Share News

టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:08 AM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష-2026 (టెట్‌) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. సాధారణ అభ్యర్థులతో పాటు ఇన్‌సర్వీస్‌ టీచర్లకూ టెట్‌ రాసే అవకాశం కల్పించింది.

టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

  • మొదలైన దరఖాస్తుల స్వీకరణ.. ఆగస్టు 8 నుంచి 21 వరకు పరీక్షలు

  • 150 మార్కులకు సీబీటీ విధానంలో నిర్వహణ

అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష-2026 (టెట్‌) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. సాధారణ అభ్యర్థులతో పాటు ఇన్‌సర్వీస్‌ టీచర్లకూ టెట్‌ రాసే అవకాశం కల్పించింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో బోధించే టీచర్లు కూడా టెట్‌ అర్హత సాధించాలని, ఒకవేళ ప్రైవేటు టీచర్ల నియామకాలను ధృవీకరించకపోయినా వారికి టెట్‌ నుంచి ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది. అలాగే గతంలో వచ్చిన టెట్‌ మార్కులు మెరుగుపరచుకోవాలనుకునే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. టెట్‌ పరీక్షలను పూర్తిగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. 1 నుంచి 5 తరగతులకు 1ఏ, 1 నుంచి 5 తరగతుల స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు 1బీ, 6 నుంచి 8 తరగతులకు 2ఏ, 6 నుంచి 8 తరగతుల స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు 2బీ పేపర్లు ఉంటాయి. వాటిలో సంబంధిత సబ్జెక్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. డీఈడీ, బీఈడీ రెండు అర్హతలు కలిగిన వారు అన్ని పేపర్లకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న వారూ టెట్‌ రాయొచ్చు. శుక్రవారం నుంచే టెట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జూలై 5 వరకు http://cse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి పేపరుకు రూ.వెయ్యి చొప్పున ఫీజు చెల్లించాలి. జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ బేసిస్‌ (మొదటి ఎంపిక చేసుకునే) విధానంలో సెంటర్ల కేటాయింపు జరుగుతుంది. టెట్‌కు దరఖాస్తు చేసుకునే సమయానికి సంబంధిత సబ్జెక్టుల్లో అర్హతలు కలిగి ఉండాలి. ఉపాధ్యాయ విద్య ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులు కూడా టెట్‌కు రాయొచ్చు. 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 90 మార్కులు (60శాతం), బీసీ అభ్యర్థులు 75 మార్కులు (50శాతం), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌ అభ్యర్థులు 60 మార్కులు (40శాతం) సాధిస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. డీఎస్సీల్లో టెట్‌ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంటుంది. ఆగస్టు 8 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

Updated Date - Jun 06 , 2026 | 05:08 AM