తల్లుల సంబరం
ABN , Publish Date - Jul 23 , 2026 | 05:09 AM
‘తల్లికి వందనం’ నగదు పంపిణీ రాష్ట్రమంతా మొదలైంది. డబ్బులు జమ అయినట్టు బుధవారం ఫోన్లకు వచ్చిన మెసేజ్‌లను చూసుకుని తల్లులు సంబరపడిపోయారు.
‘తల్లికి వందనం’ సొమ్ము ఖాతాల్లో జమ
కుటుంబాల్లో పండగ వాతావరణం
బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద సందడే సందడి
ఆరుగురు పిల్లలున్న తల్లులకూ పూర్తి నగదు
13 వేలు చొప్పున రూ.78 వేలు చేతికి..
రెండో ఏడాదీ మాట నిలుపుకొన్న కూటమి
రేపటి వరకు కొనసాగనున్న పంపిణీ
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం పాపిరెడ్డికుంటతండాకు చెందిన కాత్లావత్ స్వామినాయక్ కుటుంబంలో ఐదుగురికి బుధవారం తల్లికి వందనం నగదు జమైంది. స్వామినాయక్‌కు ఏడుగురు సంతానం. గతేడాది ఇదే కుటుంబంలో ఆరుగురికి తల్లికి వందనం నగదు జమ కాగా ప్రస్తుతం ఐదుగురికి నగదు జమైంది. పెద్ద కుమార్తె రూపాబాయి పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరింది. అలాగే చిన్న కుమారుణ్ని ఈ ఏడాదే పాఠశాలలో చేర్పించారు. వీరిద్దరికీ మలి విడతలో ‘తల్లికి వందనం’ సొమ్ము జమ కానుంది. తాను వైసీపీ హయాంలో వలంటీరుగా పనిచేశానని, గత ఎన్నికల్లో ఆ పార్టీకే ఓటు వేశామని స్వామినాయక్ చెప్పడం గమనార్హం!
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
‘తల్లికి వందనం’ నగదు పంపిణీ రాష్ట్రమంతా మొదలైంది. డబ్బులు జమ అయినట్టు బుధవారం ఫోన్లకు వచ్చిన మెసేజ్‌లను చూసుకుని తల్లులు సంబరపడిపోయారు. తమ ఖాతాలు ఉన్న బ్యాంకులు, పోస్టాఫీసుల వద్దకు వారంతా ఒకేసారి చేరుకుని, సంతోషాలను పరస్పరం పంచుకుంటూ సందడి చేశారు. ఐదారుగురు పిల్లలు ఉన్న తల్లులకు సైతం పూర్తి నగదు జమ కావడంతో...వారి కుటుంబాల్లోకి పండగ వాతావరణం ప్రవేశించింది. ఒక బిడ్డ ఉన్న తల్లికి రూ.13 వేలు పడితే, చదువుకుంటున్న ఐదుగురు పిల్లలు ఉన్న ఇంట్లో రూ.65 వేలు జమ అయ్యాయి. కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ ‘తల్లికి వందనం’ అందిస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా నిలబెట్టుకుంది. ఉదయం నుంచే నగదు విడుదల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఈ నెల 24 నాటికి తల్లులందరికీ పథకం నగదు అందుతుంది.
అదే రోజున మెగా పేరెంట్- టీచర్స్ సమావేశాలు జరగనున్నాయి. గతేడాది తరహాలోనే కర్నూలు జిల్లాలో పలువురికి ఐదుగురు పిల్లలకు పథకం నగదు అందింది. అంటే ఒకేసారి రూ.65వేల నగదు చేతికి వచ్చింది. నలుగురు పిల్లలున్నవారికి రూ.52వేలు వస్తున్నాయి. ఎక్కువ మంది తల్లులకు ఇద్దరు పిల్లలుండటంతో రూ.26వేలు అందుతోంది.
ఆ కుటుంబంలో ఆరుగురికీ... రూ.78 వేలు
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన హరిజన కుళ్ల ఏలియా, సంగీత దంపతులకు ఆరుగురు సంతానం. వీరికి తల్లికి వందనం నిధులు రూ.13వేల చొప్పున రూ.78వేలు బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. స్థానిక జడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ప్రశాంతి, 8వతరగతి చదువుతున్న పెర్సీ,7వ తరగతి చదువుతున్న షాలిని, స్థానిక ప్రాథమిక పాఠశాలలో (స్పెషల్) 5వ తర గతి చదువున్న మహిమజ్యోతి, 4వ తరగతి చదువుతున్న ప్రత్యక్ష, 2వ తరగతి చదువుతున్న సందీప్ కుమార్‌లకు పథకం నిధులు అందాయి.
ఐదుగురికి ‘వందనం’
కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో పింజరి చాంద్‌బాషా, షకీనాబీ దంపతులకు ఆరుగురు కుమార్తెలు సంతానం. గతేడాది ఆరుగురు కుమార్తెలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారు. అయితే ఈ ఏడాది పెద్ద కుమార్తె రేష్మా పదో తరగతి ఉత్తీర్హురాలయినా ఇంటర్‌లో చేరలేదు. దీంతో మిగిలిన కుమార్తెలు షైనాజ్, సాహెరా, అమీషా, ఆసిఫా, సుబాన్‌లకు ఈ ఏడాది రూ.13 వేలు చొప్పున రూ.65 వేలు తల్లి షకీనాబీ ఖాతాలో జమ అయింది.
పెనుకొండలో...
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని ఆల్విన్ కాలనీకి చెందిన షేక్ బాషా, రజియాభాను దంపతులకు ఎనిమిది మంది సంతానం. వీరు రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకుని జీవిస్తున్నారు. వీరి కుటుంబంలో ఐదుగురికి తల్లికి వందనం సొమ్ము అందింది. రజియా బ్యాంకు ఖాతాలో రూ.65 వేలు జమ అయింది.
గుడిబండలో..
శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం మందలపల్లి గ్రామానికి చెందిన తిప్పమ్మ, కాంతరాజు దంపతులకు ఐదుగురు సంతానం. వీరందరికీ తల్లికి వందనం లబ్ధి చేకూరింది. తిప్పమ్మ ఖాతాలో రూ.65 వేలు జమ అయింది. వీరు మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్నారు.
వరికుంటపాడులో..
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం వేంపా డు పంచాయతీ వెంగమాంబపురానికి చెందిన మెడబలిమి బాలమ్మ, వెంకట చలపతిలకు ఐదుగురు పిల్లలు. వీరిలో వెంకటేశ్వరి, అంజలి ఇంటర్ చదువుతున్నారు. అక్షిత 9వ తరగతి, వేద్యాయిని 7, హరిసాయి 3వ తరగతి చదువుతున్నారు. వీరందరికీ కలిపి రూ.65వేలు బాలమ్మ బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది.
పెదవేగిలో..
ఏలూరు జిల్లా పెదవేగి మండలం అంకన్నగూడేని కి చెందిన మెడ ఏసమ్మ, జోజిలకు ఐదుగురు సంతా నం. గౌరి, లావణ్య (10వ తరగతి), సుమంత్ (7), నాగవల్లి (6), కుమార్ (5వ తరగతి)లకు రూ.13వేలు చొప్పున రూ.65 వేలు తల్లి ఖాతాలో జమైంది.
అన్నమయ్య జిల్లాలో..
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్లకు చెందిన సయ్యద్ షర్మిలకు ఐదుగురు సంతానం. వీరిలో సమీ ర్, సబీహా ఇద్దరూ ఇంట ర్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. జుబేర్ 8, జరీఫ్ 6, మషిహ 1వ తరగతి చదువుతున్నారు. వీరందరికీ తల్లికి వందనం పథకం కింద రూ.65వేలు షర్మిల బ్యాంకు అకౌంటులో జమయింది.
విశాఖలో..
విశాఖలోని ఎల్‌వి నగర్‌కు చెందిన బొబ్బిలి రమేశ్ కారు డ్రైవర్, ఆయన భార్య సౌజన్య ప్రైవే టు పాఠశాలలో ఉపాధ్యాయురాలు. వారికి ఐదుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తెనేహా ఇంటర్, స్నేహశ్రీ 9, నోషిక, నోమిత, నోవిక (కవలలు) నాలుగో చదువుతున్నారు. వారికి రూ. 65 వేలు జమ అయ్యాయి.
‘అక్షరం అండగా’ ఐదుగురికీ
ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటూ, చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ సోఫాలు, ఇతర వస్తువులు బాగుచేసే సితారి అంజయ్య, వరలక్ష్మి దంపతులకు ఐదుగురు సంతానం. వీరికి 65వేలు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. గతేడాది హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో వేరే కుటుంబం యాడ్ అయి ఉండటంతో తల్లికి వందనం డబ్బులు ఈ కుటుంబానికి జమకాలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 9న అద్దంకిలోని 3, 4వార్డులలో ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు అంజయ్య సమస్యను వివరించారు. ఆయన అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి... వారి సమస్యను పరిష్కరించారు.
ఆ తల్లికి మంత్రి అభినందన..
కృష్ణా జిల్లా మచిలీపట్నం రాజుపేటకు చెందిన షబానాబేగం, అబ్దుల్ కరీం దంపతులకు ఐదుగురు సంతానం. వీరు నగరంలోని వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్నారు. షబానాబేగం బ్యాంకు ఖాతాలో బుధవారం నగదు రూ.65 వేలు జమ అయ్యాయి. తల్లి షబానాను మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ కార్యాలయం వద్ద అభినందించారు. పేదరికంలో ఉన్న విద్యార్థులకు ‘తల్లికి వందనం’ బాసటగా నిలుస్తుందన్నారు.
రాజస్థానీ కుటుంబంలో సంబరం
ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెదపాడుకు చెందిన ప్రజాపతి శాంతిలాల్ రాజస్థాన్ నుంచి వలస వచ్చి ఇక్కడ మిఠాయి వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆ ఇంట్లో ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె పింకూ కుమారి చదువు ఆపేయగా మిగిలిన ఐదుగురుకీ తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. వారి కుమారుడు కిరణ్ గతేడాది 10లో 573 మార్కులు సాధించి షైనింగ్ స్టార్ అవార్డుతో పాటుగా రూ.25 వేలు నగదు బహుమతిని పొందడం విశేషం.