Share News

వ్యవసాయానికి పది శాతం నిధులు కేటాయించాలి

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:26 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పది శాతం నిధులు కేటాయించాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాజాసాహెబ్‌, రైతు సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సురేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు.

వ్యవసాయానికి పది శాతం నిధులు కేటాయించాలి
పత్తికొండలో ధర్నా చేస్తున్న రైతులు

పత్తికొండ టౌన్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పది శాతం నిధులు కేటాయించాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాజాసాహెబ్‌, రైతు సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సురేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక సి.ఆర్‌.భవన్‌ నుంచి రైతు సంఘం ఆధ్వర్యంలో పట్టణ ర్యాలీ నిర్వహించారు. నాలుగు స్తంభాల కూడలిలో వారు మాట్లాడారు. హంద్రీనీవా పిల్ల కాలువలు పూర్తి చేసి సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేసి ఉచిత పంటలబీమా పథకాన్ని పునఃరుద్ధరించాలన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌ ఉసేన్‌సాహెబ్‌కు అందించారు. కార్యక్రమంలో నాయకులు గిడ్డయ్యగౌడ్‌, కాశీ, వీరన్న, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

ఆదోని రూరల్‌ : రాష్ట్ర బడ్జెట్‌ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందంటూ సీపీఐ, రైతు సంఘం నాయకులు ఆరోపించారు. సోమవారం సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో భీమాప్‌ కూడలి నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు గోపాల్‌ మాట్లాడుతూ నూతనంగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ కార్పొరేట్‌ వ్యవస్థలకు అనుకూలంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌ శేషఫణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

తుగ్గలి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతులకు బడ్జెట్‌వాటా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబీ రసూల్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన తుగ్గలి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీపీఐ రైతు సంఘం నాయకులు తహసీల్దార్‌ రవికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం మండల కార్యదర్శి చదువుల కాశీనాథ్‌, నరసింహులు, నాగేష్‌, తదితరులున్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:26 AM