Share News

బీమా డబ్బులతో ‘తల్లికి వందనం’..?

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:39 PM

రైతుల ఇన్సూరెన్స్‌ డబ్బులతోనే ‘తల్లికి వందనం’ డబ్బులు వేయనున్నారా అని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ప్రశ్నించారు.

బీమా డబ్బులతో ‘తల్లికి వందనం’..?
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి

ఆలూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రైతుల ఇన్సూరెన్స్‌ డబ్బులతోనే ‘తల్లికి వందనం’ డబ్బులు వేయనున్నారా అని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు రైతులంటే అసహ్యమని, అందుకే వర్షాలు పడక రైతులు ఇబ్బందులు పడుతుంటే పంట నష్టం పత్తికి ఎకరాకు రూ.2 వేలు కట్టించుకోవడం బాధాకరమన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు కష్టం రాకుండా పంటలకు ఇన్సూరెన్స్‌ మొత్తం చెల్లించి పరిహారం అందించిందన్నారు. రైతుల ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభు త్వం రైతులకు ఎలాంటి న్యాయం చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబు పాలనలో రైతులకు అతివృష్టి అయినా, అనావృష్టి అయినా కష్టాలే తప్పా ప్రభుత్వ అండ కనిపించడం లేదన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయినా ఈ కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. టీడీపీ నాయకులే రైతులకు పంటకు ఇన్సూరెన్స్‌ కట్టుకోండి అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్‌కల్యాణ్‌కు సినిమాల గురించి తప్పా రైతుల సమస్యలపై ఎలాంటి అవగాహన లేదన్నారు. రైతులకు అండగా నిలిచే పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ మాత్రమేనన్నారు. సమావేశంలో వైసీపీ నాయకులు మల్లికార్జున, రామాంజినేయులు, వెంకటేష్‌, భాస్కర్‌, వీరభద్రరెడ్డి, వరుణ్‌, జాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 11:39 PM