డీపీఆర్ తయారీకి టెండర్లు
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:42 AM
పశ్చిమ పల్లెసీమల్లో కరువు, వలసల నివారణే లక్ష్యంగా చేపట్టిన ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణంలో మరో ముందడుగు పడింది.
ఆర్డీఎస్‌కు రూ.66.08 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ
పర్యావరణ అనుమతులకు సానుకూలంగా..
ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణంలో మరో ముందడుగు
కర్నూలు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ పల్లెసీమల్లో కరువు, వలసల నివారణే లక్ష్యంగా చేపట్టిన ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతులు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ అనుమతులు రాబట్టేందుకు డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ఎంతో ముఖ్యం. ఈ డీపీఆర్ తయారీ కోసం థర్డ్‌పార్టీ ఏజెన్సీని నియమించేందుకు టెండర్ల కోసం రూ.66.08 లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ జీవో ఆర్టీ నంబరు.94 జారీ చేశారు. ఈసీ క్లియరెన్స వస్తే ఆర్డీఎస్ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు ఉండని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అటకెక్కిస్తే, సీఎం చంద్రబాబు సారథ్యంలో మళ్లీ కొలువుదీరిన కూటమి ప్రభుత్వం వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి సారించింది. తుంగభద్ర నది ఆధారంగా ఆర్డీఎస్ నిర్మాణం చేపట్టడంతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా వెంటాడుతున్న కరువు శాశ్వతంగా కోసం ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆర్డీఎస్ కాలువ నిర్మాణం పూర్తైతే.. కోసిగి, మంత్రాలయం, నందవరం, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, సి. బెళగల్, గూడూరు, కల్లూరు, కర్నూలు మండలాల్లో 40 వేల ఎకరాలకు సాగునీరు, పలు గ్రామాలకు తాగునీరు అందుతుంది. కరువు, వలసలతో తల్లడిల్లే పశ్చిమ పల్లెలకు జీవనాడి అయిన ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణానికి గత చంద్రబాబు ప్రభుత్వం రూ.1,985.42 కోట్లు మంజూరు చేస్తూ, 2019 జనవరి 20న జీవో ఆర్‌టీ నెం.76 జారీ చేసింది. అదే ఏడాది మార్చి 7న టెండర్లు పిలువగా 4.75 శాతం అధిక రేట్లకు టెండర్లు దక్కించుకున్న హైదరాబాదుకు చెందిన ఎస్‌సీసీ లిమిటెడ్ సంస్థ కాంట్రాక్ట్ విలువ రూ.1,631.34 కోట్లకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని పనులు మొదలు పెట్టారు. కోసిగి మండలం సాతనూరు సమీపంలో ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద ఆర్డీఎస్ కుడి కాలువకు తుంగభద్ర జలాలు మళ్లించేందుకు వీలుగా హెడ్ స్లూయిస్ నిర్మాణం చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంటాక్ట్ సంస్థ పనులు ఆపేయడంతో పురోగతి అటకెక్కింది. జగన ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు గంపెడు మట్టి కూడా తీయలేదు.
ఫ పర్యావరణ అనుమతుల దిశగా..:
సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాగానే ఆర్డీఎస్ కుడి కాలువ పనులు మొదలు పెడుతారని రైతులు ఆశించారు. రెండేళ్లు కావస్తున్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో కరువు రైతులు నిరుత్సాహ పడ్డారు. తాజాగా ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన పర్యావరణ అనుమతులు రాబట్టేందుకు డీపీఆర్ తయారీ కోసం టెండర్లు పిలిచేందుకు రూ.66.08 లక్షలు మంజూరు చేయడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. భారత ప్రభుత్వం (ఎంఓఈఎప్ అండ్ సీసీ) నుంచి పర్యావరణ అనుమతులు పొందాలంటే డీపీఆర్ తయారీ ఎంతో ముఖ్యం. ఏ చిన్న అనుమానం వచ్చినా కర్రీలు పెట్టి వెనక్కి పంపుతారు. అదే జరిగితే ఈసీ అనుమతుల కోసం ఏళ్లు గడవాల్సిందే. భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ, న్యూడిల్లీలోని డబ్ల్యూఏపీసీఓఎస్ లిమిటెడ్ నిబంధనలు ప్రకారం అత్యల్ప ధర కోడ్ చేసిన ఏజెన్సీ ఖరారు చేసేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ అనుమతులు ఇచ్చారు. టెండరు ద్వారా ఎంపిక చేసిన ఏజెన్సీ ఆర్డీఎస్ కుడి కాలువ కోసం క్షేత్రస్థాయి పరిశీలన (ఫీల్డ్ స్టడీ), ఎన్విరానమెంటల్ మేనేజ్‌మెంట్ ప్లాన, ఎన్విరానమెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ డీపీఆర్ తయారు చేసి సమర్పించడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంవోఈఫ్) నుంచి పర్యావరణ పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.66.08 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
2