Share News

16 నుంచి టెన్త్‌ పరీక్షలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 01:01 AM

జిల్లాలో పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 411 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. 22,232 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.

16 నుంచి టెన్త్‌ పరీక్షలు

- జిల్లాలో 411 పరీక్షా కేంద్రాలు సిద్ధం

- హాజరుకానున్న 22,232 మంది విద్యార్థులు

- 55 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు

- పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు : డీఈవో

(మచిలీపట్నం టౌన్‌ - ఆంధ్రజ్యోతి):

జిల్లాలో పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 411 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. 22,232 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. 29 స్టోరేజ్‌ పాయింట్లలో ప్రశ్నపత్రాలను భద్రపరచనున్నారు. ట్రెజరీలు, పోలీస్‌ స్టేషన్‌లలో వీటిని భద్రపరుస్తారు. ఏ రోజుకారోజు డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు అరగంట ముందు ప్రశ్నపత్రాలు తీసుకువెళ్లేందుకు సూచనలు ఇచ్చారు. 10 రూట్లలో 20 మంది రూట్‌ ఆఫీసర్లు జిల్లా ప్రధాన కేంద్రం నుంచి ప్రశ్నపత్రాలను స్టోరేజ్‌ పాయింట్లకు పంపుతున్నారు. 55 సీ కేటగిరీ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇప్పటికే చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్ల నియామకాలను పూర్తి చేశారు. 51 మంది అదనపు జాయింట్‌ కస్టోడియన్లను నియమించారు. 1,562 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. విద్యాశాఖ, రెవెన్యూ, పోలీస్‌ శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ ఐదు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశారు.

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పరీక్షలు

ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. 50 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. మచిలీపట్నం డివిజన్‌లో 173 పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గుడివాడ డివిజన్‌లో 118, ఉయ్యూరు డివిజన్‌లో 120 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు. మచిలీపట్నం డివిజన్‌లో 173 పరీక్షా కేంద్రాల్లో 7,692 మంది రెగ్యులర్‌, 264 మంది ప్రైవేట్‌ విద్యార్ధులు, ఇలా మొత్తం 7,956 మంది పరీక్షకు హాజరవుతున్నారు. గుడివాడ డివిజన్‌లో 118 పరీక్షా కేంద్రాల్లో 6,462 మంది రెగ్యులర్‌, 341 మంది ప్రైవేట్‌ విద్యార్థులు మొత్తం కలిపి 6,803 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఉయ్యూరు డివిజన్‌లో 120 పరీక్షా కేంద్రాల్లో 7,142 మంది రెగ్యులర్‌, 331 మంది ప్రైవేట్‌ విద్యార్థులు మొత్తం కలిపి 7,473 మంది పరీక్షలు రాయనున్నారు.

హాల్‌ టికెట్‌ చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం

- యు.వి. సుబ్బారావు, డీఈవో

జిల్లాలో 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేశాం. పరీక్షల్లో ఏ విధమైన మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నాం. విద్యార్థులు హాల్‌ టికెట్‌ చూపిస్తే ఇంటి నుంచి పరీక్షా కేంద్రం, పరీక్షా కేంద్రం నుంచి ఇంటి వరకు ఉచిత బస్సు సౌకర్యం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా అనుభవజ్ఞులైన వ్యక్తిత్వ వికాస నిపుణులతో విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించాం. ఇప్పటికే హాల్‌ టికెట్లను విద్యార్థులందరికీ అందజేశాం. ఏదైనా సమస్య ఉంటే డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు తెలియజేయవచ్చు.

Updated Date - Mar 13 , 2026 | 01:01 AM