అమెరికాలో తెలుగు టెకీ మృతి
ABN , Publish Date - Aug 10 , 2026 | 04:24 AM
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లా చిట్వేలి మండలం జెట్టివారిపల్లెకు చెందిన దిలీప్ కుమార్ (26) మృతిచెందారు. కెంట్ స్టేట్ యూనివర్సిటీలో ..
ఎయిర్‌పోర్టులో స్నేహితుడిని దించి వస్తుండగా ప్రమాదం
ఐదు నెలల కిందటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరిక
చిట్వేలి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లా చిట్వేలి మండలం జెట్టివారిపల్లెకు చెందిన దిలీప్ కుమార్ (26) మృతిచెందారు. కెంట్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్న దిలీప్, ఐదు నెలల కిందట సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరారు. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం 7.15 గంటలకు స్నేహితుడిని ఎయిర్‌పోర్టులో దించి వస్తుండగా, మెస్‌డోనియా ఓహెచ్ ప్రాంతంలో ఎదురుగా వేగంగా వచ్చిన పికప్ ట్రక్ దిలీప్ ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో దిలీప్ కుమార్ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. దీంతో స్వగ్రామంలో ఉన్న తల్లిదండ్రులు బుంగటావుల శ్రీహరి, చాముండి దంపతుల శోకానికి అంతులేకుండాపోయింది. వీరిది మధ్యతరగతి.. వ్యవసాయ కుటుంబం. ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు దిలీప్ కుమార్‌ను ఉన్నత చదువులకు మూడేళ్ల కిందట అమెరికా పంపారు. చేతికి అందివచ్చిన కొడుకు అర్ధంతరంగా మరణించడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కాగా, శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో దిలీప్ కుమార్ మృతదేహం రావడానికి మరో ఐదు రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధిత కుటుంబానికి తోడుగా ఉంటామని తెలిపింది. దిలీప్ కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, న్యూయార్క్‌లోని కాన్సులర్ కార్యాలయం వారికి అవసరమైన సాయం అందిస్తోందని వెల్లడించింది.