Share News

రేపటి నుంచి ఎండ మంటలే!

ABN , Publish Date - May 18 , 2026 | 04:36 AM

రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండలు మండిపోనున్నాయి. వాయువ్య దిశ నుంచి వీచే వేడి గాలుల ప్రభావంతో ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వడగాడ్పుల తీవ్రత పెరగనున్నది.

రేపటి నుంచి ఎండ మంటలే!

  • తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులు

  • 23 వరకు గాడ్పుల హోరు

  • 45-47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే చాన్స్‌

  • ఇది ఎల్‌నినో సంవత్సరం

  • అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి

అమరావతి, విశాఖపట్నం, మే 17(ఆంధ్రజ్యోతి): రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండలు మండిపోనున్నాయి. వాయువ్య దిశ నుంచి వీచే వేడి గాలుల ప్రభావంతో ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వడగాడ్పుల తీవ్రత పెరగనున్నది. ఈ నెల 19 నాటికి మయన్మార్‌ తీరానికి ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం రానున్నది. ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో వాయువ్య భారతం నుంచి వేడిగాలులు మధ్య, దక్షిణ భారతం మీదుగా బంగాళాఖాతంలోని అల్పపీడనం దిశగా వీయనున్నాయి. ఈ ప్రభావంతో ఏపీలో ఈ నెల 19న 84 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 245 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నెల 20 నుంచి 23 వరకు ఏపీ, తెలంగాణలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ ఆచార్యుడు జీసీహెచ్‌ సత్యనారాయణ పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం వైపుగా వాయువ్య భారతం నుంచి వేడిగాలులు వీస్తాయని దీంతో ఏపీ, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో వేడి తీవ్రత పెరుగుతుందని, పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు, అంతకంటే ఎక్కువగా నమోదవుతాయని, ఒకట్రెండుచోట్ల 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ మీడియం రేంజ్‌ ఫోర్‌కాస్ట్‌ బులెటిన్‌లో అంచనా వేసిందన్నారు. గాడ్పుల తీవ్రత 25వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో 20 నుంచి 23 వరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దన్నారు. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా గాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు.


2015 ఎల్‌నినో సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 2,300 మంది వడదెబ్బకు గురై మృత్యువాడ పడ్డారన్నారు. ఈ ఏడాది కూడా ఎల్‌నినో సంవత్సరం కావడంతో వడగాడ్పుల ప్రభావం నుంచి ఉపశమనం పొందేలా ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత నెలకొంది. తమిళనాడు ఈశాన్య ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. విదర్భ నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, తిరుపతి జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండి, 42-44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లోని 21 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. మరోవైపు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా ఆదివారం అత్యధిక ఉష్ణోగ్రత మార్కాపురం జిల్లా కంభంలో 43.3 డిగ్రీలు రికార్డు అయ్యింది. అలాగే 14 జిల్లాల్లోని 65 మండలాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


మేత పక్కన పెట్టి....నీడపట్టున చేరి...!

భానుడి ప్రతాపానికి జనంతో పాటు పశుపక్ష్యాదులు సైతం అల్లాడిపోతున్నాయి. మేత కోసం బయటకు వెళ్లిన జీవులు ఎండవేడిమి తట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్నాయి. ఆదివారం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడుగుంట గ్రామ పొలాల్లో మేత కోసం వచ్చిన మేకలు మిట్ట మధ్యా హ్నం ఎండకు తాళలేక పొలా ల్లో ఉన్న వేప చెట్ల కిందకు చేరి....ఇలా సేద తీరుతూ కనిపించాయి.

Untitled-2 copy.jpg

-గుంటూరు

Updated Date - May 18 , 2026 | 05:42 AM