‘పది’ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Mar 17 , 2026 | 05:47 AM
రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యా యి. ప్రథమ భాషా పరీక్షకు 6,29,109 మందికిగాను 6,22,217 మంది హాజరయ్యారు.
అమరావతి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యా యి. ప్రథమ భాషా పరీక్షకు 6,29,109 మందికిగాను 6,22,217 మంది హాజరయ్యారు. 6852 మంది గైర్హాజరైనట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. 98.9శాతం హాజరు నమోదైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3415 కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. కడపలో ఇద్దరు, అనంతపురం ఒకరు, పల్నాడులో ఒక ఇన్విజిలేటర్ విధుల్లో నిర్లక్ష్యం వహించారని, వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు.
నదులు దాటి పరీక్ష కేంద్రానికి..
సీతానగరం, మార్చి16(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గాదెలవలసకు చెందిన టెన్త్ విద్యార్థులు సువర్ణముఖినది నది దాటి బూర్జ జడ్పీ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఇదే మండలం జానుమునివలస గ్రామానికి చెందిన అంధ విద్యార్థిని యాళ్ల రేవతి తల్లి, బంధువు సాయంతో నది దాటి బూర్జ పరీక్ష కేంద్రానికి చేరుకుంది. ఇక కొమరాడ మండలంలో కొట్టు, తుడుము గ్రామాలకు చెందిన విద్యార్థులు నాగావళి నదిని దాటుకుని కొమరాడలో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. వంతెనలు లేకపోవడంతో ఏటా ఇబ్బందులు తప్పడం లేదని ఆయా ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరీక్ష కేంద్రంలోకి పాము..
బి.కోడూరు, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): వైఎస్సార్ కడప జిల్లా బి.కోడూరు గవర్నమెంటు హైస్కూలులోని పదో తరగతి పరీక్ష కేంద్రంలోకి సోమవారం పాము చొరబడింది. ఉదయం 90.30 గంటలకు పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, విద్యార్థులను 9గంటలకు లోనికి అనుమతించారు. ఆ కేంద్రంలో ఒకటో నంబరు గదిలోకి విద్యార్థులు వెళ్లగా అప్పటికే అక్కడ పాము ఉంది. దానిని చూసిన విద్యార్థులు పాము పాము అంటూ భయంతో కేకలు వేస్తే బయటకు వచ్చారు. ఓ విద్యార్థి తండ్రి కట్టెతో పామును కొట్టి బయట పడేశాడు. తరువాత విద్యార్థులు లోపలికి వెళ్లి పరీక్షలు రాశారు.
