అమెరికాలో తెలుగు టెకీ దుర్మరణం
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:36 AM
అమెరికాలో ఉన్నత చదువులు చదివాడు.. అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించాడు.. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నాడు.. కానీ.. ఆ తెలుగు టెకీ కలలన్నీ గాల్లోనే కలిసిపోయాయి.
విమాన ప్రమాదంలో కర్నూలు వాసి సజీవ దహనం
స్కై డైవింగ్ చేసేందుకు వెళ్తుండగా కూలిన విమానం
మంటలు చెలరేగడంతో పైలట్ సహా 12 మంది మృతి
కర్నూలు జిల్లా తుమ్మిగనూరులో విషాద ఛాయలు
కోసిగి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఉన్నత చదువులు చదివాడు.. అక్కడే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించాడు.. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నాడు.. కానీ.. ఆ తెలుగు టెకీ కలలన్నీ గాల్లోనే కలిసిపోయాయి. అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో కర్నూలు జిల్లా కోసిగి మండలం తుమ్మిగనూరు గ్రామానికి చెందిన దాట్ల సాయికార్తీక్ వర్మ (26) దుర్మరణం పాలయ్యాడు. కార్తీక్‌వర్మ స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అయినప్పటికీ ఆయన తల్లిదండ్రులు దాట్ల సుబ్రహ్మణ్యంరాజు, పద్మావతి కర్నూలు జిల్లా తుమ్మిగనూరుకు వచ్చి స్థిరపడ్డారు. స్కై డైవింగ్ చేసేందుకు 11 మంది స్కై డైవర్లతో బయల్దేరిన సింగిల్ ఇంజిన్ ప్రైవేటు విమానం (పసిఫిక్ ఏరోస్పేస్ పీ750) బట్లర్ మెమోరియల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలింది. విమానం నేలను తాకగానే మంటలు చెలరేగడంతో పైలట్ సహా 12 మంది సజీవ దహనమయ్యారు. వీకెండ్ కావడంతో సరదాగా స్కై డైవింగ్ చేసేందుకు వెళ్లిన సాయి కార్తీక్ వర్మ కూడా దుర్మరణం పాలైనట్టు అమెరికా అధికారులు సోమవారం రాత్రి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కార్తీక్ వర్మ మృతదేహం పూర్తిగా కాలి బూడిదైనట్లు ఆయన తండ్రి సుబ్రహ్మణ్యంరాజు తెలిపారు. కడసారి చూసేందుకు కూడా నోచుకోలేకపోయామని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. విషయం తెలియగానే మృతుడి తల్లిదండ్రులు సొంతూరు భీమవరానికి వెళ్లిపోయారు.
తెలుగు సంఘాల తీవ్ర దిగ్భ్రాంతి
కార్తీక్‌వర్మ అకాల మరణ వార్త వినగానే అమెరికాలోని తెలుగు సంఘాలు తానా, నాటా ప్రతినిధులు, స్థానిక ప్రవాస భారతీయులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కార్తీక్ అవశేషాలను వీలైనంత త్వరగా భారత్‌కు పంపించడానికి రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడుతున్నామని తెలుగు సంఘాల ప్రతినిధులు తెలిపారు.