Share News

రెండో వేసవి!.. రాష్ట్రం నిప్పుల కొలిమి

ABN , Publish Date - Jul 13 , 2026 | 03:16 AM

రాష్ట్రంలో రెండో వేసవి కాలం ప్రారంభమైందా? అన్నట్టు ఎండలు మండిపోతున్నాయి. రెండు, మూడు రోజుల క్రితం మొదలైన ఎండతీవ్రత ఆదివారం మరింత పెరిగింది.

రెండో వేసవి!.. రాష్ట్రం నిప్పుల కొలిమి

తిరుపతిలో 41 డిగ్రీలు.. మరికొన్నాళ్లు వడగాడ్పులు?

దక్షిణ చైనా సముద్రం వైపు మళ్లిన రుతుపవన గాలులు

విశాఖపట్నం, జూలై 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండో వేసవి కాలం ప్రారంభమైందా? అన్నట్టు ఎండలు మండిపోతున్నాయి. రెండు, మూడు రోజుల క్రితం మొదలైన ఎండతీవ్రత ఆదివారం మరింత పెరిగింది. కోస్తాలో పశ్చిమ గోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఎన్టీఆర్‌, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆదివారం వడగాడ్పులు వీచాయి. కోస్తాలో మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ పడమర/వాయవ్య గాలులతో వేడి వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో ఎక్కడా మేఘాలు లేకపోవడం, పశ్చిమ/వాయవ్యదిశ నుంచి పొడిగాలులు వీస్తుండంతో వేసవి పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతిలో 41, జంగమహేశ్వరపురంలో 40.5, బాపట్లలో 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజులు కోస్తాలో పలుచోట్ల వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితలంపై గంటకు 40 నుంచి 50 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తుండడం, దీనికితోడు ఎండ ప్రభావం ఉండడం వడగాడ్పులకు కారణమని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్‌ ప్రారంభం నుంచి ఆదివారం వరకు 25 శాతం లోటు వర్షపాతం ఉందని, పలు జిల్లాలు తీవ్ర వర్షాభావానికి గురికావడంతో ఖరీఫ్‌ పంటలపై ప్రభావం పడిందని వివరించారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో ఎండ తీవ్రత, వర్షాభావం కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈనెల మూడో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో వర్షాభావం ఉంటుందని తెలిపారు. ఈ నెల 22వ తేదీ తర్వాత రుతుపవనాలు పుంజుకుంటే ఖరీ్‌ఫను కొంత వరకు ఆదుకుంటుందని, లేకపోతే కరువు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - Jul 13 , 2026 | 03:16 AM