Share News

ఆ ‘సోషల్‌’ ఐడీలు ఎవరివి?

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:40 AM

బెనెక్స్‌ కామ్‌ గ్రూపు ద్వారా ఉగ్రవాద ప్రచారం చేస్తున్న సానుభూతిపరుల సోషల్‌ మీడియా ఐడీలకు అనేక ఐడీలు అనుసంధానమై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆ ‘సోషల్‌’ ఐడీలు ఎవరివి?

  • ఉగ్ర సానుభూతిపరులకు పోలీసుల ప్రశ్నలు

  • ఒక్కొక్కరి ఇన్‌స్టా అకౌంట్‌కు బహుళ ఐడీల లింకుపై ఆరా

విజయవాడ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): బెనెక్స్‌ కామ్‌ గ్రూపు ద్వారా ఉగ్రవాద ప్రచారం చేస్తున్న సానుభూతిపరుల సోషల్‌ మీడియా ఐడీలకు అనేక ఐడీలు అనుసంధానమై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి గురించి నిందితులను ప్రశ్నిస్తున్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి అజ్మతుల్లా ఖాన్‌ (బిహార్‌), లక్కీ అహ్మద్‌ (ఢిల్లీ), మిర్‌ ఆషిఫ్‌ అలీ (పశ్చిమబెంగాల్‌), జిషాన్‌ (రాజస్థాన్‌), షారూక్‌ ఖాన్‌ (మహారాష్ట్ర), షేక్‌ ఫయాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (మహారాష్ట్ర)ను విజయవాడ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఐబీ, ఇంటెలిజెన్స్‌, ఎన్‌ఐఏ అధికారులు వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. బెనెక్స్‌ కామ్‌ గ్రూపులో ఏడు రాష్ట్రాలకు చెందిన 12 మంది ఉన్న విషయం తెలిసిందే. వారి ఒక్కో ఇన్‌స్టా ఐడీకి సుమారు 30-40 మంది ఐడీలు అనుసంధానమై ఉన్నాయని గుర్తించారు. వారితో అఫ్ఘానిస్థాన్‌కు చెందిన అల్‌ హకీం షుకూర్‌ బెనెక్స్‌ గ్రూపుతో పాటు వ్యక్తిగతంగా చాటింగ్‌లు చేసినట్లు తేలింది. షుకూర్‌ పోస్టు చేసిన ప్రతి వీడియో, పీడీఎఫ్‌ ఫైళ్లను ఈ నిందితులు తమకు అనుసంధానమై ఉన్న ఇతర ఐడీలకు పంపినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. శనివారంతో కస్టడీలో నిందితుల విచారణ ముగుస్తుంది. మరోవైపు.. నిందితుల సెల్‌ఫోన్లలో ఉన్న రహస్య ఫైళ్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో బయటకు తీయిస్తున్నారు. వాటిలోని సమాచారాన్ని అధికారులు విశ్లేషిస్తున్నారు.

Updated Date - Apr 11 , 2026 | 03:40 AM