టం చేకూర్చారు.

పోస్టింగ్‌ వచ్చే సమయంలో....

శాంతి 2020లో ఏపీపీఎస్సీ ద్వారా దేవదాయ శాఖలో ఉద్యోగం సంపాదించారు. ఆమెపై వచ్చిన అభియోగాలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేయించింది. ఈ అభియోగాలన్నీ వాస్తవమని తేలడంతో అధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. శాంతి హైకోర్టును ఆశ్రయించడంతో ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం ఈ ఉత్తర్వలతో శాంతి దేవదాయ శాఖ ఉన్నతాధికారులను కలిశారు. పోస్టింగ్‌ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిన అధికారులు విధుల్లో చేరిన తర్వాత జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించారు. ఇది ఆమెకు ఆగ్రహాన్ని కలిగించింది. తనను ఎవరూ ఏమీ చేయలేరన్న డైలాగ్‌ను ఉపయోగించినట్టు దేవదాయవర్గాల ద్వారా తెలిసింది. త్వరలో పోస్టింగ్‌ వస్తుందన్న సంతోషంలో ఆమె నందిగామ మండలంలోని అంబారుపేట సత్యమ్మ ఆలయంలో మేకపోతును బలి ఇచ్చి మొక్కలు తీర్చుకున్నారు. ఇది జరిగిన రెండు రోజులకు ఆమె ఏసీబీకి చిక్కడం గమనార్హం.

కుమారుడితో కోర్టుకు

ఏసీబీ అధికారులు శాంతి ఇంట్లో సోదాలు ముగిసిన తర్వాత అరెస్టు చేసి విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. ఆమె తన వెంట చిన్న కుమారుడిని తీసుకుని కోర్టుకు వచ్చారు. కోర్టు సమయం ముగిసిపోవడంతో న్యాయాధికారి ఇంటికి వెళ్లిపోయారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమెను న్యాయాధికారి ఇంటి వద్ద హాజరుపరచడానికి తీసుకెళ్లారు. విశాఖకు చెందిన ఆమె ప్రాణ స్నేహితురాలు, వైసీపీ నాయకురాలు శాంతి వెంట వచ్చారు.

Updated Date - Apr 08 , 2026 | 12:27 AM