తెనాలిలో డ్రగ్స్ కలకలం
ABN , Publish Date - Apr 16 , 2026 | 06:05 AM
ప్రధాన నగరాలకే పరిమితమైన డ్రగ్స్ దందా ఇప్పుడు తెనాలి వంటి చిన్న పట్టణాలకూ పాకింది. బెంగళూరు నుంచి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వచ్చిన పార్శిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని...
బెంగళూరు నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులో తరలింపు
పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు
తెనాలి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): ప్రధాన నగరాలకే పరిమితమైన డ్రగ్స్ దందా ఇప్పుడు తెనాలి వంటి చిన్న పట్టణాలకూ పాకింది. బెంగళూరు నుంచి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వచ్చిన పార్శిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. తెనాలి మారీ్‌సపేటకు చెందిన కోట సంతోశ్‌కుమార్.. బెంగళూరులో హోటల్ మేనేజ్‌మెంట్ చదివే సమయంలో డ్రగ్స్ వ్యాపారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అతను, మరో ముగ్గురు స్నేహితులతో కలసి ఎండీఎంఏ డ్రగ్‌ను అక్కడి నుంచి తెనాలి తెప్పించుకోవాలనుకున్నారు. అనుకున్నట్టే బెంగళూరులో డ్రగ్స్ దందా నడిపే వ్యక్తికి రూ.14వేలు ఫోన్‌పే చేశారు. డబ్బు అందిన వెంటనే అతను ఐదు గ్రాముల డ్రగ్‌తో మాత్రల రూపంలో ఉన్న కవర్‌ను ఒక బాక్స్‌లో పెట్టి బెంగళూరు నుంచి తెనాలికి వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో కొరియర్ ద్వారా పంపారు. యువకులు దానిని అందుకునే క్రమంలో.. స్థానిక మార్కెట్ యార్డు దగ్గర్లో త్రీటౌన్ సీఐ సాంబశివరావు, ఇతర సిబ్బంది ప్యాకెట్‌లతో సహా వారిని అదుపులోకి తీసుకున్నారు. మూడు సెల్‌ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు. డ్రగ్ దందా నడిపే వ్యక్తితో పరిచయం ఉన్న సంతోశ్‌కుమార్‌కు మారీస్‌పేటలోనే కోళ్ల ఫారం, పావురాలను పెంచే ప్రదేశం ఉన్నాయి. అక్కడ వీరందరూ కలసి డ్రగ్స్‌ను సేవించేవారని నిర్ధారణ అయ్యిందన్నారు. రెండోసారి తెప్పించే ప్రయత్నంలో దొరికిపోయారని చెప్పారు.
సంతోష్‌తోపాటు తెనాలికే చెందిన గోనుగుంట్ల దత్తసాయి మహంత్, రేమాల అజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. వీరిలో అజయ్‌కుమార్ తెనాలి జిల్లా వైద్యశాలలో సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడని, దత్తసాయి మహంత్ ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడని తేలిందన్నారు. వీరితోపాటు విజయవాడకు దగ్గర్లో ఉన్న ఓ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి కూడా ఉన్నారని తెలిపారు. విశాల్ అనే యువకుడిని త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. బెంగళూరులో డ్రగ్ రాకెట్ నడుపుతున్న వ్యక్తుల గుట్టును త్వరలోనే రట్టు చేస్తామని, వారిని అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు.