ఉత్తరాది వలపు వల!
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:09 AM
నగరంలో బంగారం వ్యాపారం చేసే ఉత్తరాది వ్యాపారులే లక్ష్యంగా పలువురు మహిళలు వలపు వల విసురుతున్నారు. హనీ ట్రాప్‌లో పడ్డాక వారిని ఏకాంత ప్రదేశాలకు తీసుకెళ్తున్నారు. అక్కడ రహస్యంగా వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ముఠాగా ఏర్పడిన ఉత్తరాది మహిళలు లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. నగదు ఇవ్వని వారిపై పోలీస్ కేసులు పెట్టి వేధిస్తున్నారు. వీరి దెబ్బకు పలువురు వ్యాపారులు నగరం వదిలేసి వెళ్లిపోయినట్టు సమాచారం.
- నగరంలో హనీ ట్రాప్ కలకలం!
- వన్‌టౌన్, గవర్నర్‌పేటలోని బంగారం వ్యాపారులే వీరి టార్గెట్
- తొలుత పరిచయం.. ఆ తర్వాత ఏకాంత ప్రదేశాలకు..
- రహస్యంగా వీడియో చిత్రీకరణ.. బ్లాక్ మెయిల్
- రూ.లక్షలు గుంజుతున్న ఉత్తరాది మహిళల ముఠా
- విజయవాడ వదిలి వెళ్లిపోయిన పలువురు బాధిత వ్యాపారులు
- పోలీసులకు తలపోటుగా హనీ ట్రాప్ కేసులు
నగరంలో బంగారం వ్యాపారం చేసే ఉత్తరాది వ్యాపారులే లక్ష్యంగా పలువురు మహిళలు వలపు వల విసురుతున్నారు. హనీ ట్రాప్‌లో పడ్డాక వారిని ఏకాంత ప్రదేశాలకు తీసుకెళ్తున్నారు. అక్కడ రహస్యంగా వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ముఠాగా ఏర్పడిన ఉత్తరాది మహిళలు లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. నగదు ఇవ్వని వారిపై పోలీస్ కేసులు పెట్టి వేధిస్తున్నారు. వీరి దెబ్బకు పలువురు వ్యాపారులు నగరం వదిలేసి వెళ్లిపోయినట్టు సమాచారం.
విజయవాడ అర్బన్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాదికి చెందిన పలువురు మహిళలు విజయవాడలో ముఠాగా ఏర్పడి ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన వ్యాపారస్తులను హనీ ట్రాప్ చేస్తున్నారు. వ్యాపారస్తుల సెల్ నెంబర్లు తీసుకుని తరచూ ప్రేమ ఒలకబోస్తూ వాట్సాప్‌లో చాటింగ్ చేస్తున్నారు. వ్యాపారస్తులు ఇక ముగ్గులోకి దిగారన్న తర్వాత మహిళల ముఠా సభ్యులు వారిని రహస్య ప్రాంతాలకు తీసుకువెళ్లి, ఏకాంతంగా ఉన్నప్పుడు ముందుగానే ప్లాన్ ప్రకారం వ్యాపారస్తులతో కలిసి ఉన్న సన్నివేశాలను వీడియో చిత్రీకరిస్తున్నారు. అలా రెండు, మూడు సార్లు ఏకాంతంగా ఉన్నప్పుడు చిత్రీకరించిన వీడియోలు, ఫొటోలను వ్యాపారస్తులకు పంపి రూ.లక్షల్లో డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్నారు. కొందరు వ్యాపారులు తమ పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతో ఆ మహిళలతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని రూ.లక్షల్లో డబ్బులు ముట్ట చెబుతున్నారు. మరికొందరు డబ్బులు ఇవ్వలేకపోవటంతో మహిళలు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇలా హనీ ట్రాప్‌కు గురైన కొందరు వ్యాపారస్తులు ఈ మహిళలకు భయపడి విజయవాడ నగరం విడిచిపోగా, మరికొందరు ప్రాణాంతక వ్యాధితో మృతి చెందినట్లు వన్‌టౌన్‌లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఏడుగురిపై పోలీస్ స్టేషన్లలో కేసులు
హనీ ట్రాప్‌లో పడిన ఏడుగురు వ్యాపారస్తులు మహిళలకు వారి అడిగినంత డబ్బులు ఇవ్వకపోవటంతో నగరంలోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
- ఓ ప్రముఖ వ్యాపారిని మొదట రూ.10 లక్షలు డిమాండ్ చేయగా, ఆ వ్యాపారి తనకు తెలిసిన స్నేహితుల దగ్గరకు వెళ్లి పంచాయితీ పెట్టటంతో తన పరువు తీశాడనే కోపంతో రూ.50లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఆఖరికి ఆ వ్యాపారి ఆమెకు రూ.40 లక్షలు ఇచ్చి విజయవాడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్టు సమాచారం.
- మరో వ్యాపారి మహిళకు రూ. 6 లక్షలు సమర్పించుకుని పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లిపోయినట్లు తెలిసింది.
- గత కొన్ని రోజుల క్రితం వన్‌టౌన్‌కు చెందిన ఓ వ్యాపారి మహిళతో ఏకాంతంగా ఉన్న ఫొటోలను ఆ మహిళ బయటపెడతానని బెదిరించింది. దీంతో ఆ వ్యాపారి ఆమెను అనేక సార్లు బతిమిలాడగా, తొలుత రూ.40 వేలు డిమాండ్ చేసింది. అతని దగ్గర ఆ సమయంలో అంత డబ్బులు లేకపోవటంతో తన వద్ద ఉన్న బంగారు గొలుసును ఆమెకు ఇచ్చి, డబ్బులు ఇచ్చిన తర్వాత చైన్ తీసుకుంటానని చెప్పాడు. ఆ వ్యాపారి ఆమె వద్ద నుంచి బయటకు వచ్చి స్నేహితులకు చెప్పుకోగా, వారు బంగారు గొలుసు ఆమెకు ఎందుకు ఇచ్చావని, మహిళకు ఇచ్చిన గొలుసు తిరిగి తీసుకోమని చెప్పారు. దీంతో అతను ఆమె వద్దకు వెళ్లి గొలుసు ఇవ్వమని అడగ్గా ఆమె అడ్డం తిరిగి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాను ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు వ్యాపారి ప్రవేశించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఆమె గురించి ముందుగానే తెలుసుకున్న పోలీసులు బయటకు వెళ్లి సెటిల్ చేసుకోమంటూ ఇరువురికి చెప్పినట్టు సమాచారం. దీంతో వారు చర్చించుకుని చివరికి రూ.1.50లక్షలు మహిళకు చెల్లించినట్లు తెలిసింది.
- గవర్నరుపేటలో కూడా కొందరు ఉత్తరాది వ్యాపారస్తులు హనీట్రాప్‌లో పడి రూ.లక్షలు పోగొట్టుకున్నారని పలువురు ఉత్తరాది వ్యాపారస్తులు చెబుతున్నారు. మొత్తం 30 మంది మహిళలు ముఠాలుగా ఏర్పడి ఉత్తరాది వ్యాపారస్తులనే టార్గెట్ చేస్తున్నారని వన్‌టౌన్‌లోని పలువురు ఉత్తరాది వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు.