నకిలీ మద్యం కేసులో మరో ముగ్గురికి బెయిల్
ABN , Publish Date - Feb 05 , 2026 | 06:18 AM
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె కోర్టు బుధవారం మరో ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది.
జైలు నుంచి అద్దేపల్లి సోదరుల విడుదల.. నేడు మరికొందరు
రోణక్, అనిల్‌చోక్రా పిటిషన్లు కొట్టివేత
ములకలచెరువు/విజయవాడ, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె కోర్టు బుధవారం మరో ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. నకిలీ మద్యం తయారీ కేంద్రానికి ఇన్‌చార్జిగా వ్యవహరించిన కట్టా రాజు(ఏ2)తో పాటు బాలరాజు(ఏ4), పెద్దతిప్పసముద్రం మండలం కమ్మవారిపల్లెకు చెందిన కట్టా సురేంద్రనాయుడు(ఏ13)లకు తాజాగా బెయిల్ లభించింది. ఇదివరకే బెయిల్ మంజూరైన అద్దేపల్లి జనార్దనరావు, జగన్‌మోహన్‌రావు కోర్టుకు ష్యూరిటీలు సమర్పించి బుధవారం రాత్రి మదనపల్లె సబ్‌జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న జినేష్, షిబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తీర్పును విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి లెనిన్‌బాబు తీర్పును 11వ తేదీకి రిజర్వ్ చేశారు. కాగా, మద్యం కుంభకోణం కేసులో ముంబైకి చెందిన అనిల్‌చోక్రా, రోణక్‌కుమార్ వేసిన బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది.