Share News

పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:34 AM

పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ అభిప్రాయపడ్డారు.

పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి

  • దావోస్‌లో రేవంత్‌రెడ్డి, లోకేశ్‌ స్నేహపూర్వక భేటీ

  • తెలంగాణ స్కిల్‌ క్యాంప్‌సలను సందర్శించాలని కోరిన తెలంగాణ సీఎం

  • ఏపీ విద్యా సంస్కరణలను వివరించిన లోకేశ్‌

అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ అభిప్రాయపడ్డారు. దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా గురువారం వారిద్దరూ స్నేహపూర్వకంగా సమావేశమయ్యారు. రేవంత్‌రెడ్డిని మంగళగిరి శాలువాతో లోకేశ్‌ సత్కరించి.. జ్ఞాపికను అందజేశారు. తెలంగాణ సీఎం కూడా లోకేశ్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖలో చేపట్టిన ప్రగతి సంస్కరణలు, ఐటీ ప్రగతి గురించి రేవంత్‌కు ఆయన వివరించారు. ఆంఽధ్రప్రదేశ్‌ విద్యకు నమూనాగా మారిందని, విద్యారంగంలో చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. తెలంగాణలో తాము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రేవంత్‌ వివరించారు. ఐటీఐలను స్కిల్‌ క్యాంప్‌సలుగా తీర్చిదిద్దామని.. వాటిని సందర్శించాలని లోకేశ్‌ను ఆహ్వానించారు. కోట్లాది మంది దర్శించుకునే మేడారం సమక్క, సారక్క దేవస్థానం ఆధునికీకరణ పనులు రూ.వందల కోట్లతో చేపట్టామని తెలిపారు. దశాబ్దాలుగా ఏ ఒక్క ప్రభుత్వం చూపని విధంగా చొరవ చూపామని.. రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు. మేడారం జాతరకు వచ్చి వనదేవతలను దర్శించుకోవాలని లోకేశ్‌ను రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. పెట్టుబడుల సాధనలో పోటీ పడి దేశానికే తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలువనున్నాయని ఉభయులూ వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 23 , 2026 | 05:18 AM