Share News

టెన్షన్‌... టెన్షన్‌!

ABN , Publish Date - Feb 02 , 2026 | 01:10 AM

టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇబ్రహీపట్నంలోని ఫెర్రీ రోడ్డులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఆదివారం ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరుపార్టీల కార్యకర్తల రాకతో అక్కడ వాతావరణం టెన్షన్‌ టెన్షన్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు.

టెన్షన్‌... టెన్షన్‌!

ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌ ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి

రింగ్‌ వద్ద అంబటి దిష్టిబొమ్మ దహనం

‘ఫెర్రీ’ రోడ్డులో పోలీసుల మోహరింపు

జోగి ఇంటికి భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు

జోగి రమేశ్‌, టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు

టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇబ్రహీపట్నంలోని ఫెర్రీ రోడ్డులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఆదివారం ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరుపార్టీల కార్యకర్తల రాకతో అక్కడ వాతావరణం టెన్షన్‌ టెన్షన్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు.

విజయవాడ/ ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ కేసులో జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మాజీ మంత్రి జోగి రమేశ్‌ పదేపదే చంద్రబాబు, లోకేశ్‌పై నోరు పారేసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కొనసాగించిన ఒరవడిని ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నారు. ఇదంతా టీడీపీ కార్యకర్తలకు ఆగ్రహాన్ని రప్పించింది. విజయవాడ, ఇబ్రహీంపట్నం, మైలవరం ప్రాంతాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు ఆదివారం ఒక్కసారిగా జోగి ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌, ఏఆర్‌ విభాగాలకు చెందిన సిబ్బందిని అధికారులు రంగంలోకి దింపారు. టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను ఇబ్రహీంపట్నం రింగ్‌లో దహనం చేసి నిరసన తెలపాలని భావించారు. ఈ కార్యక్రమానికి ఆదివారం ఉదయం ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు హాజరుకావాలని సందేశాలు పంపుకున్నారు. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు జోగి వ్యాఖ్యలపై చర్చించుకుని అప్పటికప్పుడు దాడికి బయలుదేరారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. జోగి శకుంతల ప్యాలెస్‌ అని ఉన్న అక్షరాలను కింద పడేశారు. పెట్రోలు సీసాకు నిప్పంటించి కారిడార్‌లోకి విసిరేశారు. ఇక్కడ కాసేపు గొడవ చేసిన తర్వాత రింగ్‌ వద్ద అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు.

144 సెక్షన్‌ అమలు!

జోగి రమేశ్‌ ఇంటిపై దాడి జరిగిన తర్వాత వైసీపీ శ్రేణులు అక్కడి చేరుకోవడానికి ప్రయత్నించాయి. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ దాడి నేపథ్యంలో వైసీపీ నిరసనలకు దిగే అవకాశం ఉండడంతో ఫెర్రీ రోడ్డులో 144 సెక్షన్‌ అమలు చేయాలని భావిస్తున్నారు. దీనిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

ఏబీఎన్‌ ప్రతినిధిపై దాడికి యత్నం

జోగి రమేశ్‌ ఇంటి వద్ద జరిగిన దాడిని చిత్రీకరిస్తున్న ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రతినిధిపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. మీ వల్లే ఈ దాడులు జరుగుతున్నాయి అంటూ పలువురు మహిళలు, కార్యకర్తలు ఆయనపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గద్దించారు. దీనిపై ఇతర మీడియా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గారు.

జోగికి జగన్‌ ఫోన్‌

దాడి జరిగిన తర్వాత జోగి రమేశ్‌కు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఫోన్‌ చేసి పరామర్శించారు. ఘటనకు సంబంఽధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

మా దంపతులకు ప్రాణహాని ఉంది : జోగి శకుంతల

నా కుటుంబానికి, నా భర్తకు ప్రాణహాని ఉంది. మమ్మల్ని చంపడానికే టీడీపీ కార్యకర్తలు వచ్చారు. నా భర్తకు ఏం జరిగినా దానికి ప్రభుత్వానిదే బాధ్యత, మానవత్వాన్ని మరచి అడవి మనుషుల్లా ప్రవర్తించారు. చంద్రబాబు, లోకేశ్‌కు కుటుంబాలు ఉన్నాయి. వాళ్లూ ఆలోచించుకోవాలి. బీసీ బిడ్డకు జరుగుతున్న అన్యాయాన్ని బీసీలంతా వ్యతిరేకించాలి. మా కుటుంబానికి అండగా ఉండాలి.

ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ : స్వామిదాసు, మాజీ ఎమ్మెల్యే

జోగి రమేశ్‌ ఇంటిపై కూటమి నేతలు చేసిన దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగులుతుంది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి నీచ రాజకీయాలతో చంద్రబాబు పాలన చేయడం దుర్మార్గం.

జోగి రమేష్‌పై కేసు నమోదు

మైలవరానికి చెందిన టీడీపీ కార్యకర్త కాకి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేశ్‌పై డీఎన్‌ఎస్‌ 198, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే జోగి రమేశ్‌ ఇంటిపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపైన పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Feb 02 , 2026 | 01:10 AM