Share News

7 రాష్ట్రాలకు విస్తరించిన ఉగ్ర నీడ

ABN , Publish Date - Mar 26 , 2026 | 04:01 AM

సంచలనం సృష్టించిన విజయవాడ ఉగ్రనీడపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మరిన్ని కుట్ర కోణాలు తెలియవస్తున్నాయి. ఏపీ సహా ఏడు రాష్ట్రాలకు విస్తరించిన ఉగ్రవాద నెట్‌వర్క్‌ మూలాలపై విజయవాడ పోలీసులు దృష్టి...

7 రాష్ట్రాలకు విస్తరించిన ఉగ్ర నీడ

  • ఢిల్లీ నుంచి బెజవాడ దాకా నెట్‌వర్క్‌

  • బెనెక్స్‌ కామ్‌ పేరుతో గ్రూపు నిర్వహణ

  • సోషల్‌ మీడియాతో యువకులకు వల

  • జిహాదీ ప్రసంగాలతో ఉగ్ర ప్రచారం

  • మరో ఏడుగురిని అరెస్టుచేసిన పోలీసులు

  • వారిలో ఒక మైనర్‌..మరో ఇద్దరికి రిమాండ్‌

విజయవాడ, మార్చి 25(ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన విజయవాడ ఉగ్రనీడపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మరిన్ని కుట్ర కోణాలు తెలియవస్తున్నాయి. ఏపీ సహా ఏడు రాష్ట్రాలకు విస్తరించిన ఉగ్రవాద నెట్‌వర్క్‌ మూలాలపై విజయవాడ పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. సోషల్‌ మీడియా ద్వారా రిక్రూట్‌మెంట్లకు ప్రయత్నిస్తున్న ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు, బుధవారం మరో ఏడుగురిని నిర్బంధించారు. ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో జిహాదీ సాహిత్యాన్ని ప్రచారం చేయడంతో పాటు యువతను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా వీరు ప్రోత్సహిస్తున్నారని పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి. వారిని ఆయా రాష్ట్రాల్లో న్యాయస్థానాల్లో హాజరుపరిచి.. ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకువస్తున్నారు. విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన రెహ్మతుల్లా షరీఫ్‌, మహంతిపురానికి చెందిన డానిష్‌, భవానీపురానికి చెందిన సొహైల్‌ బేగ్‌ను విచారించే క్రమంలో బెనెక్స్‌ కామ్‌ పేరుతో ఓ గ్రూపు పని చేస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఈ గ్రూపును నడుపుతున్న అజ్మతుల్లా ఖాన్‌ (బిహార్‌), లక్కీ అహ్మద్‌ (ఢిల్లీ), మిర్‌ ఆషిఫ్‌ అలీ (పశ్చిమబెంగాల్‌), జిషాన్‌ (రాజస్థాన్‌), అబ్దుల్‌ సలాం (కర్ణాటక), షారూక్‌ ఖాన్‌, షేక్‌ ఫయాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (మహారాష్ట్ర)లను అరెస్టు చేశారు. వారిలో ఒక మైనర్‌ ఉన్నట్టు సమాచారం. వీరందరినీ గురువారం విజయవాడ కోర్టులో హాజరుపరుస్తారు. కాగా, హైదరాబాద్‌ మలక్‌పేటకు చెందిన సయిదా బేగం, కర్ణాటకలోని బళ్లారికి చెందిన అబ్దుల్‌ సలాంను విజయవాడ చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో బుధవారం హాజరుపరచగా, ఇద్దరికీ ఏప్రిల్‌ 6వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ న్యాయాధికారి బి.రాధారాణి ఆదేశాలు ఇచ్చారు. అనంతరం వారిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. సయిదా బేగం పేరుతో ఉన్న ఇన్‌స్టా ఖాతాను మరొకరు హ్యాండిల్‌ చేస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆమెకు వివాహమై, ఒక బాబు ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం భర్తతో ఆమె విడిపోయారు. తండ్రి వద్ద బాబును ఉంచి, మలక్‌పేటలోని లతీ్‌ఫఖాన్‌ అపార్ట్‌మెంట్‌లో పని మనిషిగా ఉంటున్నారు. తండ్రి గుండె జబ్బుతో, తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది. ఏడాది క్రితం ఆమెకు పరిచయమైన ఒక యువకుడు సయిదా బేగం 75 ఐడీతో ఆమెకు ఇన్‌స్టా ఖాతా తెరిచి ఇచ్చినట్టు సమాచారం. యూట్యూబ్‌ చానల్‌ కూడా నిర్వహిస్తున్నారు. ఆ యువకుడు ఎవరని పోలీసులు దృష్టి సారించారు. ఇక బళ్లారికి చెందిన అబ్దుల్‌ సలాంకు సొంత లారీ ఉంది. బాడుగలకు వెళుతుంటాడు. అల్‌ హిందీ, లాలా వంటి పేర్లతో సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్నాడు. జిహాదీ ప్రసంగాలను అతడు పోస్టు చేసినట్టు పోలీసులు గుర్తించారు. పొలంలో పనిచేస్తుండగా, అబ్దుల్‌ సలాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Mar 26 , 2026 | 04:01 AM