‘విజ్ఞాన’ వేదన!
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:45 AM
జ్ఞానాన్ని పంచే గ్రంథాలయాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. స్థానిక సంస్థలు వసూలు చేసే పన్నుల్లో నుంచి ఇవ్వాల్సిన గ్రంథాలయ సెస్ బకాయిలు రూ.50 కోట్లపైనే పేరుకుపోవడంతో విజ్ఞాన బాంఢాగారాల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు, ఉద్యోగ విరమణ చేసిన వారికి పింఛన్లు అందక రెండు నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను కూడా నిరుద్యోగులకు అందించలేని దైన్యస్థితికి నేడు గ్రంథాలయాలు చేరాయి.
- ఆర్థిక సంక్షోభంలో గ్రంఽథాలయాలు
- ఉమ్మడి కృష్ణాజిల్లాలో రూ.50 కోట్ల బకాయిలు
- స్థానిక సంస్థల నుంచి జమకాని నగదు
- రెండు నెలలుగా ఉద్యోగులకు జీతాలు నిల్
- పింఛన్లు అందక విశ్రాంత ఉద్యోగుల అవస్థలు
- నెలకు జీతభత్యాలకు రూ.1.50 కోట్లు అవసరం
- జిల్లా అధికారులు వెంటనే స్పందించాలని వేడుకోలు
జ్ఞానాన్ని పంచే గ్రంథాలయాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. స్థానిక సంస్థలు వసూలు చేసే పన్నుల్లో నుంచి ఇవ్వాల్సిన గ్రంథాలయ సెస్ బకాయిలు రూ.50 కోట్లపైనే పేరుకుపోవడంతో విజ్ఞాన బాంఢాగారాల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు, ఉద్యోగ విరమణ చేసిన వారికి పింఛన్లు అందక రెండు నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను కూడా నిరుద్యోగులకు అందించలేని దైన్యస్థితికి నేడు గ్రంథాలయాలు చేరాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లాలోని మునిసిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల ద్వారా పన్నులు వసూలు చేసే సమయంలోనే ఎనిమిది శాతం నగదును గ్రంథాలయాల సెస్ రూపంలో తీసుకుంటారు. అలా వసూలు చేసిన నగదును స్థానిక సంస్థలు గ్రంథాలయాలకు చెల్లించాల్సి ఉంది. కానీ నగదును పెండింగ్‌లో పెట్టడంతో గ్రంథాలయాలు ఆర్థికపరంగా చిక్కుల్లో పడిపోయాయి. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికైనా గ్రంథాలయాలకు సెస్ రూపంలో వసూలు చేసిన నగదును విడుదల చేయాలని గ్రంఽథాలయసంస్థ అధికారులు కోరుతున్నారు.
రెండు నెలలుగా జీతాలు, పెన్షన్లు బంద్
ఉమ్మడి కృష్ణాజిల్లాలో జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు, ప్రథమశ్రేణి గ్రంథాలయాలు ఏడు, ద్వితీయ శేణి గ్రంథాలయాలు 18, తృతీయ శ్రేణి గ్రంథాలయాలు 83 కలిపి మొత్తంగా 109 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో రెగ్యులర్ ఉద్యోగులు 79 మంది, అవుట్ సోర్సింగ్ పద్ధతిపై పనిచేసే ఉద్యోగులు 64 మంది ఉన్నారు. వీరితో పాటు గ్రంఽథాలయ సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొంది పెన్షన్ పొందేవారు మరో వంద మందికిపైగా ఉన్నారు. వీరికి రెండు నెలలుగా, జీతాలు, పెన్షన్ నిలిచిపోయింది. ఇప్పటికే రెండు నెలలుగా జీతాలు పెండింగ్‌లో పెట్టగా, మార్చి నెలకు సంబంధించిన జీతాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి గ్రంథాలయాలకు రావాల్సిన నగదును విడుదల చేస్తేనే ఏప్రిల్ నెలలో జీతాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ ఆధికారులు చెబుతున్నారు.
రూ.50 కోట్లకుపైగా బకాయిలు
మచిలీపట్నం, విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్‌లతో పాటు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల్లో వసూలు చేసే పన్నులతో కలిపే గ్రంఽథాలయాల సెస్‌ను వసూలు చేస్తారు. ఇలా వసూలు చేసిన నగదును ఎప్పటికపుడు గ్రంథాలయ సంస్థకు జమ చేయాల్సి ఉంది. కానీ ఇవేమీ సకాలంలో చెల్లించడంలేదు. దీంతో గ్రంఽథాలయాల సంస్థ ఖజానా ఖాళీ అయ్యింది. 2025 జనవరి నుంచి డిసెంబరు వరకు ఉమ్మడి కృష్ణాజిల్లాలోని స్థానిక సంస్థల నుంచి రూ.4.48 కోట్లు మాత్రమే గ్రంథాలయ సంస్థకు చెల్లించారు. మరో రూ.50 కోట్లు పెండింగ్‌లోనే ఉంచారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రూ.30 కోట్లు, గుడివాడ పురపాలక సంఘం నుంచి రూ.2కోట్లు, మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ నుంచి రూ.60 లక్షలు, మిగిలిన నగదు గ్రామ పంచాయతీల నుంచి చెల్లింపులు చేయాల్సి ఉందని గ్రంఽథాలయసంస్థ అధికారులు చెబుతున్నారు.
నిధుల కొరతతో ఇక్కట్లు
గ్రంఽథాలయ సంస్థకు రూ.50 కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోవడంతో అన్ని గ్రంఽథాలయాల్లో కనీస పారిశుధ్య చర్యలు చేపట్టేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి నెలకొంది. విద్యుత బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. స్వీపర్లకు కూడా జీతాలు చెల్లించలేకపోతున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల డిమాండ్‌ను బట్టి మార్కెట్‌లోకి నూతనంగా వచ్చే పుస్తకాలను కొనుగోలు చేసి గ్రంఽథాలయాల్లో అందుబాటులో ఉంచాలి. నిధుల లేమి కారణంగా నూతన పుస్తకాల కొనుగోలును నిలిపివేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రామవరప్పాడు, పటమటలంక, ఎ-కొండూరు, బంటుమిల్లి, బాపులపాడు, మానికొండ, మండవలి,్ల హెచ్‌బీకాలనీ, కొండపల్లిలో శాఖా గ్రంఽథాలయాల భవనాల నిర్మాణాల కోసం భూమిని సేకరించాల్సి ఉంది. పెనమలూరు, వణుకూరులో గ్రంథాలయ భవనాల నిర్మాణం కోసం భూమిని కేటాయిస్తూ పంచాయతీలు తీర్మానం చేసి ఇచ్చినా ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడంతో ఈ భవనాల నిర్మాణం ప్రారంభించనే లేదు. జిల్లా అధికారులు స్పందించి గ్రంథాలయాలకు రావాల్సిన బకాయిలను వెంటనే జమ చేయించి, పెండింగ్‌లో ఉన్న జీతాలు, పెన్షన్ ఇప్పించాలని గ్రంధాలయసంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు కోరుతున్నారు.