Reliance Initiative: రిలయన్స్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు విద్యార్థుల సత్తా
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:24 AM
రిలయన్స్ ఫౌండేషన్ 2025-26 విద్యా సంవత్సరానికి ప్రకటించిన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జాతీయస్థాయిలో సత్తా చాటారు
ఏపీ నుంచి 1,345 మంది.. తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): రిలయన్స్ ఫౌండేషన్ 2025-26 విద్యా సంవత్సరానికి ప్రకటించిన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జాతీయస్థాయిలో సత్తా చాటారు. ఈ ప్రతిష్టాత్మక స్కాలర్‌షి్‌పలకు దేశవ్యాప్తంగా 5,100 మంది విద్యార్థులను (యూజీ 5,000, పీజీ 100) ఎంపిక చేయగా వారిలో అత్యధిక సంఖ్యలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే మొత్తం 1,883 (ఏపీ 1,345, తెలంగాణ 538) మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల ప్రతిభ, ఆర్థిక పరిస్థితుల (మెరిట్ కమ్ మీన్స్) ఆధారంగా ఎంపిక చేసిన వారిలో 83 శాతం మంది వార్షికాదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాల నుంచే రావడం విశేషం. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా అందిస్తున్న ఈ స్కాలర్‌షిప్పులలో బాలికలు, దివ్యాంగ విద్యార్థులకు కూడా తగిన ప్రాధాన్యం లభించింది. ఈ స్కాలర్‌షిప్పులకు ఎంపికైన యూజీ విద్యార్థులకు రూ. 2 లక్షల వరకు, పీజీ విద్యార్థులకు రూ. 6 లక్షల వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. ఇప్పటివరకు రిలయన్స్ ఫౌండేషన్ వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు 33,471 స్కాలర్‌షి్‌పలను అందించి, వారికి అండగా నిలిచింది. ఈ ఆర్థిక సాయంతోపాటు విదార్థులను భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దేందుకు మెంటారింగ్, లీడర్‌షిప్ డెవల్‌పమెంట్ శిక్షణ, గ్లోబల్ అలూమ్నీ నెట్‌వర్క్ సహకారం కూడా లభిస్తుంది.
ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులే అడ్డంకి : షాలిని
తెలంగాణ నుంచి ఎంపికైనవారిలో భద్రాచలానికి చెందిన రైతు బిడ్డ యర్ర షాలిని ఒకరు. ప్రస్తుతం పంజాబ్‌లోని ఐఐటీ రోపర్‌లో బీఎస్సీ, బీఈడీ కోర్సు చదువుతున్న షాలిని స్పందిస్తూ.. ‘మాలాంటి వ్యవసాయ కుటుంబాల పిల్లలకు ఆర్థిక ఇబ్బందులే మా ఉన్నత విద్యకు అడ్డంకి. ఈ స్కాలర్‌షిప్ వల్ల నేను నా చదువుపై పూర్తి దృష్టి పెట్టగలను. నా లక్ష్యాలను సాధించడానికి ఇది గొప్ప ప్రోత్సాహం. భవిష్యత్తులో కష్టపని పనిచేసి సమాజానికి సేవ చేసేందుకు ఇది నన్ను ప్రేరేపిస్తుంది’ అని పేర్కొన్నారు.